కలలు కంటున్నా.. నాకే ఓట్లేయండి
కడప ప్రజా గర్జనలో చంద్రబాబు
కడప: ‘‘జూన్ 2తో రెండు రాష్ట్రాలు ఏర్పడతాయి. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉంటుంది. సీమాంధ్రలో లోటు బడ్జెట్ ఉంటుంది. ఇక్కడ ఆదాయం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా పగులూ రాత్రీ తేడా లేకుండా కలలు కంటున్నా. రాష్ర్టం కోసం ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నా. అందరూ నాకు ఓట్లేసి గెలిపించండి’’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోరారు. కడప మునిసిపల్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన ప్రజాగర్జనలో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం రాష్ట్రాన్ని విభజించింది. ఇంత అనుభం ఉన్న నన్ను సంప్రదించలేదు. అందుకే కాంగ్రెస్ భూస్థాపితమైంది.
దేశానికి నాయకుడు లేడు. మన్మోహన్ సోనియాకు రోబోగా మారిపోయాడు. సోనియా అవినీతి అనకొండలా మారింది. అవినీతి వల్ల అభివృద్ధి ఆగిపోయింది. రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం సహకారం అవసరం. అందుకే బీజేపీతో పొత్తుపెట్టుకున్నాం. అందరూ ‘బ్రింగ్ బ్యాక్ బాబు’ అంటున్నారు. సోనియా ఎంతోమందితో ఆడుకున్నారు. నన్నుకూడా ఇబ్బంది పెట్టాలని చూశారు. సుప్రీంకోర్టులో 35 కేసులు వేశారు. 25 విచారణ కమిటీలు వేశారు. అయినా ఏం చేయలేకపోయారు. నా జోలికి వస్తే ఖబడ్దార్.. ఇటలీకి పంపిస్తా’ అని చెప్పా’’ అని చంద్రబాబు అన్నారు.