యాదాద్రి: అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కాబోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం ఓటర్లలో 18 ఏళ్ల నుంచి 39 వారే సగానికంటే ఎక్కువమంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల భవిత ఈ యువ ఓటర్లపైనే ఆధారపడి ఉంది. దీంతో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారి నుంచి మొదలుకొని 39 ఏళ్లలోపు ఉన్న వారిపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను వారే ప్రభావితం చేయనుండడంతో వారిని ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. 40 ఏళ్ల పైబడిన వారు ఎలాగూ ఓ కచ్చితమైన అభిప్రాయంతో ఉంటారనే అంచనాతో 40 ఏళ్లకంటే తక్కువ వయస్సు ఉన్న వారిపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టాయి.
జిల్లాల వారీగా యూత్ ఓట్లు ఇలా..
నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తం 14,26,480 మంది ఓటర్లు ఉన్నారు. అందులో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న 18–19 ఏళ్ల వారు 48,909 మంది ఉండగా, 20 నుంచి 29 ఏళ్ల వారు 2,91,768 మంది ఉన్నారు. అంటే 29 ఏళ్లలోపు ఉన్న ఓటర్లే జిల్లాలో 3,40,677 మంది (23.89 శాతం) ఉన్నారు. ఇక 30 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 4,10,842 మంది ఉన్నారు. ఈ రెండు కేటగిరీలు కలిపితే 7,51,519 మంది (52.69 శాతం) ఓటర్లు వీరే ఉన్నారు.
సూర్యాపేట జిల్లాలో 9,63,701 మంది ఓటర్లు ఉండగా.. 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్లు 4,89,118 మంది ఉన్నారు. జిల్లా ఓటర్లలో 50.75 శాతం వీరే ఉన్నారు.
యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4,39,100 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18 నుంచి 29 ఏళ్ల లోపు ఓటర్లు 1,02,159 మంది ఉన్నారు. వీరిలో కొత్త ఓటర్లు 14,512 మంది ఉన్నారు. 30 నుంచి 39 ఏళ్లలోపు వారు 1,22,738 మంది ఉన్నారు. జిల్లాలో 39 ఏళ్లలోపు వారు మొత్తం 2,24,897 (51.21 శాతం) మంది ఉన్నారు.
బీఆర్‌ఎస్.. వంద మందికి ఒక ఇన్‌చార్జి
క్షేత్రస్థాయిలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నిత్యం వారికి అందుబాటులో ఉండేందుకు బీఆర్‌ఎస్ ఇప్పటికే ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని క్షేత్రస్థాయిలోకి పంపించింది. ముఖ్యంగా వారు కొత్త ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించి తమవైపు తిప్పుకునే కార్యాచరణను అమలు చేస్తున్నారు.
నిరుద్యోగులను ఆకర్షించేలా..
ఉద్యోగాలు రాక, వచ్చినా నోటిఫికేషన్లు వాయిదా పడి తీవ్ర నిరాశలో ఉన్న నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ అడుగులు వేస్తున్నాయి. నియోజవర్గాల్లో తమ టికెట్ కన్‌ఫర్మ్ అనుకున్న అభ్యర్థులు వారిపై ప్రత్యేక దృష్టి సారించేలా తమ బృందాలను రంగంలోకి దింపారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment