సరైన నాయకున్ని ఎన్నుకోండి: జయప్రకాష్‌నారాయణ
లోక్‌సత్తా అధినేత, మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి జయప్రకాష్‌నారాయణ
శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: సమాజం బాగుపడాలంటే సరైన నాయకున్ని ఎన్నుకోవాలని లోక్‌సత్తా అధినేత, మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి జయప్రకాష్‌నారాయణ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మద్యం, డబ్బుకు అమ్ముడు పోయి ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. 50 కోట్లతో లోక్‌సభ టికెట్ కొని, 100 కోట్లు ఖర్చుపెట్టి గెలుపొందితే ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
ఎక్కడ చూచినా అవినీతి, కుంభకోణాలే కనిపిస్తున్నాయన్నారు. రైతులకు మద్దతు ధర కలిపించడానికి, ఆహార ధాన్యాలు విదేశాలకు ఎగుమతి కావటానికి ఎంతగానో కృషి చేశానన్నారు. ప్రతి యేడాదికి కోటిన్నర మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా కేవలం 10, 15 లక్షల మందికే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో విదేశీ ఉత్పత్తుల పై మన దేశం ఆధారపడుతుందన్నారు.
పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఇంతకు ముందు కూకట్‌పల్లి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎంతో అభివృద్ధి చేశానన్నారు. ఒక్కసారి అవకాశం కలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాన్నారు. మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్థి లింగమూర్తి మాట్లాడుతూ... నిస్వార్థంగా ఓటు వేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాల్లో నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో లోక్‌సత్తానాయకలు, కార్యకర్తలు పాల్గొన్నారు.