అనకొండకే బాబు ! | Chandrababu naidu is father of Anaconda | Sakshi
Sakshi News home page

అనకొండకే బాబు !

Published Thu, Apr 17 2014 2:09 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

అనకొండకే బాబు ! - Sakshi

అనకొండకే బాబు !

సర్కారీ సంస్థలన్నీ స్వాహా...
*   ప్రభుత్వ రంగ సంస్థల పాలిట పెను శాపం బాబు
*    తొమ్మిదేళ్ల పాలనలో అయినకాడికి మింగేసిన ఘనుడు
*    ఎన్నో సంస్థలను అస్మదీయలకు అప్పనంగా రాసిచ్చారు
*    ‘నామా’కు పాలేరు షుగర్స్, దేవేందర్‌కు ‘రిపబ్లిక్ ఫోర్జ్’
*   ఆసియాలోనే పెద్దదైన నిజాం షుగర్స్‌దీ అదే కథ
 
 కె.జి. రాఘవేంద్రరెడ్డి: అనకొండ. అవును. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థల పాలిట అక్షరాలా అనకొండలా మారారు. వాటిని పప్పుబెల్లాల కంటే కూడా అధ్వానంగా అస్మదీయలకు పంచిపెట్టేశారు. హౌసింగ్ బోర్డు మొదలుకుని వికలాంగుల సంస్థ, నిజాం షుగర్స్ వంటి చక్కెర ఫ్యాక్టరీల దాకా... బాబు ‘పచ్చ’ చూపు పడని ప్రభుత్వ రంగ సంస్థ అంటూ రాష్ట్రంలో ఏదీ లేనే లేదంటే అతిశయోక్తి కానే కాదు. నిజాం షుగర్స్, పాలేరు షుగర్స్, రిపబ్లిక్ ఫోర్జ్... ఇలా బాబు కబంధ హస్తాల బారిన పడి ఆయన అస్మదీయలకు ఫలహారంగా మారిన సంస్థల జాబితా కొండవీటి చాంతాడంత.
 
 ఇంత నలుపును తన కిందే పెట్టుకున్న గురివింద బాబు, అవినీతిపై పోరాడతానంటూ ఇప్పుడు నిస్సిగ్గు నినాదాలిస్తుంటే... రామోజీ సారథ్యంలో తెర వెనక నుంచి ఆయన్ను అడుగడుగునా ఆడిస్తున్న ఎల్లో మీడియానేమో వాటిని కళ్లకద్దుకుని మరీ పతాక శీర్షికల్లో ప్రచురిస్తూ తరిస్తోంది! కుక్కను చంపాలంటే ముందుగా దానిపై పిచ్చిదనే వుుద్ర వేయూలన్న నీతిని ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో అక్షరాలా ఆచరించి చూపారు బాబు. తన కన్ను పడిన సంస్థను ‘నష్టాల్లో ఉంది...’ అంటూ ప్రచారం చేయుడం, ఇంకెవరూ పోటీకి రాకుండా ‘చంద్రజాలం’ ప్రదర్శించి బినామీల ద్వారా దాన్ని దిగమింగడం... ఇదీ బాబు స్టైల్! వేల కోట్ల రూపాయల విలువైన, వేలాది మందికి ఉపాధి కల్పించిన, ప్రజా సంక్షేవూనికి నిలువుటద్దంలా నిలిచిన పలు ప్రభుత్వరంగ సంస్థల ఉసురు పోసుకున్న బాబు నిర్వాకానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు...
 
 పాలేరు షుగర్స్ ‘నామార్పణం!
 బాబు సీఎం హోదాలో పాలేరు సహకార చక్కెర మిల్లును తనకు ఇష్టుడైన అనుచరుడు నామా నాగేశ్వరరావుకు రాసిచ్చేశారు! 20 ఏళ్ల పాటు రైతులకు, కార్మికులకు కడుపు నిండా తిండి పెట్టిన ఈ మిల్లును కనీసం వాటాదారులకు కూడా తెలియకుండా ఖండఖండాలుగా తెగ్గోసి మరీ అమ్ముకుని సొమ్ము చేసుకున్నా రు! రూ.22 కోట్ల విలువైన పరిశ్రమను రూ.9.58 కోట్లకే సొంతం చేసుకున్నారు. తెగనమ్మడం సరికాదంటూ తమ ప్రభుత్వమే వేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేసినా పట్టించుకోలేదు! ‘‘పాలేరు షుగర్స్‌ను నమ్ముకుని 16,000 మందికి ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వం కొద్దిగా చేయూతనందిస్తే అది సమస్యలను అధిగమించి మెరుగైన లాభాలు ఆర్జించడం సులువే’’ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.సుబ్రహ్మణ్యం నేతత్వంలోని ఆ కమిటీ మొత్తుకున్నా బాబు పట్టించుకోలేదు. స్థానిక సహకార సంఘం అనుమతి కూడా తీసుకోకుండా 134.23 ఎకరాల భూమి, యంత్రాలతో పాటు సంస్థ విక్రయానికి నోటిఫికేషన్ ఇచ్చేశారు.
 
 ఎవరెవరు బిడ్ వేయాలి, ఎంత సొమ్ము కోట్ చేయాలి, డమ్మీ అభ్యర్థులుగా ఎవరు బిడ్ వేయాలి వంటివన్నీ ముందే పక్కాగా వ్యూహం రచించారు. 134 ఎకరాల భూమి విలువ రూ.9.4 కోట్లు, యంత్రాలు తదితరాల విలువను రూ.12 కోట్లుగా కలెక్టర్ లెక్కించగా... బాబు స్కెచ్ మేరకు నామా రూ.9,58,88,888కు, పి.వెంకటేశ్వర్లు అనే డమ్మీ అభ్యర్థి రూ.7,77,15,000కు బిడ్ వేశారు. ఇంకో విశేషమేమిటంటే బాబుకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్త గోకరాజు రంగరాజు వ్యాపారమంతా ఖమ్మం జిల్లాలోనే ఉంది. ఒకరకంగా ఖమ్మం జిల్లానే ఆయనకు ముఖ్య వ్యాపార కేంద్రం. ఆలాంటిది పాలేర్ షుగర్స్ కోసం ఆయన కనీసం బిడ్ కూడా వేయలేదు! ప్రభుత్వ రంగ పరిశ్రమలను  కారుచౌకగా చేజిక్కించుకునే విషయంలో టీడీపీ కోటరీ ఎంతటి ‘అవగాహన’తో అడుగులు వేసిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు!!
 
 నిజాం షుగర్స్‌ను వుుంచేశారు
 నిజాం షుగర్ మిల్లులు వెనుకబడిన తెలంగాణ ప్రజల పాలిట పారిశ్రామిక దేవాలయాలు. అక్కడ కూడా బాబు తన మార్కు పూజారితనం వెలగబెట్టి, చివరికి గుడిని, గుడిలోని లింగాన్ని కూడా మింగి జీర్ణం చేసేసుకున్నారు! మూడు జిల్లాల రైతు, కార్మిక కుటుంబాలకు అండగా నిలిచి అన్నం పెట్టిన నిజాం షుగర్స్ లిమిటెడ్‌ను తన సన్నిహితుడైన గోకరాజు రంగరాజుకు గిఫ్టుగా ఇచ్చేశారు. నిజాం షుగర్స్ పరిధిలోని నాలుగు మిల్లులకు విడిగా టెండర్లు పిలవగా, నిజామాబాద్‌లోని శక్కర్‌నగర్ చక్కెర మిల్లులు, డిస్టిలరీ, మొంబాజిపల్లి (మెదక్), మెట్‌పల్లి చక్కెర  మిల్లులు... ఈ నాలుగింటినీ గుండుగుత్తగా వేలానికి పెట్టారు. వీటి పరిధిలోకి వచ్చే 400 ఎకరాల భూమి, యంత్రాలు, ప్లాంట్ల వంటివాటన్నింటినీ కలిపి కేవలం రూ.10 కోట్లకే కారుచౌకగా ఇచ్చేశారు. అధికారికంగా మాత్రం రూ.65 కోట్లకు అమ్మినట్టుగా చూపి ప్రజలను వంచించారు. నిజానికి ఈ నాలుగింటి ధరను రూ.150 కోట్లుగా సహకార సంఘం ఆడిట్ విభాగం అంచనా వేసింది. జిల్లా కలెక్టర్ కూడా రూ.120 కోట్లుగా నిర్ధారించారు. ఈ అంచనాలను పక్కనపెట్టి టికోన్స్, క్రిస్టల్ అనే కన్సల్టెంటు సంస్థలతో ‘ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్’ కమిటీ లెక్కగట్టించింది. బహుళజాతి కంపెనీల చేతుల్లో కీలుబొమ్మలుగా పని చేసే ఈ సంస్థలు కూడా రూ.100 కోట్లుగా అంచనా కట్టాయి. అత్యంత విలువైన ఆ నాలుగు యూనిట్లకూ కేవలం రూ.45 కోట్లు ఇస్తానంటూ గోల్డ్‌స్టోన్ అనే సంస్థ బిడ్ వేసింది. దానికే ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది!
 
 స్విస్ చాలెంజ్ ద్వారా కుమ్మేశారు
 ప్రజా వ్యతిరేకత దృష్ట్యా... 49 శాతం ప్రైవేటు, 51 శాతం ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆ నాలుగు మిల్లులు కొనసాగుతాయంటూ రీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి గోల్డ్‌స్టోన్‌తో పాటు గోకరాజు రంగరాజుకు చెందిన డెల్టా పేపర్ మిల్స్ కూడా బిడ్డింగ్‌లో పాల్గొంది. రూ.65 కోట్లకు బిడ్ వేయడంతో దానికే ఖరారు చేశారు. ఇందుకోసం రాష్ట్రంలో అప్పటిదాకా ఎప్పుడూ వినియోగించని స్విస్ చాలెంజ్ అనే పద్ధతిని అనుసరించారు! దీని వెనక భారీ అవినీతి జరిగిందంటూ ప్రజా సంఘాలు దుమ్మెత్తిపోయడంతో ఆ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు నిజాం షుగర్స్ లిమిటెడ్ కింద నిజామాబాద్ జిల్లాలో ఉన్న 16 వేల ఎకరాల భూములను ఎరగా చూపారు బాబు. వాటి విలువను ఆ రోజుల్లోనే దాదాపు రూ.100 కోట్లుగా జిల్లా కలెక్టర్ నిర్ధారించారు. అంత భూమిని ఎవరికి, ఎలా కట్టబెట్టారన్నది ఇప్పటికీ రహస్యమే. 2,900 ఎకరాల భూమిని మూడు దఫాలుగా వేలం వేసి కేవలం రూ.8.72 కోట్లకు ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు.
 
 మరో 2,000 ఎకరాలలో కార్మికులకు ఇళ్ల స్థలాలిచ్చినట్టు, ఇంకో 6,000 ఎకరాలను వీఆర్‌ఎస్ తీసుకున్న కార్మికులకు పంచినట్టు రికార్డులు సృష్టించారు. నిజానికి నిజాం షుగర్స్ భూములు పొందిన వారు వందల సంఖ్య దాటరు. తక్కువ ధర లెక్కగట్టడం ద్వారా ఖజానాకు రూ.300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని వైఎస్ హయాంలో దీనిపై ఏర్పాటైన సభా సంఘం స్పష్టంగా తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని నిజాం షుగర్స్ పుట్టి ముంచడంలో బాబు నిర్వాకాన్ని అతి సన్నిహితంగా గమనించిన మాజీ ఐఏఎస్ అధికారి పి.సి.పరేఖ్ తన తాజా పుస్తకంలో సవివరంగా బయటపెట్టడం తెలిసిందే. తాను వద్దు, వద్దంటూ మొత్తుకుంటున్నా, ‘రాజకీయ అనివార్యతలు’ అనే సాకుతో బాబు పని కానిచ్చేశారని అందులో ఆయన స్పష్టంగా వెల్లడించారు.
 
  పోర్టులపైనా వేటే!
 పోర్టుల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే క్రమంలో చంద్రబాబు అంతులేని అవినీతికి పాల్పడ్డారంటూ అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. కాకినాడ ఓడరేవు కాంట్రాక్టును సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సీ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎస్‌పీ) అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఇది అప్పటి మలేసియా ప్రధాని మహతీర్ మహ్మద్ కొడుకు బినామీ అనే ప్రచారముంది.
 
 ఆ సంస్థకు 20 ఏళ్ల పాటు ఆపరేట్, మెయింటెయిన్, షేర్, ట్రాన్స్‌ఫర్ (ఓఎంఎస్‌టీ) ప్రాతిపదికన కాంట్రాక్ట్ కట్టబెడుతూ 1999 మార్చి 19న బాబు ఎంవోయూ కూడా కుదుర్చుకున్నారు. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధిని కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని 1997లోనే బాబు నిర్ణయించారు. బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (బూట్) పద్ధతిన నాట్కో సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకిచ్చారు. ఇక గంగవరం పోర్టును బాబు ప్రభుత్వం 2003 ఆగస్టులో ప్రైవేటీకరించింది. దీన్ని బూట్ ప్రాతిపదికన డీవీఎస్ రాజు కన్సార్షియానికి అప్పగించారు. 30 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలూ కట్టబెట్టారు. పోర్టు కోసం 2 వేల ఎకరాలకు పైగా భూమిని బాబు ప్రభుత్వమే సేకరించి దానికి అప్పగించింది. ప్రకాశం జిల్లాలోని వాడరేవు పోర్టు నిర్మాణ పనులను ఇండియన్ బెరైటీస్ అండ్ కెమికల్స్, వామ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, షిప్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలోని కన్సార్షియంకు కట్టబెట్టారు బాబు. వీటన్నింట్లోనూ వేల కోట్లు దండుకున్నారని అప్పట్లో బలంగా విన్పించింది.
 
 అన్నీ అస్మదీయుల పరమే...
-    రూ.35 కోట్ల విలువచేసే నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును కేవలం రూ.12.33 కోట్లకు రిత్విక్ ఎంటర్‌ప్రైజెస్ యజమాని, తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేశ్‌కు బాబు రాసిచ్చారు. నెల్లూరు పట్టణ కేంద్రంలో ఉన్న ఈ మిల్లు విలువ రూ.35 కోట్లని సహకార సంఘం ఆడిట్ విభాగం అంచనా వేసినా బాబు పట్టించుకోలేదు. మిల్లు తన పరమయ్యాక కేవలం అందులోని యంత్రాలనే సీఎం రమేశ్ రూ.7 కోట్లకు అమ్ముకున్నారు! అంతేగాక భూమిని పాట్లుగా చేసి అపారంగా వెనకేసుకున్నారు.
-   రూ.16 కోట్ల విలువైన గురజాల చక్కెర మిల్లు, రూ.30 కోట్ల పలికే ఇంకొల్లు నూలు మిల్లు రెండింటినీ కలిపి కారుచౌకగా, అంటే రూ. 9.86 కోట్లకు నూజివీడు సీడ్స్ యజమాని మండవ ప్రభాకర్‌రావుకు సంతర్పణ చేశారు బాబు. వాటిని కొనేందుకు చెన్నైకి చెందిన ఓ సంస్థ రూ.16 కోట్లకు టెండర్ వేసినా సాంకేతిక కారణాల సాకుతో దాన్ని అడ్డు తప్పించిన ఘనుడు బాబు!
-  ఇక... పక్కా 420 విజన్ అయిన ‘విజన్ 2020’లో భాగంగా సంక్షేమ పథకాలన్నింటినీ అటకెక్కిస్తానని, ప్రభుత్వ రంగ సంస్థల ఊపిరి తీసేస్తానని, వాటి ఉద్యోగుల ఉసురు పోసుకుంటానని పేర్కొంటూ ప్రపంచ బ్యాంకుకు చంద్రబాబు ఏకంగా లేఖ రాయడం తెలిసిందే. పునర్నిర్మాణ పథకం (ఏపీఈఆర్‌పీ) పేరుతో తొలి దశలో నంద్యాల, రాజమండ్రి, నెల్లూరు, అదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లులను, నిజాం షుగర్స్, ఆల్విన్ వాచ్ కంపెనీను విజయవంతంగా మూసేశారు బాబు. ఏపీఇఆర్‌పీ రెండో దశలో ఆర్టీసీ, సింగరేణి కాలరీస్‌లతో పాటు హౌజింగ్ బోర్డు, కోళ్ల,మాంసం అభివృద్ధి కార్పొరేషన్, టెక్స్‌టైల్స్ కార్పొరేషన్, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, వికలాంగుల సంస్థ, బివరేజ్ కార్పొరేషన్లలో ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాక అప్పటిదాకా నష్టాల్లో ఉన్న ఈ ప్రభుత్వరంగ సంస్థలను లాభాల బాట పట్టించి చూపారు. తానొస్తే మళ్లీ ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తానంటున్న బాబు, వాటి ఉసురు పోసుకుంటానని చెప్పకనే చెబుతున్నారన్నమాట!
 
 కుట్టుమిషనే జీవనాధారం..
 బోధన్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణతో ఉద్యోగం కోల్పోయిన  నాభర్త నర్సింగ్ రావ్ గుండె పగిలి చనిపోయారు. ఆయన గుండెపోటుతో 2005లో  చనిపోగా కుటుంబాన్ని పోషించడానికి కుట్టు పని చేస్తున్నా. అంతకు మించి ఇప్పడు మాకే దిక్కు లేదు. కుట్టుమిషన్ మీద వచ్చే  ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. ఉన్నంతలో పిల్లలను చదివించేందుకు ప్రయత్నిస్తున్నా.    

- మృతి చెందిన కార్మికుడు  నర్సింగ్ రావ్ భార్య రుక్మిణీ
 
 పిల్లల కష్టంపై ఆధారపడ్డాం ...

 నిజాం షుగర్స్ ప్యా క్టరీలో ఉద్యోగం కోల్పోవడం వలన అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నాము. పిల్లలను ఉన్నత చదువులు చదివించలేక, బయట పనిచేయలేక సతమతమయ్యాము. పిల్లలను పనికి పంపించి వారికి వచ్చే ఆదాయంపై ఆధారపడి బతుకుతున్నాము. ప్యాక్టరీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మా పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించాలి.                                                         
 - రాజయ్య, కార్మికుడు
 
 సీబీఐ విచారణ చేపట్టాలి...
 నిజాం షుగర్స్ ప్రైవేటీకరణలో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి. ఆసియాలోనే అతి పెద్ద నిజాం చక్కెర  కర్మాగారాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా, నష్టాల్లో ఉందన్న సాకుతో అతితక్కువ ధరకే ప్రైవేట్ కంపనీకి ధారాదత్తం చేసింది. ఎన్‌ఎస్‌ఎఫ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి.     
 - అప్పిరెడ్డి, నిజాంషుగర్స్‌పరిరక్షణ కమిటీ కన్వీనర్  
 
 రోడ్డున పడేసింది చంద్రబాబే
 మా బతుక్కి భరోసా ఇచ్చిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్వలాభం కోసం చంద్రబాబు అమ్మేశాడు. కార్మికులమంతా రోడ్డున పడ్డాం. విధిలేక తోపుడుబండిపై పండ్లు అమ్ముకుని బతుకుతున్నా. ఇంత దారుణ పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. చంద్రబాబు వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఆయన మమ్మల్ని నిలువునా ముంచాడు.    
 -  కె.ఫక్రుద్దీన్,
 నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుడు

 
 నిరుద్యోగుల పొట్టగొట్టాడు
 చంద్రబాబు నిరుద్యోగాన్ని పెంచి పోషించాడు. గుంతకల్లు ఏసీఎస్ మిల్లు మూతపడటంతో మా పిల్లలు నిరుద్యోగులుగా మిగిలారు. ఉద్యోగాలు ఇవ్వకుండా చంద్రబాబు పొట్ట కొట్టారు. వివిధ సంస్థలను ప్రైవేటు రంగానికి అప్పగించి తీవ్రంగా దెబ్బతీశారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిలుపు చేయించిన ఘనతా ఆయనకే దక్కుతుంది.     
 - లక్ష్మీదేవి, స్పిన్నింగ్ మిల్లు
     కార్మికుడు సోడాల రంగన్న భార్య

 
 ఆర్థికంగా నష్టపోయాం
 ‘‘ఆముదాలవలస చక్కెర కర్మాగారం మూతపడటంతో ఆర్థికంగా, వ్యాపారపరంగా చాలా నష్టపోయాం. ఒకప్పుడు వ్యాపార లావాదేవీలతో కళకళలాడిన ఆమదాలవలస పట్టణం నేడు వెలవెలబోతోంది. సినిమా థియేటర్లు, హోటళ్లు, కొన్ని వస్త్ర దుకాణాలు కూడా మూతపడ్డాయి’’    

- కె.శ్రీనివాసరావు, వ్యాపారి
 
 ఫోర్జ్... దేవేందర్ పరం
 చారిత్రక నేపథ్యమున్న రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ ఉదంతం బాబు బరితెగింపునకు మరో మచ్చుతునక. దాదాపు 2,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఈ కర్మాగారాన్ని అప్పటి అస్మదీయుడు, టీడీపీలో నంబర్ 2 అన్పించుకున్న మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌కు రాసిచ్చారు బాబు. మౌలాలీలోని 26 ఎకరాల ఆర్‌ఎఫ్‌సీ మిల్లు స్థలం, రన్నింగ్ కండిషన్‌లో ఉన్న యంత్రాల విలువ అంతా కలిపి రూ.60 కోట్లని అప్పట్లో లెక్కేశారు.
 
 26 ఎకరాల విలువే రూ.25 కోట్లని ఎస్‌బీఐ అంచనా వేసింది. ఆ కంపెనీని 2001లో బాబు వేలానికి పెట్టగా నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న దేవేందర్, తన సోదరుడు అశోక్ గౌడ్‌తో రూ.14.47 కోట్లకు టెండర్ వేయించారు. బాబు సూచన మేరకు ఇతరులెవరూ టెండర్ వేయకపోవడంతో కంపెనీ దేవేందర్ పరమైంది. తర్వాత దాని యంత్రాలనే అశోక్ గౌడ్ రూ.11 కోట్లకు అమ్ముకున్నారు. ఇక 20 ఎకరాలను ప్లాట్లు చేసి అమ్ముకొని దాదాపు రూ.60 కోట్లు ఆర్జించినట్టు సీఎల్‌పీ ఉప నేత దివంగత పి.జనార్దన్‌రెడ్డి అప్పట్లోనే అసెంబ్లీలోనే వ్యాఖ్యానించారు!
 
 బతుకుల్లో నిప్పులు పోశాడు
 ‘‘మా జీవనాధారమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని చంద్రబాబు అన్యాయంగా అమ్మేశాడు. ఉద్యోగాలను పీకేశాడు. మా బతుకుల్లో నిప్పులు పోశాడు. విధిలేక వడ్రంగం పనితో పొట్టపోసుకుంటున్నా. ఇప్పుడేమో ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ చిలుక పలుకులు పలుకుతున్నాడు. దయచేసి చెబుతున్నా. చంద్రబాబును నమ్మొద్దు. ఆయన పచ్చి మోసగాడు’’
 - వి.శ్రీరాములు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ
 కార్మికుడు, హిందూపురం, అనంతపురం జిల్లా

 
 కార్మికులు రోడ్డున పడ్డారు...
 చంద్రబాబు నిర్ణయం వేలాది కార్మిక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.  లాభాల్లో నడిచే ప్యాక్టరీని ప్రైవేటుపరం చేయగా, 2002 ఏప్రిల్‌లో కార్మికులకు వీఆర్‌ఎస్ ఇచ్చారు. దాంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వారిలో అనేక మంది గుండె పగిలి చనిపోయారు. వారి కుటుంబాలు ఇప్పటికీ ఆకలికేకలతో అలమటిస్తున్నాయి. ప్రభుత్వానికి కూడా రూ. 308 కోట్లు నష్టం వాటిల్లింది.
 - జి.రాజయ్య, బీఎంఎస్ రాష్ట్ర నేత
 
 లాభాల బాట పట్టించిన వైఎస్

 బాబు హయాంలో నష్టాల్లో కూరుకుపోయిన పలు ప్రభుత్వ రంగ సంస్థలను వైఎస్ లాభాల బాట పట్టించి చూపారు. చంద్రబాబు సొంత జిల్లా  చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర, చిత్తూరు చక్కెర మిల్లులను తెగనమ్మేందుకు బాబు తన హయాంలో అంతా సిద్ధం చేశారు. టెండర్లు కోరుతూ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఆలోపే ఎన్నికలొచ్చాయి. జనం ఆయన్ను ఇంటికి సాగనంపారు. వైఎస్ అధికారంలోకి రాగానే ఈ ప్రైవేటీకరణ ప్రక్రియును నిలిపేశారు. మిల్లులకు ఊపిరి పోశారు. తవు ప్లాను అలా బెడిసికొట్టడం బాబు కోటరీకి ఇప్పటికీ మింగుడు పడటం లేదు. అందుకే... ‘ఆయున వస్తేనే బాగుంటుంది’ అంటూ ఇప్పుడు దింపుడుకళ్లం ప్రచారానికి దిగుతోంది!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement