యాదాద్రి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి నియోజకవర్గంలో నలుగురైదుగురు రేస్‌లో ఉన్నారు. బరిలో నిలిచి తమ భవితవ్యం తేల్చుకోవాలని పావులు కదుపుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం నేతల పనితీరు ఆధారంగానే టికెట్‌లు ఇస్తామని చెబుతోంది. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ రెండు.. బీసీలకు కేటాయిస్తారన్న ప్రచారం
భువనగిరి, ఆలేరు స్థానాలను బీసీలకు కేటాయిస్తారన్న ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. మూడు రోజుల క్రితం జరిగిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలోనూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరిలో బీసీ సామాజిక వర్గం నుంచి నలుగురు పోటీ పడుతున్నారని ప్రకటించడం అందుకు బలం చేకూరుస్తోంది.
అయితే భువనగిరి, ఆలేరు స్థానాలు బీసీలకేనని ఏఐసీసీ, టీపీసీసీ మాత్రం ఎక్కడా ప్రకటించలేదు. ఇక ఆలేరులో బీసీ సామాజికవర్గానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శితోపాటు ఓసీ, ఎస్సీ వర్గాల నుంచి పలువురు నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. మునుగోడులో ఓసీ, బీసీ సామాజికవర్గాల నుంచి పలువురు నేతలు టికెట్ రేసులో ఉన్నారు. నకిరేకల్, తుంగతుర్తి రిజర్వ్ నియోజకవర్గాలు కావడంతో ఆయావర్గాల నుంచి కొందరు టికెట్ ఆశిస్తున్నారు.
హస్తం వైపు ముఖ్య నేతల చూపు..
బీఆర్‌ఎస్, బీజేపీలోని అసమ్మతి నేతలు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరాల తరబడి సేవలందించినా లబ్ధి చేకూరలేదన్న నిరాశతో కొందరు, విధివిధానాలు నచ్చక మరికొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరి నియోజకవర్గంలో సీనియర్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే?
బీజేపీలో ఉన్న ఓ మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న ఓ మాజీ ఎమ్మెల్యే తమ రాజకీయ భవిష్యత్‌పై డోలాయమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారన్న చర్చ నడుస్తోంది.
ఈ ఇద్దరు నేతలు గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచిన వారే కావడం విశేషం. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్న పట్టుదలతో ఉన్న వీరిద్దరు.. తమ అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పుపై ఇప్పటికిప్పుడు స్పష్టత ఇవ్వకపోయినా ఎన్నికల నాటికి ఏదైనా జరిగే అవకాశం లేకపోలేదన్న చర్చ నడుస్తోంది.
దరఖాస్తు చేసుకుంటేనే..
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ సూచింది. శుక్రవారం(నేడు) నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. టికెట్ కోసం ఎంత మంది అయినా దరఖాస్తు చేసుకోవచ్చని అధిష్టానం తెలిపింది. ఇందుకు ఆశావహులు రెడీ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment