సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీసీల అంశంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు రెండు నెలల కిందట పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ తరువాత ఆ అంశంపై చర్చ లేకుండాపోయింది. అయితే, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు.
సీనియర్లు త్యాగం చేయాలి
ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో బీసీలకు రెండు చొప్పున అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని రాహుల్‌కు చెప్పానని వెంకట్‌రెడ్డి ప్రకటించడం వెనుక వ్యూహాత్మక వైఖరి ఉన్నట్లుగా తెలుస్తోంది. తానే ఆ ప్రతిపాదన చేసినందున, అందుకు తాను కట్టబడి ఉంటానని స్పష్టం చేశారు. సీనియర్లు త్యాగాలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తన డిక్లరేషన్‌ను అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో దేవరకొండ(ఎస్టీ) స్థానం పోతే మిగతావి ఆరు జనరల్ స్థానాలు ఉన్నాయి. తనతో పాటు ఉత్తమ్ ఉన్నారని, మాజీ మంత్రి జానారెడ్డి కుమారులు చెరో నియోజకవర్గంలో దరఖాస్తు చేశారని, సూర్యాపేటలోనూ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి ఉన్నారని, ఎవరైరా ఇద్దరు త్యాగం చేయాలని చెప్పుకొచ్చారు.
ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో స్పష్టం చేయకపోయినా, ఆ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానని ఏడాది కిందటే ప్రకటించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇప్పుడు అవసరమైతే తాను పోటీ నుంచి తప్పుకొని బీసీకి అవకాశం ఇస్తానని చెప్పడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయం అంతా ఆయన చుట్టే తిరిగేలా చేశారు. బీసీలకు సర్దుబాటు కానప్పుడు త్యాగం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, రేపు ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీ తీసుకుంటానని, లేదంటే ఎంపీగా పోతానని పేర్కొన్నారు.
వ్యూహంలో భాగంగానే దరఖాస్తు చేశారా..
మొదటి నుంచి నల్లగొండ టికెట్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే అన్నది సుస్పష్టం. ఆయన్ని కాదని మరొకరికి ఇచ్చే సాహసాన్ని కాంగ్రెస్ చేసే అవకాశం కూడా లేదని పార్టీ వర్గాల భావన. అలాంటి పరిస్థితుల్లో ఆయన బీసీ నినాదాన్ని తెరపైకి ఎందుకు తెచ్చారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తు తం నల్లగొండలో కాంగ్రెస్ టికెట్ కోసం ఆయనతో పాటు మరో ఆరుగురు దరఖాస్తు చేశారు. అందులో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, తిప్పర్తి జెడ్పీటీసీ తండు సైదులు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కూడా ఉన్నారు. అయితే, ఎంపీ వెంకట్‌రెడ్డి సూచన మేరకే బొడ్డుపల్లి లక్ష్మి దరఖాస్తు చేశారనే చర్చ జరుగుతోంది.
త్వరలోనే స్పష్టత
కాంగ్రెస్ తరఫున పోటీలో ఉండే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపును మరికొద్ది రోజుల్లో ప్రకటించేందుకు టీపీసీసీ, ఎన్నికల కమిటీ వేగంగా కసరత్తు చేస్తోంది. ఎంపీ వెంకట్‌రెడ్డి చేసిన ఈ సూచనలను అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా అన్నది త్వరలో తేలనుంది. నిజంగా అదే జరిగితే బీసీలంతా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎంపీ స్థానంలో బీసీలకు రెండు టికెట్లు ఇస్తే అధికార పార్టీపైనా ఈ ఒత్తిడి పెరిగే అవకాశం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment