అవినీతి అనకొండ సోనియా
ధ్వజమెత్తిన చంద్రబాబు
కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఊరికో అవినీతి అనకొండ
నన్ను చూసే మోడీ గుజరాత్‌ను అభివృద్ధి చేశారు
ఏలూరు: యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అవినీతి అనకొండ అని టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు, గోపాలపురం, ఏలూరు నియోజకవర్గాల్లో బుధవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు చోట్ల ప్రసంగిస్తూ... కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే సోనియాగాంధీ ఊరికో అవినీతి అనకొండను తయారు చేస్తారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను తాను అభివృద్ధి చేయడం చూశాకే.. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గుజరాత్‌లో అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. జాతి, దేశం కోసమే ఎన్డీయేతో పొత్తు తప్ప స్వప్రయోజనం కోసం కాదన్నారు.
దేశమంతటా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఆ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. తనపై ఎలాంటి అవినీతి కేసులు లేవని, తన రాజకీయ జీవితంలో ఏనాడు జైలుకి వెళ్లలేదని చెప్పారు. జైలుకెళ్లొచ్చిన వ్యక్తి నీతులు చెబుతున్నారని, కొంతమంది బుద్ధిలేని నాయకులు ఆ పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే జిల్లాలో పోర్టులు, 10 లేన్ల జాతీయ రహదారులు, అసవరమైతే సముద్రం పక్కన మరో రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రుణమాఫీ చేస్తామని, 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని, సీమాంధ్రను సింగపూర్‌లా మారుస్తానని హామీలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తామని ఆయన చెప్పారు.
చంద్రబాబు ఎదుట ఆశావహుల నిరసన: విశ్వసనీయత, నీతి ఉంటే పార్టీ కోసం కష్టపడిన వారికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలంటూ తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గాల ఆశావహుల అనుచరులు తణుకులో చంద్రబాబు ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. తమ నాయకుడికే టికెట్టు ఇవ్వాలంటూ నివాదాలు చేశారు. వారి నిరసనలను బాబు కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. కేవలం రెండు కిలోమీటర్ల రోడ్‌షో చేసిన బాబు తణుకు నరేంద్ర సెంటర్‌లోనూ, దేవరపల్లి వద్ద జాతీయ రహదారి పక్కన, ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లోను ప్రసంగించారు. కానీ ఎక్కడా పట్టుమని 100మంది కూడా లేకపోవడం గమనార్హం.