బాబును నమ్మేదెలా...
Published Wed, Apr 9 2014 1:08 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :జిల్లాలో సీట్ల కేటాయింపులో బీసీలకు బాబు మొండి చెయ్యి చూపనున్నారా? బీసీలకు సీట్లు అని ప్రచారం చేసిన టీడీపీ అధినేత చివరకు తన సామాజికవర్గానికి చెందిన వారికే టిక్కెట్లు కట్టబెట్టనున్నారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీసీ సీట్లపై కొనసాగుతున్న సందిగ్ధాన్ని చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేదొకటి.. గనుక బీసీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. పైగా ఇటీవలే జడ్పీ చైర్మన్ అభ్యర్ధిత్వం విషయంలో బాబు అమలు చేసిన గేమ్ ప్లాన్, తమ వేళ్లతో తమ కళ్లే పొడిపించిన తీరుకు జిల్లాలోని బీసీ నాయకులు మనస్తాపం చెందుతున్నారు. జడ్పీ పీఠం బీసీలకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇంతవరకు చైర్మన్ అభ్యర్థిత్వం విషయంలో దోబూచులాడటంపై బీసీ నేతలు కినుక వహిస్తున్నారు. అదే జనరల్ స్థానంగా ఉంటే ఇలా చేసేవారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఆది నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన బీసీలకు వంద సీట్లిస్తాం.. బీసీలకు ఎంతగానో మేలు చేసింది తమ పార్టీయేనని మొదట్నుంచీ ఊదరగొట్టిన బాబు చివరి నిమిషంలో ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. ఇందుకు కారణం బీజేపీతో పొత్తు కారణంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో ముఖ్యనేత కోడెల శివప్రసాద్‌రావు నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వైపు చూస్తుండటమే. సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జిగా బీసీ వర్గానికి చెందిన నిమ్మకాయల రాజనారాయణ వ్యవహరిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డిపై 7,147 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ తర్వాత నిమ్మకాయల నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు. 2007లో స్థానిక సంస్థల తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. ప్రస్తుతం ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసే అవకాశం బాబు కల్పిస్తారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సింహభాగం సొంత సామాజికవర్గానికే..
నరసరావుపేట స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో రెండు రోజుల్నుంచీ కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నుంచి పోటీ చేయనున్నారని టీడీపీలోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిమ్మకాయలకు సీటు దక్కుతుందో లేదోనని జిల్లాలోని పలువురు బీసీలు ఆరా తీస్తున్నారు. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో మూడు సీట్లు ఎస్సీ రిజర్వ్ కావడంతో మిగిలిన సీట్లలో అత్యధిక భాగం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే పోటీ పడుతున్నారు. రేపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున అనగాని సత్యప్రసాద్ ఈ దఫా సీటును ఆశిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి మోపిదేవి వెంకటరమణపై 5,945 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
ఇటీవలే రేపల్లె నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు టీడీపీలో చేరారు. దీంతో ఇక్కడ సీటు కేటాయింపు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్లు మినహా మిగిలిన నియోజకవర్గాల్లోని సీట్ల విషయంలో స్పష్టత ఉంది. కానీ బీసీలకు ఎక్కడ కేటాయిస్తారనేది ఇంత వరకు తేల్చకపోవడం వారిలో ఆందోళన కలిగిస్తోంది. సత్తెనపల్లి సీటు ఎట్టి పరిస్థితుల్లో తనదేనని, తనకు అధినేత చంద్రబాబు మాటిచ్చారని నిమ్మకాయల రాజనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. కోడెలకు సత్తెనపల్లిలో అసలు ఛాన్స్ లేదని ఉద్ఘాటిస్తున్నారు. టీడీపీ టికెట్ల కేటాయింపులో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా బాబు రాజకీయానికి ఎవరు బలి పశువు కానున్నారో.. మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
రాజధానిలో కాపు కాసిన నేతలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై కాపు సామాజికవర్గం నేతల ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది. ఆ వర్గానికి చెందిన నేతలు రాజధానిలో మకాం వేసి తమ సంగతి తేల్చాలంటున్నారు. 2009, ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాపు సామాజికవర్గం నేతలకు బాబు మొండి చేయి చూపారు. ఆ చేదు అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీటు ఇస్తారని నియోజకవర్గాల్లో ఉంటే మొత్తానికి మోసం జరుగుతుందనే భావనతో రాజధానిలోనే మకాం వేశారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో సుజన చౌదరిలో ఈ వర్గం నేతలు భేటీ అయ్యారు. డీసీఎమ్మెస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చందు సాంబశివరావు, సామాజికవర్గానికి చెందిన పలువురు నేతలు కలిశారు. పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాపు సామాజికవర్గం నేతలకే సీట్లు ఇవ్వాలని, కొత్తవారికి సీట్లు ఇవ్వరాదని డిమాండ్ చేశారు. ఏదో ఇచ్చాం అనే రీతిలో కాకుండా తమ సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేయాలని కోరారు. బుధవారం ఉదయం వీరంతా రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, చంద్రబాబుతో సమావేశం కానున్నారు.
Advertisement
Advertisement