చిల్లర మాటలు మానుకో కేసీఆర్: దాసోజు
హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సంస్కారం లేకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయున వూట్లాడుతూ.. సీఎం కావాలని కలలు కంటున్న కేసీఆర్ గల్లీలో పహిల్వాన్లు మాట్లాడే భాషను ఉపయోగిస్తున్నారన్నారు. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీనే సోనియా, రాహుల్ ప్రస్తావించారని, ఉన్న మాటంటే ఉలుకెందుకని ప్రశ్నించారు. సీఎం పదవిపై వ్యామోహంతో కేసీఆర్ టీఆర్‌ఎస్ నేతలందరి వద్ద ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని.. పార్టీ నేతలెవరూ విలీనం ఒప్పుకోవడం లేదని చెప్పడానికే ఇదంతా చేశాడని విమర్శించారు.
కేసీఆర్‌పై చర్యలు తీసుకోండి: ఈసీకి పొంగులేటి ఫిర్యాదు
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మంగళవారం రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. మెదక్, కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ పొన్నాలను ఉద్ధేశించి ‘నాలుక చీరేస్తా’నంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని పేర్కొంటూ వినతి పత్రం అందజేశారు.