సాక్షి, అనంతపురం : ‘‘నన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే చేనేతలకు అండగా ఉంటా. మీ జీవితాల్లో వెలుగు నింపుతా. చేనేత మగ్గాల్లో పని చేసే ప్రతి కార్మికుడికి ఉపాధి కల్పించి పొట్ట నింపేందుకు కృషి చేస్తా’’ - ఇదీ 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున హిందూపురం ఎంపీగా పోటీ చేసిన నిమ్మల కిష్టప్ప హిందూపురంలోని ముదిరెడ్డిపల్లి చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. కానీ చేనేతల పరిస్థితి మాత్రం మారలేదు. వారి జీవితాలను చీకటిమయం చేశారు.
పొట్ట నింపేందుకు కృషి చేస్తానన్న ఆయన ఏకంగా పొట్ట కొట్టారు. గెలిచి ఐదేళ్లు పూర్తయినా అటువైపు కన్నెత్తి చూడలేదు. అంతలోనే బినామీ పేర్లతో ముదిరెడ్డిపల్లిలోనే పవర్‌లూమ్స్ ఏర్పాటు చేసి వాటిని తన సమీప బంధువుల ద్వారా నడిపిస్తూ వచ్చారు. చేనేత చట్టం ప్రకారం పవర్ లూమ్స్‌లో 11 రకాల నేతలు మాత్రమే తయారు చేయాల్సి వుంది. నిమ్మల కిష్టప్ప బినామీ పేర్లతో పవర్ లూమ్స్ ఏర్పాటు చేయక ముందు హిందూపురం నియోజకవర్గంలో దాదాపు 25 వేల చేనేత మగ్గాలు వుండేవి. పవర్ లూమ్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల వస్త్రాలు తయారు చేయడంతో మగ్గాలు ఒక్కొక్కటిగా మూతపడుతూ వచ్చాయి. ప్రస్తుతం 5 వేల మగ్గాలు కన్పించడం కూడా కష్టమే. పవర్‌లూమ్స్ విచ్చల విడిగా ఏర్పాటు చేయడం వల్ల మగ్గాలపై చేతితో నేసే వస్తువులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. దీంతో అందులో పని చేస్తున్న కార్మికులు వేరే పని చేయడం చేత కాక రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లలేక ఎంతో మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చేనేత వర్గానికి చెందిన నిమ్మల కిష్టప్పకు అండగా నిలిచి ఓట్లు వేసి గెలిపిస్తే సాటి కులస్తుడిగా తమను ఆదుకుంటాడని నమ్మిన వారికే నమ్మక ద్రోహం చేశారని పలువురు చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల తర్వాత తిరిగి ఎన్నికలు రావడ ంతో ఓట్ల కోసం తిరిగి చేనేత కులస్తులు గుర్తుచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. అందరి ముందు కడిగేయాలనే ఉద్దేశంతో సన్మానం చేస్తామని నిమ్మల కిష్టప్పను హిందూపురం పట్టణంలోని ముదిరెడ్డిపల్లికి ఆహ్వానించి చేనేతలకు చేసిన ద్రోహాన్ని బయట పెడుతూ ఇక ముందు ఓట్లు అడిగేందుకు రావద్దం టూ ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఈ సారి సొంత కులస్తులే నిమ్మల కిష్టప్ప పని తీరును ప్రశ్నించడంతో గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. బినామీ పేర్లతో ఆయన పవర్ లూమ్స్ నిర్వహిస్తుండటం వల్ల ఆ ప్రభావం మర మగ్గాలపై పడింది. మర మగ్గాలపై నేసే చీరలకు గిట్టు బాటు ధర రాకపోవడంతో అందులో పని చేస్తున్న కూలీలకు రోజు వారి కూలి కూడా గిట్టకపోవడంతో వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఎంపీగానే కాకుండా చేనేత, జౌళి శాఖ మంత్రిగా పని చేసినప్పుడు కూడా చేనేతలను ఆదుకున్న పాపాన పోలేదు. ఈ సారి ప్రచారం కోసం నిమ్మల కిష్టప్ప ఎక్కడికి వెళ్తున్నా ఆయన పని తీరుపై ప్రశ్నిస్తుండటంతో సరిగా ప్రచారం కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.
చేనేతల కడుపు కొడుతున్న నిమ్మల
నిమ్మలకిష్టప్ప ఐదేళ్ల పాటు ఎంపీగా ఉన్నా ఏనాడూ చేనేతల సంక్షేమానికి పాటు పడింది లేదు. చేనేత కార్మికులంతా పవర్‌లూమ్స్‌ను నిషేదించాలని నెలల తరబడి పోరాటాలు చేశారు. కనీసం వారికి సంఘీభావం కూడా తెలపకుండా పవర్‌లూమ్స్‌ను ప్రోత్సహించి పెట్టుబడిదారులకు వత్తాసు పలుకడం దారుణం. ఇప్పటికే ఎంపీ సొంత మండలం గోరంట్ల, సోమందేపల్లిలో పవర్‌లూమ్స్ నడుస్తున్నాయంటే ఈయన కు చేనేతలపై ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. పవర్‌లూమ్స్ నిషేధంపై చిత్తశుద్ధిగా ఎవరైతే పోరాడుతారో వారికే మా మద్దతు ఉంటుంది.
- జింకా చలపతి, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ధర్మవరం
చేనేతలకు నిమ్మల కుచ్చు టోపీ
Published Mon, May 5 2014 2:32 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement