మైనారిటీ అలర్ట్!
* 17 స్థానాల్లో 21 మంది కాంగ్రెస్ ముస్లిం తిరుగుబాటు అభ్యర్థులు
* ఆందోళనలో హైకమాండ్
* నామినేషన్ల ఉపసంహరణకు జైరాం, రాజుల యత్నాలు
* మతపెద్దలతో సమావేశమైన పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ
* మైనార్టీ నేతలకు నామినేటెడ్ పదవుల ఎర.. హామీల జల్లు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీకి మైనారిటీ ఓట్ల భయం పట్టుకుంది. ఎన్నికల్లో ముస్లింలకు కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొంటూ 17 నియోజకవర్గాల్లో 21 మంది మైనారిటీ నాయకులు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ఆ ప్రభావం తమ పార్టీపై తీవ్రంగానే ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ముస్లింల ఓట్లు ప్రభావం చూపే నల్లగొండ, మిర్యాలగూడ, జనగాం, ఖమ్మం, రాజేంద్రనగర్, మహేశ్వరం, మలక్‌పేట, పటాన్‌చెరు, ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ వంటి నియోజకవర్గాల్లో మైనారిటీలు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ వేయడాన్ని పార్టీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు గురువారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెబెల్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయాలని ఆదేశించారు. అంతేకాక వారిద్దరు స్వయంగా రెబెల్ అభ్యర్థులతో మాట్లాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పర్యటనకు వెళ్లిన జైరాం, రాజులు జిల్లాలో తిరుగుబాటు అభ్యర్థులను పిలిపించుకుని బుజ్జగించారు.
అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులతోపాటు ఇతరత్రా పదవుల్లో తగిన గుర్తింపు ఇస్తామని గట్టిగా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సైతం తిరుగుబాటు అభ్యర్థులకు ఫోన్ చేసి బుజ్జగిస్తున్నారు. మరోవైపు, హైకమాండ్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ కో-చైర్మన్ షబ్బీర్‌అలీలు రంగంలోకి దిగి మైనారిటీ నేతలను సముదాయిస్తున్నారు. గురువారం నగరంలోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్‌లో జమైతే ఉలే-మా మత పెద్దలతో సమావేశమయ్యారు.
కొన్ని అనివార్య కారణాలవల్ల మైనారిటీలకు టికెట్ల విషయంలో న్యాయం చేయలేకపోయామని పేర్కొంటూ రాబోయే కాలంలో తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వాలని కోరారు. మత పెద్దలు ప్రతిపాదించిన అంశాలన్నింటినీ కచ్చితంగా అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశానంతరం పొన్నాల మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని జమైతే ఉలే-మా పెద్దలను కోరామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ముస్లింలకు అనేక కార్యక్రమాలు చేపడతామని హామీలు గుప్పించారు.
వాటిలో ముఖ్యమైనవి..
* తెలంగాణలో 12.5 శాతం ముస్లిం జనాభా ఉన్నందున రిజర్వేషన్లను పెంచేందుకు ఓ కమిటీ నియామకం.
* ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున కొత్త ప్రభుత్వాన్ని అందులో ఇంప్లీడ్ చేయడం.
* జనాభా ప్రాతిపదికన ముస్లింలకు నామినేటెడ్ పదవులు.
* అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే మైనారిటీలకు సబ్‌ప్లాన్ అమలు.
* కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న మైనారిటీలను రోస్టర్, ఖాళీల ఆధారంగా క్రమబద్దీకరణ.
* గ్రామప్రాంతాల్లో మైనారిటీలకు ఇళ్ల స్థలాలు, పట్టణాల్లో అర్హులైన మైనారిటీలందరికీ ఇళ్ల నిర్మాణం.
* మైనారిటీల సమస్యలపై ప్రతి 3 నెలలకోసారి సమీక్ష.
ఎన్నికల సమయంలో భేటీయా?: సిరాజుద్దీన్
ఇదిలా ఉండగా, ఎన్నికల సమయంలో ముస్లిం మత పెద్దలతో కాంగ్రెస్ నేతలు సమావేశం కావడంపట్ల పీసీసీ మైనారిటీ విభాగం చైర్మన్ సిరాజుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామన్నారు. స్థానిక, మున్సిపల్‌సహా సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో ముస్లింలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. పార్టీ పెద్దలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారిని కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. పార్టీ పదవుల్లో, మార్కెట్ కమిటీల్లో, జిల్లా పరిషత్ పదవుల్లో ముస్లింలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
మెదక్ బరినుంచి తప్పుకున్న శశిధర్‌రెడ్డి
మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పి.శశిధర్‌రెడ్డి పోటీనుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. గురువారం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శశిధర్‌రెడ్డితో భేటీ అయి పోటీనుంచి తప్పుకోవాలని నచ్చజెప్పారు. టీఆర్‌ఎస్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతికి అనివార్య పరిస్థితుల్లో మెదక్ అసెంబ్లీ సీటు ఇవ్వాల్సి వచ్చిందని పొన్నాల చెప్పారు.
పార్టీ అధికారంలోకొస్తే సముచిత స్థానం కల్పిస్తామని, వెంటనే నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశానంతరం పొన్నాలతో కలిసి శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో తమ కుటుంబానికి 44 ఏళ్ల అనుబంధం ఉన్నప్పటికీ టికెట్ రాలేదనే బాధతోనే నామినేషన్ వేశానన్నారు. దిగ్విజయ్‌సింగ్‌తోపాటు పార్టీ పెద్దలు కూడా తనకు ఫోన్ చేసి సముచిత న్యాయం చేస్తానని హామీ ఇచ్చినందున నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు.