14 ఏళ్ల తర్వాత సొంత గూటికి వెళ్తున్న జిట్టా బాలకృష్ణారెడ్డి | - | Sakshi
Sakshi News home page

14 ఏళ్ల తర్వాత సొంత గూటికి వెళ్తున్న జిట్టా బాలకృష్ణారెడ్డి

Published Fri, Oct 20 2023 2:04 AM | Last Updated on Fri, Oct 20 2023 8:59 AM

- - Sakshi

యాదాద్రి: తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జిట్టా.. ఆ పార్టీ నుంచి భువనగిరి టికెట్‌ ఆశించారు. కాంగ్రెస్‌ టికెట్‌ రాదని తేలిపోవడంతో కొంత కాలంగా మౌనంగా ఉన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరుతారని కొద్ది రోజులుగా సాగుతున్నప్రచారానికి తెరదించుతూ గురువారం ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులతో చర్చలు జరిపారు. పార్టీలోకి వారు ఆహ్వానించడంతో శుక్రవారం ఆయన బీఆర్‌ఎస్‌ కండువా వేసుకోనున్నారు.

ఉద్యమంలో కేసీఆర్‌ వెంట..
జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ వెంట నడిచారు. టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉద్యమంలో ముందుండి పనిచేసి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడయ్యారు. అప్పట్లో భువనగిరి జూనియర్‌ కళాశాల మైదానంలో తెలంగాణ వంటలు, కళలు, కళారూపాలను పరిచయం చేశారు.

భువనగిరి కోటను విద్యుత్‌ దీపాలతో అలంకరించి సంచలనం సృష్టించారు. తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచే యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి గుర్తింపు పొందారు జిట్టా బాలకృష్ణారెడ్డి.

భువనగిరి టికెట్‌ రాలేదని..
2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి భువనగిరి ఎమ్మెల్యే టికెట్‌ రాలేదని ఆగ్రహించిన జిట్టా.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట క్రమంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ.. టీడీపీతో పొత్తుపెట్టుకోవడంతో భువనగిరిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎలిమినేటి ఉమామాధవరెడ్డి టీడీపీ నుంచి మహా కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో జిట్టా బాలకృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రెండవ స్థానంతో సరిపెట్టుకున్నారు.

అనంతరం ఆయన దివంగత నేత వైఎస్సార్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్సార్‌ మరణం తర్వాత కాంగ్రెస్‌ను వీడారు. 2014లో భువనగిరి అసెంబ్లీకి ఇండిపెండెంట్‌గా పోటీచేసి అప్పుడు కూడా రెండో స్థానంలోనే నిలిచారు. వైఎస్సార్‌సీపీలో చేరి కొంత కాలం పనిచేసిన అనతరం యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. 2018లో మరోసారి బీజేపీ బలపర్చిన అభ్యర్థిగా యువతెలంగాణ పార్టీ నుంచి భువనగిరి అసెంబ్లీ సీటుకు పోటీ చేసినా గెలుపు అందుకోలేకపోయారు.

ఆ తర్వాత యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుని హోదాలో జిట్టా బాలకృష్ణారెడ్డి 2022 ఫిబ్రవరిలో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని పార్టీని డిమాండ్‌ చేయడంతో జిట్టాపై క్రమశిక్షణా చర్యల కింద బీజేపీ నుంచి సస్పెండ్‌ చేశారు.

నెలక్రితం కాంగ్రెస్‌లో చేరిక
భువనగిరి అసెంబ్లీ టికెట్‌ లక్ష్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సమక్షంలో సెప్టెంబర్‌ 16న జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడిన తర్వాత జిట్టా కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అసెంబ్లీ టికెట్‌ కోసం పార్టీ పెద్దల నుంచి కూడా ఆశీస్సులు పొందారు. అయితే, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి రావడంతో బాలకృష్ణారెడ్డి స్తబ్దుగా ఉన్నారు.

కేటీఆర్‌, హరీష్‌రావుతో చర్చలు
మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులతో గురువారం జిట్టా భేటీ అయ్యారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి సమక్షంలో మంత్రులు జిట్టాతో చర్చలు జరిపారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని మంత్రులు కోరారు. రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇవ్వడంతో తన అనుచరులతో కలిసి శుక్రవారం పార్టీలో చేరుతున్నానని జిట్టా ‘సాక్షి’తో చెప్పారు. 14 ఏళ్ల క్రితం వీడిన పార్టీలోకి తాను ఇప్పుడు అడుగుపెడుతున్నానని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement