సాక్షి, యాదాద్రి: కుంభం అనిల్ కుమార్‌రెడ్డి పార్టీని వీడిన నేపథ్యంలో ఆ లోటును పూడ్చడానికి కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది. కుంభం వెంట ఎవరూ వెళ్లకుండా చూడడంతో పాటు ఇతర పార్టీలోని అసంతృప్తులపై హస్తం పార్టీ కన్నేసింది. నియోజకవర్గంలో బలమైన అనుచరగణం కలిగి ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే తమ అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయం కూడా తీసుకున్నారు. కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరో వైపు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తన పట్టు నిలుపుకోవడానికి కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలను ప్రోత్సహిస్తున్నారు.
బీఆర్‌ఎస్‌కు ‘చింతల’ రాం..రాం?
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి తనకు అవకాశం వచ్చిందని సీనియర్ నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌తో ఉన్న సుధీర్ఘ అనుబంధాన్ని వీడి తొమ్మిదేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్సీ పదవి వస్తుందన్న ఆశలు నెరవేరలేదు. తనకు బీఆర్‌ఎస్ పార్టీ సరిగా గుర్తింపు ఇవ్వడం లేదని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఆయనకంటూ ఉన్న వర్గం చింతల నిర్ణయాన్ని స్వాగతిస్తోంది.
2000 సంవత్సరంలో భువనగిరి ఎమ్మెల్యే, అప్పటి మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మరణానంతరం వచ్చిన అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి చింతల వెంకటేశ్వర్‌రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2009లో భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండవసారి పోటీ చేసినప్పటికీ విజయం వరించలేదు. అయితే 2014లో మారిన రాజకీయ పరిస్థితులతో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజా రాజకీయ పరిణామాల నేపఽథ్యంలో మరోసారి భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని ప్రచారం జోరందుకుంది.
కాంగ్రెస్ వైపు జిట్టా చూపు : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డిని ఆ పార్టీ సస్పెండ్ చేయడంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. యువజన సంఘాల నాయకునిగా తెలంగాణ ఉద్యమ నేతగా పేరున్న జిట్టా బాలకృష్ణారెడ్డి 2009లో బీఆర్‌ఎస్‌నుంచి భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. మహాకూటమి పొత్తులో ఆయనకు టికెట్‌రాలేదు. దీంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పటికి ఓటమి తప్పలేదు. 2018లో బీజేపీ మద్దతుతో యువ తెలంగాణ అభ్యర్థిగా రంగంలోకి దిగినా ప్రయోజనం దక్కలేదు. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా తనకంటూ అనుచర గణం కలిగిన జిట్టా మరో సారి భువనగిరిలో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని తన అనుచరుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.
బీఆర్‌ఎస్‌లోకి ద్వితీయ శ్రేణి
కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరడంతో ద్వితీయ శ్రేణి ఆయన బాటలో పయనిస్తోంది. గురువారం భువనగరి మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పచ్చలహేమలత ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరో నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. వలిగొండకు చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. నియోజకవర్గంలోని మరికొన్ని మండలాల నుంచి ద్వితీయ శ్రేణి క్యాడర్ బీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధం అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment