యాదాద్రి: సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాలో సర్వేలు జోరందుకున్నాయి. రాజకీయ పార్టీలే కాకుండా అభ్యర్థులు, ఆశావహులు ఎవరికి వారు సర్వేలు చేయిస్తూ పరిస్థితులను బేరీజు వేసుకుంటున్నారు. జిల్లాలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అధిష్టానం సర్వే చేయిస్తుండడంతో సిట్టింగుల్లో గుబులు నెలకొంది. అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై, పనితీరు మార్చుకోని వారిపై వేటు తప్పదని అధినేత చేసిన ప్రకటనతో ఎమ్మెల్యేలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా సర్వేలు చేయిస్తున్నాయి. బలమైన ఆశావహులు సైతం సొంతంగా సర్వే చేయించుకుంటున్నారు.
పలుకోణాల్లో అభిప్రాయ సేకరణ..
ప్రజల్లో తమ పార్టీ, తమ అభ్యర్థి వ్యక్తిగత స్థితి ఏమిటన్న దానిపై సర్వేలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిఘా సంస్థలు, అభ్యర్థులు, ఆశావహులు ఏజెన్సీల ద్వారా ఎవరికివారే సర్వేలు చేయిస్తున్నారు. ప్రత్యేకించి రెండు జాతీయ స్థాయి ఏజెన్సీలు పట్టణాలు, గ్రామాల్లో తమ సిబ్బంది ద్వారా వివిధ కోణాల్లో సర్వే చేస్తున్నాయి. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా రెండు రకాలుగా సర్వే చేయిస్తున్నారు.
బీఆర్‌ఎస్ మరోసారి..
బీఆర్‌ఎస్ మరోసారి సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక ఏజెన్సీతోపాటు ప్రభుత్వ నిఘా సంస్థల ద్వారా సర్వే చేయిస్తోంది. దళితబంధు, గృహలక్ష్మి, బీసీబంధు లబ్ధిదారుల ఎంపికలో చేతివాటం ప్రదర్శించడంపై వస్తున్న ఫిర్యాదులను అధినేత కేసీఆర్ సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో కొన్ని మండలాల్లో దళితబంధు యూనిట్‌లు కేటాయించేందుకు లబ్ధిదారుల నుంచి పలువురు ప్రజాప్రతినిధులు డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆ అంశాన్ని కూడా సర్వే సంస్థలు ప్రత్యేకంగా సేకరిస్తున్నాయి. వీటితో పాటు అభ్యర్థుల వ్యవహార శైలి, ప్రజలతో సంబంధాలు, నియోజకవర్గ ప్రజలకు ఏమేరకు సమయం కేటాయిస్తున్నారు.. తదితరు అంశాలపై ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాల నుంచి పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరు, వారి ప్రభావం ఏ మేరకు ఉంటుందని సేకరిస్తున్నారు. అసంతృప్తులు ఉన్నారా, ఉంటే వారు ఏ మేరకు ప్రభావం చూపుతారన్న అంశాలపైనా సర్వే కొనసాగుతోంది.
కాంగ్రెస్ షార్ట్ సర్వేపై ఆసక్తి..
కర్ణాటక తరహా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పెద్దలు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వీరిపై పార్టీ అధిష్టానం షార్ట్ సర్వే చేయిస్తోంది. ఏ అభ్యర్థిని రంగంలో దించితే గెలుపు సాధ్యమవుతుంది, ప్రజల్లో ఉన్న పలుకుబడి, ఆదరణ, ఆర్థిక స్థితిగతుల వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ, పీసీసీలు రెండు, మూడు సర్వేలు చేయించాయి. తాజాగా మరో సర్వే చేయిస్తోంది. ఈసర్వేను అభ్యర్థుల ఎంపికకు కొంత ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. అలాగే పోటీలో ఉండే బలమైన ఆశావాహులు సైతం వ్యక్తిగత సర్వేలు చేయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment