నేడే మెగా పొలిటికల్ ఫైట్
పవన్ వర్సెస్ చిరు
అభిమానుల పోటాపోటీ రాజకీయ భేటీలు
విశాఖలో పవన్ కల్యాణ్ జనసేన రెండోసభ
హైదరాబాద్‌లో చిరంజీవి యువత రాష్ట్ర స్థాయి భేటీ
చిరంజీవి యువత భేటీలో రాజకీయ తీర్మానం?
సాక్షి, హైదరాబాద్: నిన్న మొన్నటి దాకా ఒక్కటిగా ఉన్న చిరంజీవి, పవన్‌కల్యాణ్ అభిమానుల మధ్య ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయ యుద్ధానికి తెరలేచింది. అభిమాన హీరోలలో ఎవరి సినిమా విడుదలైనా.. ఎవరి సినిమా విజయవంతమైనా కలసికట్టుగా విజయోత్సవాలు జరుపుకునే అభిమానులు రెండుగా చీలిపోయి ఢీ అంటే ఢీ అంటున్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్, చిరంజీవి కుమారుడు రాంచరణ్, అల్లు అర్జున్‌ల సినీ అభిమానులందరూ వేరువేరు సంఘాలుగా పనిచేసుకుంటున్నప్పటికీ అందరూ ఇప్పటివరకూ చిరంజీవి యువత గొడుగు కిందే పనిచేస్తున్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపనతో ఆ కుటుంబ అభిమానుల సంఘంలో చీలిక ఏర్పడింది. పవన్‌కల్యాణ్ అభిమానులు గురువారం జనసేన పార్టీ రెండో సమావేశాన్ని విశాఖపట్నంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుండగా... దానికి పోటీగా అదే రోజు చిరంజీవి అభిమానులు హైదరాబాద్‌లో చిరంజీవి యువత రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిరంజీవి యువత ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగే ఈ కార్యక్రమానికి రాంచరణ్ హాజరై కేక్ కట్ చేయనున్నారు. అక్కడ హాజరయ్యే అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. ఆ తరువాత ఫిలింనగర్ క్లబ్‌లో చిరంజీవి యువత రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో అభిమాన హీరోల్లో ఒకరైన చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో, మరొకరు పవన్‌కల్యాణ్ కాంగ్రెస్ వ్యతిరేకంగా జనసేన పార్టీ స్థాపించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇద్దరు హీరోలు రాజకీయంగా భిన్న వైఖరులతో ఉండడంతో అభిమానులుగా తాము ఎవరి వైపు ఉండాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించి ఒక తీర్మానం ప్రకటించనున్నట్టు చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు స్వామినాయుడు ‘సాక్షి’తో చెప్పారు. చర్చ తరువాత అభిమానులందరి మద్దతు చిరంజీవికేనంటూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చిరంజీవి యువత రాష్ట్ర స్థాయి సమావేశం సాధారణంగా ఎప్పుడు జరిగినా ఆ కుటుంబ హీరోలలో ఎవరో ఒకరు హాజరుకావడం దాదాపు అనవాయితీ కొనసాగుతుంది. అయితే గురువారం నాటి సమావేశానికి హీరోలందరూ దూరంగా ఉంటున్నారు.
విశాఖలో పవన్ అభిమానుల హడావుడి
జనసేన పార్టీ ఏర్పాటు ప్రకటన తరువాత పవన్‌కల్యాణ్ విశాఖపట్నంలోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో గురువారం తన రెండవ రాజకీయ సభను నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో సభా వేదిక నుంచి పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తారని అభిమానులు చెబుతున్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన తొలి సభ వేదికపై కేవలం పవన్‌కల్యాణ్ ఒక్కరు మాత్రమే ఉండగా.. విశాఖ సభలో పార్టీకి సంబంధించిన సహచరుల ఉంటారా లేదా అన్న దానిపై స్పష్టతలేదు. అయితే పార్టీకి సంబంధించి పవన్‌కల్యాణ్ గత వారం పది రోజులుగా కొంత కసరత్తు పూర్తి చేశారని.. జనసేన నేతలు కొందరిని ఈ సభ ద్వారా అభిమానులకు, ప్రజలకు పరిచయం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. జనసేన పార్టీ రాజకీయ సిద్ధాంతంతో కూడిన ‘ఇజం’ పుస్తకాన్ని పవన్ ఈ సభలో ఆవిష్కరించనున్నారు. జనసేన ఆధ్వర్యంలో బుధవారం అభిమానుల నుంచి పార్టీపై అభిప్రాయ సేకరణ పేరుతో వెబ్ మీడియా పోటీ నిర్వహించారు. పోటీలో పాల్గొన్న కొందరిని విజేతలు గుర్తించి వారికి పవన్‌కల్యాణ్ సంతకంతో కూడిన ఇజం పుస్తకాన్ని అందజేయనున్నట్టు ప్రకటించారు.