ఏర్పాట్లను పరిశీలిస్తున్న రాచకొండ సీపీ, డీసీపీ
యాదాద్రి: బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభకు భువనగిరి ముస్తాబైంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం జనగామలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు.
సాయంత్రం 3 గంటలకు హెలికాప్టర్‌లో భువనగిరిలోని సభాస్థలికి చేరుకొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సభ విజయవంతానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పార్టీ నాయకులతో కలిసి వారం రోజులుగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. దగ్గరుండి సభా ఏర్పాట్లను పరిశీలించారు. భువనగిరి మున్సిపాలిటీ, భువనగిరి మండలం, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ మండలాల నుంచి 50 వేల మందిని సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించారు. సభలో వేదికపై 100 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు.
మహిళలు, వీఐపీలు, మీడియా, వృద్ధుల కోసం ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సభ సందర్భంగా వేదికతోపాటు పట్టణం మొత్తం గులాబీమయంగా మారింది. సభా ఏర్పాట్లను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీ రాజేశచంద్ర పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
మూడుచోట్ల వాహనాల పార్కింగ్
సీఎం సభకు వచ్చే వాహనాలను పార్కింగ్ చేయడానికి మూడు చోట్ల ఏర్పాట్లు చేశారు. రాయగిరి రోడ్డులో ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కళాశాల, గంజ్ మార్కెట్, వలిగొండ రోడ్డు ఖిలా దిగువన వెంచర్, తుర్కపల్లి రోడ్డులో బ్రిడ్జి దాటిన తర్వాత వెంచర్‌ను వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
స్పిన్నింగ్ మిల్ నుంచి సీఎం కాన్వాయ్
సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో హైదరాబాద్ రోడ్డులో గల పెద్ద చెరువు సమీపంలో స్పిన్నింగ్ మిల్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా సభావేదిక వద్దకు చేరుకుంటారు.
వరాల జల్లు కురిపించేనా?
ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనడానికి భువనగిరికి వస్తున్న సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తారా.. అన్న ఆసక్తితో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలోనూ కేసీఆర్ పాల్గొన్నారు. ఆసందర్భంగా పలు హామీలు ఇచ్చారు. 2.65లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బస్వాపూర్ రిజర్వాయర్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
బునాదిగాని, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాలువల ఆధునీకరణ పూర్తికాలేదు. పర్యాటక ప్రాంతాలుగా భువనగిరి ఖిలా, బస్వాపురం రిజర్వాయర్లు, మూసీ ప్రక్షాళన హామీలు నెరవేరలేదు.
భువనగిరి నియోజకవర్గ వాసులు కోరుతున్నవి
హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి వెంట భువనగిరి – బీబీనగర్ మధ్య ఐటీ హబ్ ఏర్పాటు చేయాలి.
భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలు ఏర్పాటు చేయాలి.
భువనగిరిలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలి.
సంగెం – బొల్లేపల్లి మధ్య మూసీపై వంతెన నిర్మించి రవాణా ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.
బీఆర్‌ఎస్ పాలనలో విశేష ప్రగతి
ఎన్నికల మేనిఫెస్టోపై అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయి. గడిచిన పదేళ్లలో రాష్ట్రం విశేష ప్రగతి సాధించింది. మూడవ సారి కూడా కేసీఆరే సీఎంకావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. భువనగిరిలో నేడు జరిగే ఆశీర్వాద సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో రానున్నారు. –పైళ్ల శేఖర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment