లోకేష్ రోడ్‌షో.. విద్యుత్ చౌర్యం
షోపై ఆప్ అభ్యర్థిని ఫిర్యాదు
వీడియో తీసిన ఎన్నికల పరిశీలకుడు
మణికొండ/మియాపూర్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారాలోకేష్ గురువారం మణికొండలో నిర్వహించిన రోడ్ షో నిమిత్తం ఆ పార్టీ కార్యకర్తలు విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారు. ఏకంగా ట్రాన్స్ ఫార్మర్, వీధిదీపాల లైన్ నుంచి విద్యుత్‌ను చౌర్యం చేసి మైకులు, తదితరాలకు కరెంట్‌ను వినియోగించారు.
రోడ్‌షోకు ఇతర ప్రాంతాల నుంచి వందకు పైగా వాహనాలలో జనాన్ని తరలించారని, వీధి దీపాల లైను, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి విద్యుత్ చౌర్యం చేశారని రాజేంద్రనగర్ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఉండవల్లి ప్రమీల ఎన్నికల వ్యయ పరిశీలకునికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల పరిశీలకుడు ముస్తాక్ అహ్మద్ నేరుగా ఆ ప్రాంతానికి వచ్చి రోడ్‌షో, వాహనాలను వీడియో తీశారు. వాటి ఖర్చు మొత్తం అభ్యర్థుల ఖాతాలో వేస్తామని ఆయన చెప్పినట్టు ప్రమీల తెలిపారు.
మేమొస్తేనే అభివృద్ధి..
రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం చారిత్రక అవసరమని ఆ పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ అన్నారు. గురువారం రాత్రి మణికొండలో, మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తాలలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగర నిర్మాణానికి అప్పటి పాలకులకు 200 ఏళ్లు పడితే, సైబరాబాద్ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వానికి కేవలం తొమ్మిదేళ్లే పట్టిందన్నారు. రాష్ట్రం పెట్టుబడులకు నిలయమైందన్నారు.
తమ హయాం లో ఐటీరంగంలో ఐదులక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 15 లక్షల మందికి పరోక్షంగా లభించాయన్నారు. తమ పార్టీకి ప్రజా స్పందన బాగుందని, తెలంగాణలో టీడీపీని గెలిపించి మిగతా పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. టీడీపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి వీరేందర్‌గౌడ్, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్, శేరిలింగంపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అరికెపూడి గాంధీ, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాగా, మణికొండ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్‌షోతో రాకపోకలకు అంతరాయం కలిగింది.