తన వారికి టికెట్లకోసం బీజేపీపై ఒత్తిడి తెచ్చేలా వ్యూహం
పొత్తు కటీఫ్ అంటూ కొన్ని చానళ్ల ద్వారా లీకులు
హైదరాబాద్: పొత్తులు, ఎత్తుల మధ్య తెలుగుదేశం పార్టీలో అసమ్మతి రగులుకుంటోంది. బీజేపీతో పొత్తు, పవన్ కల్యాణ్‌ను మచ్చికచేసుకోవడం అన్న రెండు అంశాలను కాదనుకోలేక, ఇచ్చిన మాట ప్రకారం నేతలకు టికెట్లు ఇప్పించలేని పరిస్థితుల్లో నేతల హెచ్చరికలు చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయా టీడీపీ, బీజేపీలో చేరిన రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్టీ టికెట్ దక్కకపోవడం... మరోవైపు జనసేన నాయకుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ సన్నిహితుడైన పొట్లూరి వరప్రసాద్ కోసం టీడీపీ విజయవాడ స్థానాన్ని వదులుకోకపోవడం వంటి అంశాల నేపథ్యంలో చంద్రబాబు కొత్త వ్యూహానికి తెరలేపారు. అసంతృప్తుల నేపథ్యంలో పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. దీన్లో భాగంగా... ఇప్పటికే జాబితాను ప్రకటించిన తర్వాత చివరి నిమిషంలో మార్పు చేర్పులంటే బీజేపీ జాతీయ నేతలు అంగీకరించే అవకాశాలు లేకపోవడంతో అసలు బీజేపీతో పొత్తు వద్దని, తెగతెంపులు చేసుకుంటామంటూ బుధవారం రాత్రి మీడియాలో ప్రచారం జరిగేలా లీకులిచ్చారు. బీజేపీ అగ్రనేతలు దిగొస్తారనే దోస్తీ కటీఫ్ అంటూ ప్రచారంలో పెట్టారని వినిపిస్తోంది.
విజయవాడ లోక్‌సభ స్థానంలో పవన్ కల్యాణ్ సన్నిహితుడైన పొట్లూరి వరప్రసాద్‌కు అవకాశం కల్పిస్తున్నట్టు లీకులు ప్రచారం చేసి తీరా సమయానికి కేశినేని నానికే బీ ఫామ్ ఇచ్చి రంగంలోకి దిగాలని చెప్పడం జనసేన నేతల్లో ఆగ్రహం తెప్పించింది. దీంతో విజయవాడ లోక్‌సభతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపాలని పొట్లూరి బుధవారం పవన్ కల్యాణ్‌ను కోరారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు 2016లో వరప్రసాద్‌కు తప్పనిసరిగా రాజ్యసభకు అవకాశం కల్పిస్తానంటూ టీడీపీ నేతల ద్వారా రాయబారం పంపినప్పటికీ... చంద్రబాబు మాటను విశ్వసించలేమంటూ వరప్రసాద్ అన్నట్టు తెలిసింది. దీంతో పొట్లూరిని ఏలూరు లేదా రాజమండ్రి నుంచి పోటీ చేయమని కోరితే ఎలా ఉంటుందన్న అంశంపై సన్నిహితులతో బాబు చర్చించారు. రాజమండ్రి నుంచి బరిలో ఉన్న మురళీమోహన్‌ను ఏలూరుకు మార్చి, అక్కడ నుంచి మాగంటి బాబును దెందులూరు అసెంబ్లీకి మారిస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆరా తీశారు.
నర్సాపురం లోక్‌సభ స్థానాన్ని వదులుకుంటున్నామని, బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేయాలంటూ పంపిన రఘురామ కృష్ణంరాజు పేరు జాబితాలో లేకపోవడంతో గత రెండు రోజులుగా ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. ఏదేమైనా సరే తాను పోటీ చేయాల్సిందేనని భీష్మించారు. తొందరపడొద్దని తాను బీజేపీ నేతలతో మాట్లాడుతానని బాబు సర్దిజెప్పినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు విశాఖపట్నం నుంచి కావూరికి అవకాశం కల్పించాలని బాలకృష్ణ కోరుతున్నారు. దీంతో బీజేపీకి కేటాయించిన విశాఖపట్నం, నర్సాపురం స్థానాలకు బదులుగా వేరే రెండు చోట్ల అవకాశం కల్పించడానికి వీలుందా అన్న అంశంపై బాబు తర్జనభర్జన పడినట్టు తెలిసింది.
చంద్రబాబు గేమ్ షురూ..
Published Thu, Apr 17 2014 2:29 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM
Advertisement
Advertisement