
ఎట్టకేలకు కాంగ్రెస్ జాబితా
బాలునాయక్ మినహా సిట్టింగులందరికీ అవకాశం
సాక్షిప్రతినిధి, నల్లగొండ,సిట్టింగు ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేయడానికి తీవ్రమైన కసరత్తు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు సోమవారం సాయంత్రం అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. సీపీఐతో పొత్తులో భాగంగా వదులుకున్న దేవరకొండ నియోజకవర్గాన్ని మినహాయిస్తే, జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తిరిగి అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గుడిపాటి నర్సయ్యకు మరోసారి అవకాశం కల్పించింది.
పెద్దగా సంచలనం సృష్టించిన, అనూహ్యమైన నిర్ణయాలేవీ జరగలేదు. గత కొద్ది రోజులుగా మిర్యాలగూడ నియోజకవర్గంలో తెరపైకి వచ్చిన మాజీ మంత్రి జానారెడ్డి సన్నిహితుడు ఎన్.భాస్కర్‌రావు పేరును ఖరారు చేశారు. బీసీ కోటాలో భాగంగా భువనగిరికి పోతంశెట్టి వెంకటేశ్వర్లును ఎంపిక చేశారు. కోదాడపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆలేరు నుంచి ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, తుంగతుర్తికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుడిపాటి నర్సయ్య, సూర్యాపేట - ఆర్.దామోదర్‌రెడ్డి, హుజూర్‌నగర్ - ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మిర్యాలగూడ -ఎన్.భాస్కర్‌రావు, నాగార్జునసాగర్ - కె.జానారెడ్డి, నల్లగొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్-చిరుమర్తి లింగయ్య, భువనగిరి - పి.వెంకటేశ్వర్లు పేర్లు జాబితాలో చోటు చేసుకున్నాయి. సీపీఐకి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలను కేటాయించింది. కోదాడలో ఎవరికి అవకాశం కలిసొస్తుందోనన్న ఉత్కంఠ కార్యకర్తల్లో నెలకొంది.
కోదాడ నియోజకవర్గం నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఏఐసీసీ నాయకత్వం మాత్రం ఒక కుటుంబంలో ఒకరికే అవకాశం అన్న మెలిక పెట్టడంతో పద్మావతి అభ్యర్థిత్వం పెండింగులో పడింది. మరోవైపు గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనారిటీ నేత మహ్మద్ జానీ ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేసి, తాను రేసులో ఉన్నానని హైకమాండ్‌కు చెప్పకనే చెప్పారు. ఇప్పుడు టికెట్ ఖరారు చేస్తే వివాదాస్పదం కావడం ఖాయమని భావించినందునే కోదాడ అభ్యర్థి పేరును పెండింగ్‌లో పెట్టినట్లు చెబుతున్నారు.
ఇక, తెలంగాణ ఉద్యమంలో, ఆయా జేఏసీల్లో పనిచేసిన ఉద్యమ కారులకు ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రకటించగా, జిల్లా నాయకత్వం మాత్రం ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ తెలంగాణ పొలిటికల్ జేఏసీలో చురుకైన పాత్రనే పోషించారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధిగా పార్టీ సంస్థాగత పదవినీ దక్కించుకున్నారు. దయాకర్ పేరును ఎస్సీ రిజర్వుడు స్థానమైన తుంగతుర్తికి పరిశీలిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది.
కానీ, తీరా ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గుడిపాటి నర్సయ్యకే టికెట్ దక్కింది. సామాజిక చిత్రాల దర్శకుడు ఎన్. శంకర్‌కు మిర్యాలగూడ టికెట్ ఇవ్వడానికి దాదాపు లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. ఈదశలో జిల్లా నేతలు మోకాలడ్డడంతో టికెట్ రాకుండా అయ్యింది. శంకర్ స్థానంలో జానారెడ్డి దగ్గరి వ్యక్తి అయిన భాస్కర్‌రావుకు టికెట్ దక్కింది. పెద్ద సంచలనాలేవీ లేకుండానే అందరు సిట్టింగులకు అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ నాయకత్వం జాబితాను ప్రకటించడం విశేషం.