నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ఎన్నికల విధుల్లో ఉన్న అధికారి, సిబ్బందిని అక్రమంగా నిర్బంధించిన ఘటన వాకాడు సీఐ చెంచురామారావును సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అయనపై క్రిమినల్ కేసు సైతం నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ రాత్రి చిట్టమూరు మండలం మల్లాంలో నగదు పంపిణీ జరుగుతోందని సమాచారం అందుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్-3 అధికారి మోజెస్ అక్కడకి చేరుకున్నారు. ఒకరి నుంచి రూ.43 వేలు స్వాధీనం చేసుకుని, ఉన్నతాధికారులతో పాటు ఎస్సై రవినాయక్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రవినాయక్ నగదును పోలీసుస్టేషన్‌లో అప్పగించాలని చెప్పి వెళ్లిపోయారు. అనంతరం స్క్వాడ్ అధికారులు స్టేషన్‌కు వస్తుండగా మార్గమధ్యంలో వాకాడు సీఐ చెంచురామారావు వారి వాహనాన్ని అడ్డుకున్నారు.
ఏ అధికారంతో నగదు స్వాధీనం చేసుకున్నావంటూ మోజెస్‌తో పాటు సిబ్బందిపై చిందులేశారు. వారు వాదనకు దిగడంతో కోపోద్రిక్తుడైన సీఐ చిట్టమూరు స్టేషన్‌కు తరలించి 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్బంధించారు. మోజెస్‌పై కేసు నమోదు చేయాలని ఎస్సై రవినాయక్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆయన ససేమిరా అనడంతో ఆక్రోశం వెళ్లగక్కి వెళ్లిపోయారు. తనకు జరిగిన అవమానంపై 11వ తేదీ గూడూరు ఆర్డీఓ శ్రీనివాసరావుకు మోజెస్ ఫిర్యాదు చేశారు.
దీనిపై తహశీల్దార్‌తో విచారణ చేయించి ఆయన అక్రమ నిర్బంధం నిజమేనని నిర్ధారించుకున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్, ఎస్పీతో ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. స్పందించిన ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని గూడూరు డీఎస్పీ చౌడేశ్వరిని ఆదేశించారు. ఆమె సకాలంలో నివేదిక అందించకపోవడంతో నెల్లూరు సీసీఎస్ ఓఎస్డీ శిల్పవల్లికి సోమవారం ఆ బాధ్యతలు అప్పజెప్పారు. ఆమె విచారణలో అక్రమ నిర్బంధం నిజమేనని తేలడంతో సీఐను వీఆర్‌లో రిపోర్టు చేసుకోవాలని మంగళశారం ఎస్పీ ఆదేశించారు. అనంతరం విషయాన్ని ఐజీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన మంగళవారం రాత్రి చెంచురామారావును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
త్వరలో క్రిమినల్ కేసు?
సీఐ చెంచురామారావుపై త్వరలో క్రిమినల్ కేసు నమోదుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మోజెస్‌పై కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన ఎస్సై రవినాయక్‌పై కక్ష పెంచుకుని, మంగళవారం ఓ పథకం ప్రకారమే చిట్టమూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఆయనపై దాడికి దిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ అధికారిగా ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌ను నియమించారు. వెంటనే రంగంలోకి దిగిన ఆయన విచారణ చేపట్టారు. సీఐ అనుచితంగా వ్యవహరించాడని విచారణలో తేలినట్టు తెలిసింది. ఈ క్రమంలో సీఐపై క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఐ నెల్లూరు నగరం విడిచి పోవద్దని గుంటూర్ రేంజ్ ఐజీ సునీల్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
మొదటి నుంచి అంతే
చెంచురామారావు ఆది నుంచి వివాదాస్పదుడే. గతం లో పనిచేసిన అన్ని చోట్లా పలు ఆరోపణలు ఎదుర్కొనట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని తెలిసింది. వాకాడు సీఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇసుక, సిలికా వ్యాపారులతో సంబంధాలు ఏర్పరచుకుని అక్రమ రవాణాకు సహకరిస్తున్నాడని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈయన వ్యవహారంపై పలువురు గూడూరు డీఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐ చెంచురామారావుకు వత్తాసు పలుకుతున్న వారిపైనా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది.
టీడీపీ నేతలకు వత్తాసు
గూడూరు: మల్లాంలో సర్పంచ్, టీడీపీ నేత సునీల్‌రెడ్డి నగదు పంపిణీ చేస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది టీడీపీకి కొమ్ముకాస్తున్న సీఐ చెంచురామారావుకు కోపం తెప్పిం చిందని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఆయన వెంటనే రంగంలోకి దిగి మార్గమధ్యలోనే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి మోజెస్‌ను అడ్డుకుని స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించినట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు రవాణా చేస్తున్న రూ.2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దీన్ని అధికారికంగా చూపకుండా పంచుకునే విషయంలోనూ సీఐ, ఎస్సైల మధ్య విబేధాలు తలెత్తాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బాధ్యతల నుంచి తప్పించాలని విన్నపం
ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిగా పనిచేయడం తన వల్ల కాదని, తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని మోజెస్ మంగళవారం గూడూరు ఆర్డీఓకు విన్నవించారు. నిజాయితీగా పనిచేస్తున్న తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఆర్డీఓ విధుల నుంచి తప్పిస్తానని హామీ ఇచ్చారు.
సీఐపై వేటు పడింది
Published Wed, Apr 16 2014 2:20 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement