యాదాద్రి: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లైసెన్స్‌డ్ తుపాకులు (గన్స్) పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, ప్రముఖుల నుంచి పోలీస్ శాఖ ఆయుధాలను వెనక్కి తీసుకుంటోంది. ఈ మేరకు వారందరికి నోటీసులు జారీచేసింది. నోటీసు అందిన వారం రోజుల్లోగా తమ వద్ద ఉన్న తుపాకులను సంబంధిత పోలీస్ స్టేషన్లలో అందజేయాలని స్పష్టం చేసింది.
దీంతో లైసెన్స్‌డ్ తుపాకీలు కలిగిన వారంతా పోలీసు స్టేషన్ల బాటపట్టారు. ఉమ్మడి జిల్లాలో 455 మంది లైసెన్స్ తుపాకులు తీసుకున్న వారు ఉన్నారు. అందులో అత్యధికంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులే. ఆ తరువాత బడా వ్యాపారులు ఉన్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలో 227 మందికి లైసెన్స్‌డ్ గన్స్ ఉండగా, వారిలో దాదాపుగా ఇప్పటికే పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేశారు. సూర్యాపేట జిల్లాలో 154 మందికి లైసెన్స్‌డ్ గన్స్ ఉండగా, 110 మంది ఇప్పటికే తిరిగి అప్పగించారు.
యాదాద్రి జిల్లాలో 74 మందికి లైసెన్స్‌డ్ గన్స్ ఉండగా, వారిలో కొంతమంది తిరిగి అప్పగించారు. మిగతా వారు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అలాంటి వారిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర నాయకులు ఉన్నారు.
తగ్గిన లైసెన్స్‌డ్ గన్‌లు
నల్లగొండ జిల్లాలో గన్ కల్చర్ కొంత మేర తగ్గింది. గతంలో భారీ సంఖ్యలో వ్యక్తిగత తుపాకులు కలి గిన వారు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రాణ భయంతో వ్యక్తిగత భద్రత కోసం గన్ లైసెన్స్‌లను ఎక్కువ మంది తీసుకున్నారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1500 వరకు వ్యక్తిగత ఆయుధాలను సమకూర్చుకోగా, ఇప్పుడు వారి సంఖ్య 455కు తగ్గిపోయింది.
గత ఎన్నికల సమయంతో పోల్చితే సూర్యాపేట, యాదాద్రి జిల్లాలు మినహా నల్లగొండలో ఈ ఐదేళ్లలో గన్ లైసెన్స్ తీసుకున్నవారి సంఖ్య తగ్గింది. 2018 ఎన్నికల సమయంలో నల్లగొండలో 257 మంది లైసెన్స్‌డ్ గన్స్ కలిగిన వారు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 227కు తగ్గింది.
దుర్వినియోగం చేయవద్దనే..
ఎన్నికల సమయంలో, సభలు, సమావేశాలు నిర్వహించినప్పుడు, ప్రతిపక్ష పార్టీలు తారసపడినప్పుడు వాటిని దుర్వినియోగం చేసే అవకాశాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ఈ నిబంధన తీసుకువచ్చింది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఎవరూ వ్యక్తిగతంగా భయబ్రాంతులకు గురిచేయకుండా ఉండేందుకు తమ వద్ద ఉన్న గన్‌లను పోలీసు స్టేషన్లలో అప్పగించేలా నిబంధన విధించింది.
వీటికి మినహాయింపు
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కోడ్ అమల్లో ఉన్న సమయంలో గన్స్ పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేయడంలో కొన్ని విభాగాలను మినహాయించారు. ముఖ్యంగా బ్యాంకుల సెక్యూరిటీ, టోల్ ప్లాజాలు, క్రీడలకు సంబంధించిన ఈవెంట్స్‌లో ఉన్న వాటిని డిపాజిట్ చేయడం నుంచి మినహాయించారు.
Comments
Please login to add a commentAdd a comment