యాదాద్రి: ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అక్కడక్కడా అసంతృప్తి స్వరం వినిపిస్తుండగా.. దానికి చెక్ పెట్టేందుకు ఆయా పార్టీల నాయకత్వాలు ప్రయత్నిస్తున్నాయి. తమకు ప్రాధాన్యం దక్కడం లేదని కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ద్వితీయ శ్రేణి నాయకులతో ఎమ్మెల్యే సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని ఓ రిసార్ట్‌లో ఆలేరు బీఆర్‌ఎస్ నాయకులు సమావేశమయ్యారు. అదేవిధంగా భువనగిరి కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. బుధవారం బీబీనగర్, భువనగిరి శివారులో ఆ పార్టీ నేతలు, ఆశావహులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందరూ హాజరు కాకపోవడంతో గురువారం మళ్లీ ఉప్పల్ శివారులోని ఓ హోటల్‌లో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.
తమకు చేకూరే లబ్ధిపై హామీ ఇవ్వాలని ప్రస్తావన..
ఉప్పల్ సమీపంలోని ఓ హోటల్‌లో గురువారం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి సమన్వయ కర్తగా భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆశావహుల సమావేశం జరిగింది. టికెట్ ఆశిస్తున్న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో సహా జిట్టా బాలకృష్ణారెడ్డి, తంగెళ్లపల్లి రవికుమార్, పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్, పంజాల రామాంజనేయులుగౌడ్, పోత్నక్ ప్రమోద్‌కుమార్, బర్రె జహంగీర్ మరికొందరు ముఖ్య నేతలు హాజరయ్యారు.
సమావేశంలో ముందుగా ఆశావహులు కొందరు తీవ్ర వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ స్కీంలను ప్రజల్లోకి తీసుకుపోకుండా గ్రూపులుగా విడిపోయి అడ్డుకుంటే ఎన్నికల్లో జరిగే నష్టంపై చర్చించారు. అధిష్టానం టికెట్ ప్రకటించే వరకు ఎవరూ తానే అభ్యర్థినని ప్రకటించుకోవద్దని నిర్ణయించారు. శుక్రవారం పోచంపల్లిలో జరిగే కాంగ్రెస్ సమావేశానికి ఆశావహులందరూ హాజరవుతామని అంగీకారానికి వచ్చారు.
అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఏవిధమైన లబ్ధిచేకూరుతుందో ముందుగానే హామీ ఇవ్వాలని పలువురు సమావేశంలో ప్రస్తావించారు. జిల్లాకు చెందిన సీనియర్ నేతలు జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను త్వరలో కలవాలని నిర్ణయించారు. జానారెడ్డిని కలిపించే బాధ్యతలను కసిరెడ్డి తీసుకున్నారు.
మాకేంటి.. అసంతృప్తుల సూటి ప్రశ్న..?
కొండమడుగులో బీఆర్‌ఎస్ సమావేశం
ఆలేరు నియోజకవర్గంలోని కొందరు బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని ఓ రిసార్టులో ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాఽధించే క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆమె ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. పార్టీలో ఉండి అసమ్మతి పేరుతో నష్టం చేసేవారు పద్ధతి మార్చుకోవాలని లేదంటే తప్పుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
కొత్త, పాత నాయకులంటూ తేడాలు లేకుండా విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు. వంద మంది ఓటర్ల బాధ్యత ఒక్కరు తీసుకుని పక్కాగా పనిచేయాలని నిర్ణయించారు. రానున్న 40 రోజులు అత్యంత ముఖ్యమైన సమయం కనుక ఎవరూ ఊరు విడిచి వెళ్లొద్దని సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులకు సూచించారు. కొందరు పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా చర్చిస్తున్నారని అలాంటి వారిని గుర్తించి సరిచేయాలని ఆదేశించారు.
ఆలేరు కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అసంతృప్తి..
ఆలేరు నియోజకవర్గంలో సైతం అసంతృప్తులు కొనసాగుతున్నాయి. పీసీసీ కార్యదర్శి బీర్ల అయిలయ్య నియోజవకర్గంలో తనకు టికెట్ వస్తుందన్న ధీమాతో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే మిగతా నేతలు ఎవరూ ఆయనతో కలిసి రావడంలేదు.
టికెట్ ఆశిస్తున్న నేతలు ఎవరికి వారే టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నగేష్ ఢిల్లీలో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లి వచ్చారు. అయితే కొందరు నేతలను బుజ్జగించేందుకు అయిలయ్య ప్రయత్నిస్తున్నా సఫలం కావడం లేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment