సమావేశంలో మాట్లాడుతున్న సీపీ డీఎస్ చౌహాన్, పాల్గొన్న పోలీసు అధికారులు
యాదాద్రి : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. బుధవారం ఉప్పల్‌లోని ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన భునవగిరి జోన్ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలిసి ఉండాలన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాలకు సామగ్రి తీసుకెళ్లే రూట్‌ను చెక్ చేసుకోవాలని, చెక్‌పోస్టుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
సమస్యలు సృష్టించేవారిపై నిఘా ఉంచాలి
అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గతంలో జరిగిన ఎన్నికల్లో సమస్యలు సృష్టించిన వారిపై నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు సీపీ సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా పంపే సందేశాలు, వీడియోలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందజేయాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ సీపీ అంబర్ కిషోర్, డీసీపీ రాజేష్ చంద్ర, రాచకొండ ట్రాఫిక్ డీసీసీ–1 అభిషేక్ మహంతి, మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి, ఎస్‌ఓటీ డీసీపీ–1 గిరిధర్, మహేశ్వరం డీసీపీ శ్రీని వాస్, ఎస్బీ డీసీపీ బాలస్వామి, సెబర్ క్రైమ్ డీసీపీ అనురాధ, అడ్మిన్ డీసీపీ ఇందిరా, ఎల్పీనగర్ డీసీపీ సాయిశ్రీ, ట్రాఫిక్ డీసీపీ–2 శ్రీనివాసులు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషావిశ్వనాథ్, క్రైమ్ డీసీపీ అరవింద్, అడిషనల్ డీసీపీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment