అడగండి చెబుతా.. ఈసీ సమాధానాలు
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు
ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితా లో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి.
- ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్,
హైదరాబాద్, లేదా election@sakshi.com కు మెయిల్ చెయ్యండి.
ప్ర. తిరుపతి నియోజకవర్గ ఓటరుగా నాకు 2008లో జారీచేసిన ఐడీ కార్డు ఉంది. మూడేళ్ల నుంచి రాజమండ్రిలో ఉంటున్నా. రాజమండ్రిలో ఓటరుగా దరఖాస్తు చేసుకున్నా. ఇంతవరకూ కొత్త ఓటర్ ఐడీ కార్డు రాలేదు. ఇప్పుడు నేను పాత కార్డుతో రాజమండ్రిలో ఓటు వేయవచ్చా?
- రవిశంకర్
జ.మీ పాత ఓటర్ ఐడీ కార్డు చెల్లదు. ఏప్రిల్ 19 నాటికి మీ పేరు రాజమండ్రి ఓటర్ల జాబితాలో చేరుతుంది. ఆ మేరకు మీరు రాజమండ్రిలో ఓటు వేయవచ్చు.
ప్ర. ఎన్నికల సమయంలో ‘ప్రెస్’ అని రాసి ఉన్న వాహనాల్లో కూడా డబ్బు తదితరాలను తరలించే అవకాశం ఉంది. ‘ప్రెస్’ వాహనాలకు కూడా ఎన్నికల సంఘం ప్రత్యేక పాస్ ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా?
- సాయి శరత్, విశాఖపట్నం
జ.ఎన్నికల సంఘం ఇచ్చే పాస్‌తో నడిచే వాహనాల్లో డబ్బు తరలించరన్న గ్యారెంటీ ఉంటుం దా.. కాబట్టి ప్రెస్ వాహనాలతో సహా అన్ని వాహనాలనూ తనిఖీ చేస్తాం.
ప్ర. పోలింగ్ రోజున పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారా?
- రాధిక, మిర్యాలగూడ
జ. వారు కూడా అందరిలాగే క్యూలో వచ్చి ఓటు వేయాలి. వికలాంగులు, వృద్ధులు, పసిపిల్లల తల్లులకే నేరుగా వచ్చే అవకాశముంది.