రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించగల శక్తిసామర్థ్యాలు గల సాహసోపేత నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించగల శక్తిసామర్థ్యాలు గల సాహసోపేత నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అలాంటి నిబద్ధత కలిగిన జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు తోడ్పాటునందించాలని కోరారు.
శ్రీకాకుళంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోక్‌సభ సమన్వయకర్త రెడ్డి శాంతితో కలిసి ఆయన మాట్లాడారు. అధికార కాంక్షతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల పాలనలో అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు.
వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నిరంకుశ విధానాలతో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన విషయంలో నోరు మెదపని చంద్రబాబు కొత్త రాష్ట్రాన్ని ఏవిధంగా పునర్నిర్మిస్తారని ప్రశ్నించారు. పార్టీ లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి మాట్లాడుతూ వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడం ద్వారానే రాష్ట్రంలో మళ్లీ 2004-09నాటి అభివృద్ధి విప్లవం సాధ్యమన్నారు. జిల్లాతోపాటు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన మత్యకార సామాజికవర్గాన్ని ఎస్టీలలో చేర్పించేందుకు కృషి చేస్తామన్నారు.
ఒడిశా, తమిళనాడులలో మత్స్యాకారులను ఎస్టీలుగా గుర్తించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ల నిర్మాణం, భావనపాడు షిప్పింగ్‌హార్బర్ అభివృద్ధికి తోడ్పడతానన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలుకావాలంటే ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టేలా ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి జిల్లాలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ జగన్‌ని ఎదుర్కొనే సత్తాలేక టీడీపీ, బీజేపీ, లోక్‌సత్తా, జనసేన పార్టీలన్నీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు.
ఈ కుట్రను ప్రజలు తిప్పికొడతారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను వైఎస్‌ఆర్ సీపీ గెలుచుకుంటుందన్నారు. సమావేశంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి, అంధవరపు వరహానరసింహం, మార్పు ధర్మారావు, పేడాడ తిలక్, అంధవరపు సూరిబాబు, గొండు కృష్ణమూర్తి, చల్లా అలివేలు మంగ, జేఎం శ్రీనివాస్, ఎన్ని ధనుంజయ్, మండవిల్లి రవి, మహమ్మద్ సిరాజుద్దీన్ పాల్గొన్నారు.