సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అధికార బీఆర్‌ఎస్ పార్టీలో అసంతృప్తులు చల్లారడం లేదు. ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి బుజ్జగిస్తున్నా ససేమిరా అంటున్నారే తప్ప.. కలిసి రావడం లేదు. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగులకు టికెట్ ఇస్తామని ప్రకటించిన నాటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అభ్యర్థుల ప్రకటన తరువాత కూడా తమ అసంతృప్తిని బయట పెడుతూనే ఉన్నారు.
అంతేకాదు బీఫాం ఇచ్చేనాటికి పరిస్థితుల్లో మార్పు రావొచ్చన్న ఆలోచనలతో తమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. దానికితోడు మార్పులకు అవకాశం ఉందంటూ ప్రచారం కూడా సాగుతోంది. దీంతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు నెలకొంది. అధిష్టానం పక్కాగా తమకే టికెట్ ఇస్తుందా? ఏదైనా మార్పులు చేస్తుందా అని లోలోపల ఆందోళన చెందుతున్నారు.
చల్లారని అసమ్మతి
ఎన్నికల షెడ్యుల్ రాకముందే సీఎం కేసీఆర్.. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అంతా వెళి్‌ల్ నియోజకవర్గాల్లో పనులు చేసుకోవాలని సూచించారు. అంతవరకు బాగానే ఉన్నా నియోజకవర్గాల్లో ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తూ ఈసారైనా తమకు టికెట్ ఇవ్వకపోతారా? అని ఎదురుచూసిన వారికి సీఎం ప్రకటనతో మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది.
అయినా నోటిఫికేషన్ వచ్చి, నామినేషన్లకు బీఫాం ఇచ్చే వరకు ఏమైనా జరగొచ్చనే ఆలోచనలతో కొన్ని నియోజకవర్గాల్లో తమ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మరికొందరైతే అభ్యర్థులను మార్చకపోతే తాము సహకరించబోమంటూ తెగేసి చెబుతున్నారు. ఎమ్మెల్యేలే స్వయంగా అసంతృప్తి నేతల ఇళ్లకు వెళ్లి బుజ్జగిస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. మరి కొన్నిచోట్ల ఆశావహులు బహిరంగంగానే పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సర్వే గుబులు
ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నారని, దాని ఆధారంగానే భవిష్యత్‌లో బీఫాంను కూడా గెలిచే వారికే ఇస్తారన్న చర్చ సాగుతోంది. దీంతో అంసతృప్తులు ఉన్న నియోజకవర్గాల్లోని సిట్టింగుల్లో గుబులు మొదలైంది. ఏం జరుగబోతుందో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. చివరి క్షణంలో ఏమైనా మార్పులు చేస్తే తమ పరిస్థితి ఏంటన్న గందరగోళంలో పడ్డారు.
వివిధ నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా..
► నాగార్జునసాగర్‌లోనూ అంసతృప్తి అలాగే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా.. టికెట్ ఆశిస్తున్న మన్నెం రంజిత్ యాదవ్‌కు మద్దతుగా పార్టీ శ్రేణులు సమావేశాలను కొనసాగిస్తున్నారు. నాగార్జున సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని స్థానిక బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లో, నాయకుల్లో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. తమ మద్దతు ఉన్న అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని పైరవీలు నడుపుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ అసమ్మతి సెగలు అధిష్ఠానానికి తలనొప్పిగా తయారయ్యాయి.
► నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమని చెబుతున్నారు. తనకు అవకాశం ఇస్తారని ఆశించినా, బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పేరునే కేసీఆర్ ఖరారు చేశారు.
► దేవరకొండ నియోజకవర్గంలోనూ అసంతృప్తి చల్లారలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేను స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు.
► కోదాడలోనూ అదే పరిస్థితి నెలకొంది. అక్కడ బీఆర్‌ఎస్ నాయకుడు శశిధర్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు ఇంటికి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వెళ్లినా కలిసేందుకు నిరాకరించారు.
► నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన ప్రయత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు. బీఆర్‌ఎస్ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినా ప్రయోజనం కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment