హిందీ మేం నహీ బోల్తా హై
ఎన్నికల వేళ ఓటు కోసం కోటి ట్రిక్కులుంటాయి. రాజకీయ పార్టీలు ఒక్క ఓటు కోసం ఏందాకైనా వెళ్తాయి. తమిళనాడులో డీఎంకే రాజకీయానికి ఆధారమే హిందీ వ్యతిరేకత. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తూ డీఎంకే పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. చివరికి అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దక్షిణాదిపై హిందీ రుద్దబోమని స్పష్టం చేయాల్సి వచ్చింది.
కానీ అదే డీఎంకే ఇప్పుడు ఏకంగా హిందీ భాషలో ఎన్నికల పోస్టర్లు తయారు చేసి, సెంట్రల్ చెన్నై నియోజకవర్గం అంతటా అతికించింది. దీనికి కారణం ఏమిటంటే సెంట్రల్ చెన్నై లోని సౌకార్ పేట్ (షావుకార్ల పేట) ప్రాంతంలో దాదాపు లక్షన్నర మంది మార్వాడీలు ఉన్నారు. వీరి ఓట్లు కావాలంటే వారి భాషలోనే అడగాలి. కాబట్టే హిందీ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తమాషా ఏమిటంటే ఆ నియోజవర్గం నుంచి కరుణానిధి బంధువు దయానిధి మారన్ ఎన్నికల బరిలో ఉన్నారు.
అందుకే ఎన్నికలు రాగానే ఎంతవారైన దారికి రాక తప్పదంటారు.