sitting mla
-
ఎవరైనా నిలదీస్తే.. వారిని భయపెడ్తూ.. దాడులు కూడా చేయాలి! : ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'ప్రచార ఘట్టం నేపథ్యంలో గ్రామాల్లో ఎవరైనా నిలదీసినా, ప్రశ్నించినా సదరు వ్యక్తులను భయపెట్టాలని, అవసరమైతే భౌతిక దాడులు కూడా చేయాలంటూ జిల్లాలోని ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులకు, తృతీయ శ్రేణి కేడర్‌కు సూచిస్తుండడం చర్చనీయాంశమైంది.' జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇలా ఉచిత సలహాల నేపథ్యంలో తమకు ఇదేం పరిస్థితని ఆయా నాయకులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, ఎంపీటీసీలు అసహనం వ్యక్తం చే స్తుండడం విశేషం. ప్రజలతో సౌమ్యంగా ఉండాల్సిన నేపథ్యంలో ఇలాంటి వ్యవహారశైలి కలిగిన సదరు సిట్టింగ్ చెప్పినట్లు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చర్చించుకుంటుండడం గమనార్హం. ఇప్పటికే వ్యతిరేకత.. తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ఎమ్మె ల్యే ఓటమిపాలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో సదరు ఎమ్మెల్యేతో కలిసి ఉంటే తర్వాత అవస్థలు పడాల్సి ఉంటుందని బాహాటంగానే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తమకు బిల్లులు రాక నానా అగచాట్లు పడుతున్నామని, ఎమ్మెల్యే కూడా బిల్లులకు అడ్డం పడిన సందర్భాల్లో ఆత్మహత్యయత్నాలు చేసిన ఘ టనలు కూడా చోటు చేసుకున్నా యి. దీంతో మెజారిటీ సంఖ్యలో సర్పంచ్‌లు విషయాలపై అంతర్గతంగా సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది సర్పంచ్‌లు ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు బీ జేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలకు టచ్‌లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తగిన సమయం చూసి ఆయా పార్టీల్లో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ఇవ్వకూడదని ఇప్పటికే పలువురు స్థానిక ప్ర జాప్రతినిధులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు ఎమ్మెల్యే ప్రవర్తన, వ్యవహారశైలితో తాము విసిగిపోయామని, మళ్లీ ఆ ఎమ్మెల్యేతో తిరిగితే ఇబ్బందు లు తప్పవనే ఆలోచనతో ముందే పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడం విశేషం. ఇచ్చిన హామీలు నెరవేర్చి తే హుందాగా ఓట్లడిగే అవకాశాన్ని వ దులుకుని ఇప్పుడు తమతో ఓటర్ల కు తాయిలాలు పంచిస్తే లాభం లేదని సర్పంచ్‌లు, ఉప స ర్పంచ్‌లు, ఎంపీటీసీలు చెబుతుండడం విశేషం. -
TS Elections 2023: సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అధికార బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు చల్లారడం లేదు. ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి బుజ్జగిస్తున్నా ససేమిరా అంటున్నారే తప్ప.. కలిసి రావడం లేదు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగులకు టికెట్ ఇస్తామని ప్రకటించిన నాటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అభ్యర్థుల ప్రకటన తరువాత కూడా తమ అసంతృప్తిని బయట పెడుతూనే ఉన్నారు. అంతేకాదు బీఫాం ఇచ్చేనాటికి పరిస్థితుల్లో మార్పు రావొచ్చన్న ఆలోచనలతో తమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. దానికితోడు మార్పులకు అవకాశం ఉందంటూ ప్రచారం కూడా సాగుతోంది. దీంతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు నెలకొంది. అధిష్టానం పక్కాగా తమకే టికెట్ ఇస్తుందా? ఏదైనా మార్పులు చేస్తుందా అని లోలోపల ఆందోళన చెందుతున్నారు. చల్లారని అసమ్మతి ఎన్నికల షెడ్యుల్ రాకముందే సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అంతా వెళి్ల్ నియోజకవర్గాల్లో పనులు చేసుకోవాలని సూచించారు. అంతవరకు బాగానే ఉన్నా నియోజకవర్గాల్లో ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తూ ఈసారైనా తమకు టికెట్ ఇవ్వకపోతారా? అని ఎదురుచూసిన వారికి సీఎం ప్రకటనతో మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది. అయినా నోటిఫికేషన్ వచ్చి, నామినేషన్లకు బీఫాం ఇచ్చే వరకు ఏమైనా జరగొచ్చనే ఆలోచనలతో కొన్ని నియోజకవర్గాల్లో తమ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మరికొందరైతే అభ్యర్థులను మార్చకపోతే తాము సహకరించబోమంటూ తెగేసి చెబుతున్నారు. ఎమ్మెల్యేలే స్వయంగా అసంతృప్తి నేతల ఇళ్లకు వెళ్లి బుజ్జగిస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. మరి కొన్నిచోట్ల ఆశావహులు బహిరంగంగానే పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సర్వే గుబులు ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నారని, దాని ఆధారంగానే భవిష్యత్‌లో బీఫాంను కూడా గెలిచే వారికే ఇస్తారన్న చర్చ సాగుతోంది. దీంతో అంసతృప్తులు ఉన్న నియోజకవర్గాల్లోని సిట్టింగుల్లో గుబులు మొదలైంది. ఏం జరుగబోతుందో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. చివరి క్షణంలో ఏమైనా మార్పులు చేస్తే తమ పరిస్థితి ఏంటన్న గందరగోళంలో పడ్డారు. వివిధ నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా.. ► నాగార్జునసాగర్‌లోనూ అంసతృప్తి అలాగే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా.. టికెట్ ఆశిస్తున్న మన్నెం రంజిత్ యాదవ్‌కు మద్దతుగా పార్టీ శ్రేణులు సమావేశాలను కొనసాగిస్తున్నారు. నాగార్జున సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని స్థానిక బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లో, నాయకుల్లో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. తమ మద్దతు ఉన్న అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని పైరవీలు నడుపుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ అసమ్మతి సెగలు అధిష్ఠానానికి తలనొప్పిగా తయారయ్యాయి. ► నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమని చెబుతున్నారు. తనకు అవకాశం ఇస్తారని ఆశించినా, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పేరునే కేసీఆర్ ఖరారు చేశారు. ► దేవరకొండ నియోజకవర్గంలోనూ అసంతృప్తి చల్లారలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేను స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ► కోదాడలోనూ అదే పరిస్థితి నెలకొంది. అక్కడ బీఆర్ఎస్ నాయకుడు శశిధర్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే చందర్రావు ఇంటికి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వెళ్లినా కలిసేందుకు నిరాకరించారు. ► నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన ప్రయత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు. బీఆర్ఎస్ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. -
రండి బాబూ... రండి!
సాక్షి, కంబదూరు: కళ్యాణదుర్గంలో సోమవారం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో నామినేషన్‌కు మండలం నుంచి భారీగా జనాన్ని తరలించాలని ఆయన వర్గీయులు ప్రయత్నించారు. కానీ ప్రజలెవరూ స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడంతో గత్యంతరం లేక ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.400 వరకు కూలి డబ్బులు ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. -
ఎదురుచూపులు..!!
సాక్షి,కోదాడ : అసెంబ్లీ ఎన్నికల ప్రకటన ఏ ముహూర్తాన ప్రకటించారోగాని కోదాడ వాసులకు మాత్రం గడిచిన రెండు నెలలుగా అభ్యర్థుల ప్రకటనలపై ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రం మొత్తం స్పష్టత వచ్చినప్పటికీ కోదాడ స్థానంపై మాత్రం స్పష్టత రావడం లేదు. ఇటు అధికార పార్టీలో అటు ప్రతిపక్ష పార్టీలో అదే పరిస్థితి నెలకొనడంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఢీలా పడ్డారు. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు టీవీల్లో చూడడం, తెల్లవారిన తరువాత పత్రికల్లో వెదకడం రెండు నెలలుగా కోదాడ నాయకుల దినచర్యగా మారింది. కాని పరిస్థితిలో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదు. తాజాగా శనివారం అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం సాగుతుంది. కాని ఆరోజు కూడా రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెడుతున్నారనే సమాచారం అందుతండడంతో స్థానికంగా ఉత్కంఠ పెరిగిపోతుంది. నువ్వా.. నేనా..? కోదాడ టికెట్ కోసం అధికార టీఆర్ఎస్ నుంచి ఇన్చార్జ్ కె.శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు పోటీ పడుతున్నారు. వీరితో పాటు ఎన్ఆర్ఐ జలగం సుధీర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ఎవ్వరికి టికెట్ ఇవ్వాలో తేల్చకుండా రెండు నెలలుగా వ్యవహారాన్ని నాన్చుతూ వచ్చింది. దీంతో విసుగు చెందిన కొందరు నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఐనప్పటికీ పార్టీ మాత్రం నిర్ణయాన్ని ప్రకటించడం లేదు. చందర్రావు హైదరాబాద్‌లో తన సామాజిక వర్గానికి చెందిన కొంత మందితో తీవ్ర లాబీయింగ్ చేయిస్తుండగా శశిధర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్‌ల మీద భారం వేసి కోదాడకు, హైదరాబాద్‌కు చక్కర్లు కొడుతున్నాడు. మధ్య, మధ్యలో మండలాల్లో ప్రచారం చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో దృష్టి సారించలేక పోతున్నారు. మీకా.. మాకా...? ఇదీలా ఉండగా కాంగ్రెస్ కూడా కోదాడ టికెట్ విషయంలో వింత పరిస్థితిని ఎదుర్కొంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతికి టికెట్ గ్యారంటీ లేకపోవడం కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తుంది. మహాకూటమిలో భాగంగా కోదాడ టికెట్‌ను టీడీపీ కోరుతుందనే ప్రచారం వారి ఆందోళనకు కారణమవుతుంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొల్లం మల్లయ్యయాదవ్ తనకు టికెట్ ఖాయమని, ఏపీ సీఎం తనకు హామీ ఇచ్చారని చెపుతుండడంతో క్యాడర్లో ఆయోమయం నెలకొంది. సందట్లో సడేమియా..!! టికెట్ల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా సామాజిక మాధ్యమాల్లో, వాట్సప్ గ్రూపులలో జరుగుతున్న ప్రచారం ఇరు పార్టీల నేతలకు కాక పుట్టిస్తుంది. ఫలాన గ్రూపులో ఇలా వచ్చింది, ఫలానా వారికి ఈ మెసేజ్ వచ్చింది... వాస్తవమేనా ? అంటూ పలువురు ఇతరులకు ఫోన్లుచేసి వాకబు చేస్తున్నారు. ఈ ఉత్కంఠకు శనివారం కూడా తెరపడడం లేదని తెలుస్తుండడంతో ఇంకా కోదాడ వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. -
మాయావతికి సొంత ఎమ్మెల్యే ఝలక్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సొంతపార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఝలక్ ఇచ్చాడు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ప్రారంభంకానుండగా పార్టీని కాదని అధికార పక్షంలో దూరాడు. సమాజ్ వాది పార్టీలో చేరిపోయాడు. ప్రస్తుతానికి దళిత వర్గాలన్నీ తనవైపునకు తిప్పుకున్న మాయావతి ఇప్పుడు అగ్రకులస్తులను, బ్రాహ్మణులను సంప్రదించే పనుల్లో ఉండగా ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయోధ్య ప్రసాద్ పాల్ అనే వ్యక్తి ఫతేపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. గతంలో మాయావతి ప్రభుత్వంలో అతడు మంత్రిగా కూడా పనిచేశాడు. కానీ, అనూహ్యంగా మంగళవారం సాయంత్రం అఖిలేశ్ నివాసానికి వెళ్లి తాను ఎస్పీలో చేరుతున్నట్లు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు సమాజ్ వాది పార్టీ విధి విధానాలు బాగా నచ్చాయని, అందుకే తాను అందులో చేరుతున్నట్లు చెప్పారు. ఇటీవల బీఎస్పీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్, కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపేలో చేరుతున్న విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే సీటు చాలా ‘హాటు’
ముంబై: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు గత ఐదేళ్లో 164 శాతం పెరిగినట్లు వారు సమర్పించిన అఫిడవిట్ల ద్వారా వెల్లడైంది. మరోసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 216 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను రెండు స్వచ్ఛంద సంస్థలు అధ్యయనం చేసి ఈ వివరాలు వెల్లడించాయి. ఈ ఎమ్మెల్యేల ఆస్తులు 2009లో సగటు రూ.4.97 కోట్లు ఉండగా, అవి ఈ ఏడాదికి రూ.13.15 కోట్లకు పెరిగినట్లు వారి అఫిడవిట్లను విశ్లేషించిన ఆ సంస్థలు తెలిపాయి. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), మహారాష్ట్ర ఎలక్షన్ వాచ్ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ అధ్యయనం జరిపాయి. ఒక్కో అభ్యర్థి ఆస్తులు సగటున రూ.8.17 కోట్లు లేదా 164 శాతం మేరకు పెరిగినట్లు ఆ అధ్యయనం వెల్లడించింది. ఆస్తుల పెరుగుదలలో మలబార్ హిల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ అభ్యర్థి మంగళ్ ప్రభాత్ లోధా మొదటి స్థానంలో ఉన్నారు. ఈ ఐదేళ్లలో ఆయన ఆస్తి 129.97 కోట్లకు పెరిగింది. 2009లో లోధా ఆస్తుల విలువ రూ.68.64 కోట్లు కాగా అవి ఈ ఏడాదికి రూ.198.61 కోట్లకు పెరిగాయి. జల్గావ్ సిటీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శివసేన అభ్యర్థి సురేష్ కుమార్ భికమ్చంద్ జైన్ ఆస్తులు ఐదేళ్లలో వందకోట్లు పెరిగాయి. ఐదేళ్ల క్రితం ఆయన ఆస్తుల రూ.82.82 కోట్లు కాగా, ఇప్పుడు అవి రూ.182.84 కోట్లు. కాండీవలి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ సింగ్ రామ్‌నారాయణ్ ఠాకూర్ ఆస్తులు రూ.22.22 నుంచి రూ.81.63 కోట్లు అనగా రూ.59.40 కోట్లు పెరిగాయి. కాంగ్రెస్ నుంచి తిరిగి పోటీ చేస్తున్న 62 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 184 శాతం పెరిగినట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఎన్సీపీకి చెందిన 51 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 176 శాతం పెరిగాయి. బీజేపీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలు తమ ఆస్తులు సగటున 198 శాతం పెరిగినట్లు తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఎమ్మెన్నెస్‌కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల ఆస్తులు 294 శాతం పెరగగా, ఎనిమిది మంది ఇండిపెండెంట్ సభ్యుల ఆస్తులు 74 శాతం మేరకు పెరిగాయి. శివసేనకు చెందిన 36 మంది శాసనసభ్యుల ఆస్తులు 172 శాతం పెరిగినట్లు వెల్లడైంది. -
ఎట్టకేలకు కాంగ్రెస్ జాబితా
బాలునాయక్ మినహా సిట్టింగులందరికీ అవకాశం సాక్షిప్రతినిధి, నల్లగొండ,సిట్టింగు ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేయడానికి తీవ్రమైన కసరత్తు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు సోమవారం సాయంత్రం అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. సీపీఐతో పొత్తులో భాగంగా వదులుకున్న దేవరకొండ నియోజకవర్గాన్ని మినహాయిస్తే, జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తిరిగి అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గుడిపాటి నర్సయ్యకు మరోసారి అవకాశం కల్పించింది. పెద్దగా సంచలనం సృష్టించిన, అనూహ్యమైన నిర్ణయాలేవీ జరగలేదు. గత కొద్ది రోజులుగా మిర్యాలగూడ నియోజకవర్గంలో తెరపైకి వచ్చిన మాజీ మంత్రి జానారెడ్డి సన్నిహితుడు ఎన్.భాస్కర్‌రావు పేరును ఖరారు చేశారు. బీసీ కోటాలో భాగంగా భువనగిరికి పోతంశెట్టి వెంకటేశ్వర్లును ఎంపిక చేశారు. కోదాడపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆలేరు నుంచి ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, తుంగతుర్తికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడిపాటి నర్సయ్య, సూర్యాపేట - ఆర్.దామోదర్‌రెడ్డి, హుజూర్నగర్ - ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మిర్యాలగూడ -ఎన్.భాస్కర్‌రావు, నాగార్జునసాగర్ - కె.జానారెడ్డి, నల్లగొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్-చిరుమర్తి లింగయ్య, భువనగిరి - పి.వెంకటేశ్వర్లు పేర్లు జాబితాలో చోటు చేసుకున్నాయి. సీపీఐకి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలను కేటాయించింది. కోదాడలో ఎవరికి అవకాశం కలిసొస్తుందోనన్న ఉత్కంఠ కార్యకర్తల్లో నెలకొంది. కోదాడ నియోజకవర్గం నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఏఐసీసీ నాయకత్వం మాత్రం ఒక కుటుంబంలో ఒకరికే అవకాశం అన్న మెలిక పెట్టడంతో పద్మావతి అభ్యర్థిత్వం పెండింగులో పడింది. మరోవైపు గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనారిటీ నేత మహ్మద్ జానీ ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేసి, తాను రేసులో ఉన్నానని హైకమాండ్‌కు చెప్పకనే చెప్పారు. ఇప్పుడు టికెట్ ఖరారు చేస్తే వివాదాస్పదం కావడం ఖాయమని భావించినందునే కోదాడ అభ్యర్థి పేరును పెండింగ్‌లో పెట్టినట్లు చెబుతున్నారు. ఇక, తెలంగాణ ఉద్యమంలో, ఆయా జేఏసీల్లో పనిచేసిన ఉద్యమ కారులకు ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రకటించగా, జిల్లా నాయకత్వం మాత్రం ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ తెలంగాణ పొలిటికల్ జేఏసీలో చురుకైన పాత్రనే పోషించారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధిగా పార్టీ సంస్థాగత పదవినీ దక్కించుకున్నారు. దయాకర్ పేరును ఎస్సీ రిజర్వుడు స్థానమైన తుంగతుర్తికి పరిశీలిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. కానీ, తీరా ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గుడిపాటి నర్సయ్యకే టికెట్ దక్కింది. సామాజిక చిత్రాల దర్శకుడు ఎన్. శంకర్‌కు మిర్యాలగూడ టికెట్ ఇవ్వడానికి దాదాపు లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. ఈదశలో జిల్లా నేతలు మోకాలడ్డడంతో టికెట్ రాకుండా అయ్యింది. శంకర్ స్థానంలో జానారెడ్డి దగ్గరి వ్యక్తి అయిన భాస్కర్‌రావుకు టికెట్ దక్కింది. పెద్ద సంచలనాలేవీ లేకుండానే అందరు సిట్టింగులకు అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ నాయకత్వం జాబితాను ప్రకటించడం విశేషం. -
కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు
-
సిట్టింగ్‌లకు ‘పరీక్ష’!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఒకదానిపై ఒకటిగా దూసుకొచ్చిన మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఎన్నికలు తమ భవితవ్యాన్ని ఏ మలుపు తిప్పుతాయోననే ఆందోళన శాసనసభ్యుల్లో వ్యక్తమవుతోంది. అన్ని రాజకీయ పక్షాలకు ఈ ఎన్నికలు టెన్షన్ పుట్టిస్తున్నా... రేపటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయాలనుకునే సిట్టింగ్‌లు, ఇతర ఆశావహులకు మాత్రం కంటిమీద కునుకు కరువైంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లో అయితే డబుల్‌ధమాకా లాగా వచ్చిన ఈ ఎన్నికలు తమపుట్టి ముంచుతాయేమోననే భయం కనిపిస్తోంది. మిగిలిన స్థానాల ఎమ్మెల్యేలు మాత్రం ‘స్థానిక’ తలనొప్పులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో.... తాము పోటీచేసే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోననే సందేహంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ నలుగురిదీ విచిత్ర పరిస్థితి.... రెండు నెలల వ్యవధిలో మూడు రకాల ఎన్నికలు తన్నుకొచ్చిన నేపథ్యంలో జిల్లాలోని నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మధిర, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపాలిటీలు ఉన్న నియోజకవర్గాలు.... మధిర నుంచి భట్టి విక్రమార్క (కాంగ్రెస్), ఇల్లెందు నుంచి ఊకె అబ్బయ్య (టీడీపీ), కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు (సీపీఐ), సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య (టీడీపీ) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నలుగురి పరిస్థితి ఇప్పుడు త్రిశంకు స్వర్గాన్ని తలపిస్తోంది. అటు మున్సిపల్, ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక వారు తలలుపట్టుకుంటున్నారు. అటు ఆర్థికంగా, ఇటు మానసికంగా తమను ఈ ఎన్నికలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థుల వెతుకులాట, వారి ఆర్థిక భారంతో పాటు రెబెల్స్... ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వీరికి గుబులు పుట్టిస్తున్నాయి. మున్సిపాలిటీలో విజయం సాధించలేకపోతే... ఆ ప్రభావం స్థానిక ఎన్నికలపై, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలపై చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ మున్సిపాలిటీలో బతికి బయటపడ్డా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏమవుతుందో... సార్వత్రిక ఎన్నికలకు 20 రోజుల ముందు వచ్చే ఆ ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆందోళన వెంటాడుతోంది. ఒక ఎన్నికలో గెలిచి, మరో ఎన్నికలో ఓడితే పరిస్థితేంటి? ముందు ఎన్నికల్లో గెలిచి... తరువాతి ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే ఎలా? రెండు ఎన్నికల్లో విజయం సాధించినా... ఆ ఊపు అసెంబ్లీ ఎన్నిక వరకు కొనసాగుతుందా? ముందు జరిగే రెండు ఎన్నికలలో పెట్టుకున్న పొత్తులు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉంటాయా? ఉంటే ఎలా? ఉండకపోతే ఎలా? అసలు ఇన్ని ఎన్నికలు ఒకేసారి వస్తే ఆర్థిక భారం మోసేదెలా? అనే ప్రశ్నలు ఒకరకంగా వారికి నిద్రపట్టనివ్వడం లేదనే చెప్పాలి. మిగిలిన ఆరుగురికీ టెన్షనే ఆ నలుగురి పరిస్థితి అలా ఉంటే.... జిల్లాలోని మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలూ ప్రస్తుతం సంకటస్థితిలోనే ఉన్నారు. వీరిలో నలుగురు అధికార కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా, మరొకరు టీడీపీ, ఇంకొకరు సీపీఐకి చెందిన వారు. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు.... ఆ తర్వాత వారికి ఆర్థిక సహకారం... అటుపైన ఫలితాలు... మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు... అన్నింటినీ ఎలా మేనేజ్ చేయాలో తమకు అర్థం కావడం లేదని వారంటున్నారు. మున్సిపల్ ఎన్నికలలో ప్రతికూల ఫలితం వచ్చినా, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే స్థానిక ఎన్నికలలో మంచి వ్యూహం అవలంబించి బయటపడితే అదే ఊపు అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఉండేదని, కానీ మా స్థానాల్లో స్థానిక ఎన్నికల్లో ఓటమి పాలయితే అదే ఓటమితో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాల్సివస్తుందని ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద వేసవి అంటే విద్యార్థులకు పరీక్షా కాలమని, కానీ ఈసారి వేసవి కాలం తమకు నిజంగా పరీక్ష వంటిదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. మరి ఈ పరీక్షను సిట్టింగ్‌లు ఎలా నెట్టుకొస్తారో వేచి చూడాల్సిందే.