కాంగ్రెస్ పార్టీ
సాక్షి, ఒంగోలు పూలమ్మిన చోట పుల్లలమ్మిన చందంగా తయారైంది జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ పరి స్థితి. నాడు.. జిల్లా పేరు వినగానే కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులైన సీనియర్ల గురించి అందరూ చెప్పుకుంటారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి, మాజీ సీనియర్ మంత్రి గాదె వెంకటరెడ్డి తదితర సీనియర్లు దశాబ్దాలుగా ఈప్రాంతంలో ఎదురులేకుండా పాలన కొనసాగించారు. నరనరాన కాంగ్రెస్ పార్టీని జీర్ణించుకుని ఏ ఎన్నికలొచ్చినా కనుసన్నలతో కార్యకర్తలకు సూచనలిచ్చి విజయతీరాలకు తేర్చిన చాతుర్యం కలిగిన నేతలుండేవారు.
నేడు.. జిల్లా కాంగ్రెస్ కోటకు బీటలు వారుతున్నాయి. ఆపార్టీ కాలగర్భం లో కలిసిపోయే ప్రమాదం వచ్చిపడింది. కనీ సం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నిలుచునే సాహసం ఏ ఒక్క నాయకుడు, కార్యకర్త చేయ డం లేదు. కారణం... రాష్ట్రవిభజన పాపం కాంగ్రెస్‌దే అని భావిం చడం. స్వయానా ఆపార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనా మా చేసి ... ఇంటికే పరిమితమవడం..2009 ఎన్నికల్లో 12 నియోజకవర్గాలకు గానూ పదింటిలో కాం గ్రెస్ జెండాను రెపరెపలాడించిన ఎమ్మెల్యేలంతా.. తలోదారి చూసుకుంటున్న నేపథ్యంలో వారిని ‘నమ్మి’ ఏ ఒక్క కార్యకర్తా ప్రాదేశిక పోరులో ఆ పార్టీ తరఫున పనిచేయడానికి రావడంలేదు. ఊరూ రా కాంగ్రెస్ కార్యకర్తలంతా వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చే రడంతో.. ఇక్కడ కాంగ్రెస్ దాదాపు గల్లంతైంది.
ప్రాదేశిక నామినేషన్ల పరిస్థితిదీ..
జిల్లాలో 56 జెడ్పీటీసీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు వేసింది నామమాత్రమే.. మొత్తం 576 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ 244 మందిని, టీడీపీ 216 మందిని ఎన్నికల బరిలోకి దింపగా... కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం 25 మంది మాత్రమే జెడ్పీటీసీ నామినేషన్లు వేయడం గమనార్హం. ఎంపీటీసీ స్థానాలకూ కాంగ్రెస్ నామినేషన్ల దాఖలు కనాకష్టమైంది.
జిల్లాలోని 56 మండలాల నుంచి అన్ని రాజకీయ పార్టీల తరఫున మొత్తం 5,801 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు కాగా, వాటిల్లో కాంగ్రెస్ తరఫున దాఖలైన నామినేషన్లు నామమాత్రమేనని చెప్పాలి. అద్దంకిలో ఐదు, చీరాలలో ఎనిమిది, పర్చూరులో నాలుగు, సంతనూతలపాడు నుంచి 13, ఒంగోలులో రెండు నామినేషన్లు, కొండపి 24, దర్శిలో తొమ్మిది, కందుకూరులో రెండు, కనిగిరిలో 31, మార్కాపురం, తొమ్మిది, గిద్దలూరులో ఎని మిది మంది నామినేషన్లు వేశారు. యరగొండపాలెం నుంచి ఎంపీటీసీ స్థానాలకు ఏఒక్క నామినేషన్ దాఖలు చేయకపోవడం గమనార్హం.