కో అంటే కోట్లే
సాక్షి,సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో చివరకు కరెన్సీదే పై చేయి అయ్యింది. ఓటుకు నోటు వద్దు..డబ్బులు తీసుకోకుండా ఓటెయ్యండి..ప్రలోభాలకు లొంగకండి..అన్న నినాదాలు చివరకు నినాదాలుగానే మిగిలిపోయాయి. సోమవారం సాయంత్రం ప్రచారానికి తెరపడడంతో అభ్యర్థులు, వారి అనుచరులు డబ్బు పంపిణీపైనే ప్రధాన దృష్టిసారించి సోమ,మంగళవారాల్లో జోరుగా నగదు పంచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సంచుల్లో తీసుకొచ్చిన పచ్చనోట్లను అభ్యర్థుల అనుచరులు ఓటరు స్లిప్పుతోపాటు రూ.500 నుంచి రూ.1000 నోటిచ్చి పంచినట్లు తెలిసింది. ఆయా నియోజకవర్గాల ప్రధాన పార్టీల అభ్యర్థులు రెండురోజులుగా నోట్ల సంచులు విప్పి..రూ.కోట్లు గుమ్మరిస్తున్నారు. గెలుపు అవకాశాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండురోజులు ఒక్కక్షణం కూడా వృథా చేయకుండా వారి అనుయాయులు, ద్వితీయశ్రేణి నాయకులు,కార్యకర్తలు,గల్లీ లీడర్లు,కాలనీ సంఘా ల నాయకులకు వారు కోరినంత డబ్బు పంపిణీ చేస్తున్నారు.
పనిలోపనిగా తమమీద పోలీసుల కన్ను పడకుండా వారికీ తాయిలాలు ముట్టజెప్పినట్లు సమాచారం. పాతనగరం మినహా ప్రధాన నగరం,శివారు నియోజకవర్గాల్లో పంపకాల జాతరకు ఆకాశమే హద్దుగా మారింది. ఉదాహరణకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఓ ప్రధానపార్టీ అభ్యర్థికి ‘ముఖ్య’ పదవి ఎరవేయడంతో సదరు అభ్యర్థి జోష్ అంతాయింతా కాదు. గత రెండురోజులుగా ఆయన ఏకంగా రూ.22 కోట్ల నగదును పార్టీ కేడర్‌ను పంచినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నగదే కాకుండా జోరుగా మద్యం కూడా పంచినట్లు తెలిసింది. ఇదొక్కటి చాలు మహానగరంలో ఈసారి ఓటుకు నోటు పథకం ఏరీతిగా అమలవుతుందో అర్థం చేసుకోవడానికి.
బూత్‌కు రూ.2 నుంచి రూ. 4 లక్షలు : బూత్‌ల వారీగా ఉన్న ఓట్లు, ప్రాంతాన్ని బట్టి సుమారు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పంపిణీ చేసేందుకు అభ్యర్థులు వెనుకాడడం లేదు. అయితే డబ్బు పంపిణీ విషయంలో రక్తసంబంధీకులు, దగ్గరి బంధువర్గం,నమ్మకస్తులైన నాయకగణం ద్వారానే పంపకాలు చేస్తున్నారు. పోలీసులు తమ కార్యకలాపాలపై నజర్ పెట్టకుండా వారికీ కొంతమొత్తం ముట్టజెబుతున్నట్లు పలువురు పార్టీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఇక మరికొందరు మరో అడుగు ముం దుకేసి మహిళాసంఘాల సభ్యులకు ముక్కుపుడకలు,చీరలు, గృహోపకరణాలు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇంకొందరు బస్తీలు, కాలనీల్లో ముఖ్యనాయకులకు వారు కోరినట్లుగా రూ.లక్షలు ముట్టజెప్పారు. కీలక తరుణంలో డబ్బు పంపిణీ చేయకపోతే పార్టీ సంప్రదాయ ఓటుబ్యాంకును సైతం ప్రత్యర్థులు కొల్లగొట్టడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండడంతోనే డబ్బు ఖర్చుచేయక తప్ప డం లేదని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు.
‘కోట్ల’ కోటలు ఇవే : ఎల్బీనగర్,ఖైరతాబాద్,జూబ్లీహిల్స్,కుత్బుల్లాపూర్,సనత్‌నగర్, మహేశ్వరం,ఉ ప్పల్,సికింద్రాబాద్,రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో డబ్బు సంచులు కట్టలు తెంచుకున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్‌లు,ప్రత్యర్థులు అన్న తేడాలేకుండా పోటీపడి మరీ నగదు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది.