కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఇది శుభపరిణామం... చారిత్రాత్మక రోజు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ జిల్లాల ఎన్నికల పరిశీలకులు వైఎస్ వివేకానందరెడ్డి అభిప్రాయపడ్డారు. కందుల సోదరులతో పాటు, మాజీ ఎమ్మెల్యే వెంకటశివారెడ్డి వారి అనుచరులు శనివారం వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకా మాట్లాడుతూ కాంగ్రెస్, బీజెపీ, టీడీపీ కలిసి పనిగట్టుకుని రాష్ట్రాన్ని విభజించాయన్నారు. విభజనకు సహకరించిన పార్టీలే నేడు ఓట్లు వేయమని వస్తున్నాయని.. ప్రజలకు జ్ఞాపకశక్తి లేదనుకుంటున్నారని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలంటే కడప బిడ్డ ముఖ్యమంత్రి కావాలన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో కందుల సోదరులు పార్టీలో చేరుతున్నందుకు అభినందనలు తెలిపారు.
వైఎస్‌ఆర్ సీపీ సీజీసీ సభ్యులు రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ కందుల సోదరుల రాకతో పార్టీకి నిండుదనం వచ్చిందన్నారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ కందుల సోదరుల చేరికతో ఫ్యాను గాలికి సుడిగాలి తోడైనట్లయిందన్నారు. కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా మాట్లాడుతూ వైఎస్, కందుల కుటుంబాలు కలిస్తే జిల్లాలో అన్ని పార్టీలు కొట్టుకుపోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కందుల శివానందరెడ్డి కుమారుడు కందుల నాని, రాజోలి వీరారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాంప్రసాద్‌రెడ్డి, ఆసం నరసింహారెడ్డి, నారు మాధవరెడ్డి, పి.ఎన్.ఎస్.మూర్తి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎంపీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలో పనిచేసేవారికి గుర్తింపు లేదు
చంద్రబాబు కుయుక్తులు, కుతంత్రాలు నేను ముందు తెలుసుకున్నా.. కందుల సోదరులు కొద్దిగా ఆలస్యంగాా తెలుసుకున్నారు.. టీడీపీలో పనిచేసేవారికి గుర్తింపులేదు. కాంగ్రెస్ కేబినేట్‌లో ఉన్న వారందరినీ టీడీపీలోకి తెచ్చి నింపేశారు.
- రఘురామిరెడ్డి,వైఎస్‌ఆర్ సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యులు
వైఎస్‌ఆర్ సీపీ బలం రెట్టింపవుతుంది..
కందుల కుటంబీకుల చేరికతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ బలం రెట్టింపు కావడం ఖాయం. టీడీపీ కోసం త్యాగాలు చేసిన వారిని ఆ పార్టీ విస్మరిస్తోంది. త్వరలోనే ఆ పార్టీ భూస్థాపితం కాక తప్పదు. అందరం కలిసి పనిచేసి వైఎస్ జగన్‌ను సీఎం చేద్దాం.
- వైఎస్ అవినాష్‌రెడ్డి,కడప ఎంపీ అభ్యర్థి
వారిది 10మందికి సేవ చేసిన కుటుంబం
జిల్లా రాజకీయాల్లో కందుల కుటుంబం చక్రం తిప్పింది. వారిది పది మందికి సేవ చేసిన కుటుంబమే కానీ.. డబ్బులు కూడగట్టుకున్న కుటుంబం కాదు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాలలో రాణిస్తూ వస్తున్నారు.
- సురేష్‌బాబు,వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు
జిల్లా అభివృద్ధి కోసమే
- కందుల శివానందరెడ్డి
35ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఎదుగూ.. బొదుగూ లేదు.. ైవైఎస్ జగన్ మా వాడు.. ఆయనకు వయస్సు ఉంది.. ఆలోచన శక్తి ఉంది.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఉంది. లబ్ధి పొందడానికో.. ఇంకో దానికో మేం పార్టీ మారడంలేదు. షరతులు లేకుండా జిల్లా అభివృద్ధి కోసమే చేరుతున్నాం.
కాంట్రాక్టర్ల గుప్పిట్లో టీడీపీ
- కందుల
రాజమోహన్‌రెడ్డి
టీడీపీ తరపున మూడు సార్లు పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేశా. ఆ పార్టీ మాకేం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ రాజకీయాలకు సంబంధంలేని కాంట్రాక్టర్ల చేతుల్లో బందీ అయ్యింది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రకు ఒక్కొక్కరు చొప్పున రాజకీయ అనుభవంలేని వ్యక్తులపై ఆధారపడి నడుస్తోంది.
జగన్‌తోనే వైఎస్ ఆశయసాధన
- ముండ్ల వెంకటశివారెడ్డి
ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. ప్రజలలో విశ్వాసం, నమ్మకాన్ని కలిగించింది ఎన్‌టీఆర్, వైఎస్‌ఆర్ మాత్రమే. వైఎస్ ఏ పని చేపట్టినా వంద శాతం అమలు చేయాలన్న దృక్పథం కలిగిన నాయకుడు. వైఎస్‌ఆర్ ఆశయాలను వైఎస్ జగన్ మాత్రమే నెరవేర్చగలరు. జిల్లా అభివృద్థి పథంలో నడవాలంటే జగన్ సీఎం కావాలి.
శుభ పరిణామం
Published Sun, Apr 27 2014 2:21 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement