పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 13న జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ అధికారులకు సూచించారు. కౌంటింగ్‌ను పురస్కరించుకుని జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లపై మండల ప్రత్యేక అధికారులు(రిటర్నింగ్), ఎంపీడీఓ(అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు)లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సహకారంతో స్థానిక, సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్లను లెక్కించేందుకు తగినన్నీ బా క్స్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి డివిజన్‌కు ఒక్కో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తుండగా, ములుగు డివిజన్‌లో పరకాల, ములుగు మండల కేంద్రాల్లో ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరింవచారు.
సెల్‌ఫోన్లు, కెమరాలు తీసుకురావద్దు..
కౌంటింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లు సెల్‌ఫోన్లు, కెమెరాలు తీసుకురావద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ కిషన్ అన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి కేవలం పెన్ను, పేపర్లను మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి పేపర్లు బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ అనంతరం ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, వస్తు సామగ్రి బయటపడడంతో ఎంపీడీఓలతో పాటు సిబ్బందిని సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నారు. పై విషయాలను గుర్తు పెట్టుకుని అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
తాగునీటిపై దృష్టి సారించాలి..
వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ కిషన్ కోరారు. తాగునీటి పనులు చేపట్టేందుకు కావాల్సినన్నీ నిధులు మంజూరు చేస్తామన్నారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లోప్రైవేట్ వ్యక్తులకు చెందిన బావులను అద్దెకు తీసుకోవాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నీటిఎద్దడి నివారణపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఇంజినీరింగ్ శాఖలకు చెందిన ఏఈలు, ట్రాన్స్‌కో ఏఈలతో సమీక్షించాలన్నారు. కాగా, వెంకటాపూర్ మండలంలో మత్స్య కార్మికుల సొసైటీకి చెందిన వ్యక్తులు గండి పెట్టి నీటిని చెరువునుంచి పంపించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు 9000114547కు కాల్‌చేయాలని సూచించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్...
కాగా, కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పీఈటీసీ ప్రిన్సిపాల్ అనిల్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. కౌంటింగ్ సమయంలో గుర్తింపు కార్డు ఉన్న మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతించాలన్నారు. లెక్కింపు జరుగుతున్న బ్యాలెట్ పేపర్‌ను ఫొటో తీయకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, జెడ్పీ సూపరింటెండెంట్లు వెంకటస్వామి, కృష్ణమూర్తి, శ్రీనివాసరెడ్డి, రాంమోహన్, వెంకటరమణ, సునీత, నాగమణి, రాంబాబు, నవీన్, మండల స్పెషలాఫీసర్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.