Vemula Viresham
-
అడవి నుంచి అసెంబ్లీ దాకా..
నకిరేకల్ : అడవిబాట పట్టి ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి నకిరేకల్ నియోజకవర్గం నుంచి 2014 ఎమ్మెల్యేగా గెలిచారు వేముల వీరేశం. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఈ ఎన్నికల్లో నకిరేకల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. కుటుంబ నేపథ్యం.. తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన వేముల వీరేశం సీపీఐ(ఎంఎల్) నేత యానాల మల్లారెడ్డి స్ఫూర్తితో ప్రగతిశీల ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగారు. తర్వాత సీపీఐ(ఎంఎల్) జనశక్తి విప్లవ ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. 2004లో ప్రభుత్వ చర్చల సమయంలో జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న వేముల వీరేశం 2005 ఆగస్టులో విజయవాడలో అరెస్టయి కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం వీరేశంపై పోలీసులు అక్రమ కేసులు మోపే ప్రయత్నం చేయగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2007లో సీపీఐ(ఎంఎల్) జనశక్తి రాష్ట్ర కార్యదర్శి అమర్ అరెస్టు అనంతరం ఆయన బాధ్యతలను వేముల వీరేశం చేపట్టారు. అప్పటి నుంచి 2009 జూలై వరకు వీరేశం అజ్ఞాతంలోనే ఉన్నారు. 2009లో టీఆర్ఎస్లో చేరిక.. పోలీసుల నుంచి విముక్తి పొందిన వేముల వీరేశం నకిరేకల్‌లో ఉంటూ కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూనే 2009లో గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆశీస్సులతో టీఆర్ఎస్లో చేరారు. 2013లో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం నాటి సీమాంధ్ర పాలకులు ప్రజా ఉద్యమంపై ఉక్కపాదం మోపి వేముల వీరేశాన్ని ఎన్కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం చేశారు. సుదీర్ఘ కాలంగా విద్యార్థి, విప్లవ ఉద్యమంలో వీరేశం పనిచేసిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలతో సత్సంబంధాలు పెట్టుకొని క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వ్యవస్థ మారాలని, ప్రజల సమస్యలు తీరాలనే లక్ష్యంతో ఉద్యమాలు నడిపారు. అజ్ఞాతంలో ఉన్న వీరేశంను 2009 జూలై 2వ తేదీన హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారు. వీరేశానికి కూతురు, కుమారుడు ఉన్నారు. వీరేశం భార్య పుష్ప కూడా కళాకారురాలిగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రతినిధిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో విజయం తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికల్లో నకిరేకల్ నుంచి టీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న వేముల వీరేశం కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై విజయం సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. -
TS Elections 2023: సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అధికార బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు చల్లారడం లేదు. ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి బుజ్జగిస్తున్నా ససేమిరా అంటున్నారే తప్ప.. కలిసి రావడం లేదు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగులకు టికెట్ ఇస్తామని ప్రకటించిన నాటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అభ్యర్థుల ప్రకటన తరువాత కూడా తమ అసంతృప్తిని బయట పెడుతూనే ఉన్నారు. అంతేకాదు బీఫాం ఇచ్చేనాటికి పరిస్థితుల్లో మార్పు రావొచ్చన్న ఆలోచనలతో తమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. దానికితోడు మార్పులకు అవకాశం ఉందంటూ ప్రచారం కూడా సాగుతోంది. దీంతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు నెలకొంది. అధిష్టానం పక్కాగా తమకే టికెట్ ఇస్తుందా? ఏదైనా మార్పులు చేస్తుందా అని లోలోపల ఆందోళన చెందుతున్నారు. చల్లారని అసమ్మతి ఎన్నికల షెడ్యుల్ రాకముందే సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అంతా వెళి్ల్ నియోజకవర్గాల్లో పనులు చేసుకోవాలని సూచించారు. అంతవరకు బాగానే ఉన్నా నియోజకవర్గాల్లో ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తూ ఈసారైనా తమకు టికెట్ ఇవ్వకపోతారా? అని ఎదురుచూసిన వారికి సీఎం ప్రకటనతో మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది. అయినా నోటిఫికేషన్ వచ్చి, నామినేషన్లకు బీఫాం ఇచ్చే వరకు ఏమైనా జరగొచ్చనే ఆలోచనలతో కొన్ని నియోజకవర్గాల్లో తమ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మరికొందరైతే అభ్యర్థులను మార్చకపోతే తాము సహకరించబోమంటూ తెగేసి చెబుతున్నారు. ఎమ్మెల్యేలే స్వయంగా అసంతృప్తి నేతల ఇళ్లకు వెళ్లి బుజ్జగిస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. మరి కొన్నిచోట్ల ఆశావహులు బహిరంగంగానే పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సర్వే గుబులు ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నారని, దాని ఆధారంగానే భవిష్యత్‌లో బీఫాంను కూడా గెలిచే వారికే ఇస్తారన్న చర్చ సాగుతోంది. దీంతో అంసతృప్తులు ఉన్న నియోజకవర్గాల్లోని సిట్టింగుల్లో గుబులు మొదలైంది. ఏం జరుగబోతుందో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. చివరి క్షణంలో ఏమైనా మార్పులు చేస్తే తమ పరిస్థితి ఏంటన్న గందరగోళంలో పడ్డారు. వివిధ నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా.. ► నాగార్జునసాగర్‌లోనూ అంసతృప్తి అలాగే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా.. టికెట్ ఆశిస్తున్న మన్నెం రంజిత్ యాదవ్‌కు మద్దతుగా పార్టీ శ్రేణులు సమావేశాలను కొనసాగిస్తున్నారు. నాగార్జున సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని స్థానిక బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లో, నాయకుల్లో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. తమ మద్దతు ఉన్న అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని పైరవీలు నడుపుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ అసమ్మతి సెగలు అధిష్ఠానానికి తలనొప్పిగా తయారయ్యాయి. ► నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమని చెబుతున్నారు. తనకు అవకాశం ఇస్తారని ఆశించినా, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పేరునే కేసీఆర్ ఖరారు చేశారు. ► దేవరకొండ నియోజకవర్గంలోనూ అసంతృప్తి చల్లారలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేను స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ► కోదాడలోనూ అదే పరిస్థితి నెలకొంది. అక్కడ బీఆర్ఎస్ నాయకుడు శశిధర్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే చందర్రావు ఇంటికి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వెళ్లినా కలిసేందుకు నిరాకరించారు. ► నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన ప్రయత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు. బీఆర్ఎస్ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. -
కాంగ్రెస్‌లోకి వేముల వీరేశం?
సాక్షి, నల్గొండ జిల్లా: జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ సీనియర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నకిరేకల్‌కు చెందిన తన అనుచరులు, నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరనున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మొన్నటి వరకు వీరేశం చేరికను కోమటిరెడ్డి వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడంపై అవమానించడమే అవుతుందని, సునీల్ కనుగోలు(ఎన్నికల వ్యూహకర్త) చెబితే చేర్చుకోవడమేనా? అంటూ కోమటిరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో వీరేశం చేరికపైనే కోమటిరెడ్డి నియోజకవర్గంలోని తన అనుచరులతో చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా, టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. నకిరేకల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఎన్ని బాధలు పెట్టినా భరించా.. అయినా ఇంకా భరిస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలా’’ అంటూ తన అనుచరులు ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు షాక్
సాక్షి, నల్గొండ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చిట్యాలలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు షాక్ తగిలింది. సొంత పార్టీ నేతలే లింగయ్య వర్గానికి వ్యతిరేకంగా రెబల్స్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నకిరేకల్ నుంచి గెలుపొందిన చిరుమర్తి లింగయ్య అనంతర రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. అయితే, ఆయన చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులు రెబల్స్‌గా గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులతో వేముల వర్గం టీఆర్ఎస్ నేతలు భేటీ అయినట్టు సమాచారం ఎమ్మెల్యే చిరుమర్తి వర్గానికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఇటు టీఆర్ఎస్ రెబల్స్, అటు కాంగ్రెస్ నేతలు చేతులు కలిపినట్టు సమాచారం. -
వీరేశం లక్ష మెజారిటీతో గెలవడం ఖాయం
సాక్షి, నకిరేకల్ : నకిరేకల్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వేముల వీరేశం లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని అపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నకిరేకల్ మినీ స్టేడియంలో ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం గెలుపు కోరుతూ బుధవారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘నకిరేకల్ మినీస్టేడియంలో ఉన్న జనా న్ని, హెలిక్యాప్టర్‌లో వస్తూనే చూశాను.. స్టేడియం అం తా జనంతో నిండింది. రోడ్లమీద మరో 10వేల మందికిపైగా నిలబడి ఉన్నారు. ఈ జనసంద్రాన్ని చూస్తేనే వీరే శం గెలుపు ఖాయం’అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయితే భువనగిరి బస్వాపురం రిజర్వాయర్ నుంచి వచ్చే నీటితో మూసీపై ఆనకట్ట నిర్మిస్తే నకిరేకల్ నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు. అయిటిపాముల లిఫ్ట్‌కు ప్రత్యేకంగా రూ.111కోట్లతో మంజూరు చేశామన్నారు. మళ్లీ వీరేశాన్ని గెలిపిస్తే మిగిలిన పనులను పూర్తి చేయిస్తానని హామీనిచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే వీరేశానికి పెద్దపదవి.. నకిరేకల్ నుంచి ఎమ్మెల్యేగా వేముల వీరేశాన్ని మళ్లీ గెలిపిస్తే ఇప్పుడు ఇంకా పెద్ద పదవి కూడా ఇస్తామని స్పష్టంచేశారు. ఆ కల నెరవేరాలంటే కారు గుర్తుకు ఓటు వేసి లక్ష మెజారిటీతో గెలిపించాని హాజరైన ప్రజలతో శపథం చేయించారు. భవిష్యత్తు బాగుండాలంటే వీరేశం గెలవాలి నకిరేకల్ నియోజకవర్గం భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ వేముల వీరేశాన్ని గెలిపించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలు లబ్ధిపొందుతున్న ప్రజలంతా టీఆర్ఎస్కు ఓటు వేస్తే మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. కాంగ్రెస్ ఒంటరిగా గెలువలేక కూటమి పేరుతో ఆంధ్రాపార్టీని కలుపుకుందని ఎద్దేవా చేశారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో నకిరేకల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన వీరేశాన్ని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ను గెలపించాలి.. నకిరేకల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి ఇప్పటికే రూ.2800కోట్లు మంజూరు చేయించానని.. ఈ అభివృద్ధి పనులు కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్కు ఓటు వేసి తనను గెలిపించాలని నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం కోరారు. డిసెంబర్ 7న తమ ఓటు వేసి మహాకూటమి అభ్యర్థి డిపాజిట్ గల్లంతయ్యేలా తీర్పునివ్వాలని కోరారు. వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎంపీ కేశవరావు, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, పూజర్ల శంభయ్య, ఎమ్మెల్సీ పూల రవీందర్, నియోజకవర్గ పరిశీలకుడు లింగంపల్లి కిషన్‌రావు, ప్రముఖ డాక్టర్లు రాపోలు రఘునందన్, మోహన్‌రెడ్డి, రాష్ట్ర నేతలు కటికం సత్తయ్యగౌడ్, చాడ కిషన్‌రెడ్డి, జెల్ల మార్కెండేయులు, శరణ్యరెడ్డి, నకిరేకల్, చిట్యాల మార్కెట్ చైర్మన్లు మారం భిక్షంరెడ్డి, కాటం వెంకటేశం, వైస్ చైర్మన్ వీర్లపాటి రమేష్, నాయకులు పల్రెడ్డి నర్సింహారెడ్డి, గాదగోని కొండయ్య, బొజ్జ సుందర్, కొండ వెంకన్నగౌడ్, సోమా యాదగిరి, యానాల లింగారెడ్డి, కొండ శ్రీను, మందడి వెంకటరామిరెడ్డి, భరత్‌కుమార్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, గుత్త మంజుల, కొండ లింగస్వామి, పెండెం ధనలక్ష్మి సదానందం, సామ బాలమ్మ, రాజు, సైదారెడ్డి, రమేష్, నరేందర్, పెండెం సంతోష్ తదితరులు ఉన్నారు. -
ప్రణయ్ హత్య వెనుక పలువురు ప్రముఖులు!
సాక్షి, మిర్యాలగూడ : పెరుమాళ్ల ప్రణయ్ హత్య వెనుక తన తండ్రి తిరునగరు మారుతీరావు, బాబాయి శ్రవణ్‌కుమార్‌తో పాటు ఓ తాజా మాజీ ఎమ్మెల్యే, పలువురి ప్రముఖుల హస్తం ఉందని ఆయన భార్య అమృత అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య వెనుక టీఆర్ఎస్ నాయకుడు, న్యాయవాది భరత్‌కుమార్, నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీం, వ్యాపారస్తులు రంగా శ్రీకర్, రంగా రంజిత్ కూడా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. తమను విడగొట్టేందుకు వేముల వీరేశం, భరత్, గూడూరు శ్రీను గతంలో ప్రణయ్‌ను, తనను బెదిరించారని అమృత ఆరోపించారు. ఎల్ఐసీ డబ్బులు కట్టలేదని గతంలో ప్రణయ్ నాన్నపై తప్పుడు కేసు పెట్టారని, ఈ విషయంలో తాము ఐజీ దగ్గరికి కూడా వెళ్లామని పేర్కొన్నారు. బిహార్ గ్యాంగ్‌తో తమను బెదిరింపులకు గురిచేశారని తెలిపారు. ప్రణయ్ హత్యలో ఎంతమంది ఉన్నారో, వారినీ దారుణంగా చంపాలని అమృత డిమాండ్ చేశారు. ఇక.. తనకు అత్తా,మామలే తల్లిదండ్రులని, వీళ్ల దగ్గరే ఉంటానని తెలిపారు. -
టీడీపీకి మాట్లాడే హక్కు లేదు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గువ్వల బాలరాజు సాక్షి, హైదరాబాద్: బషీర్‌బాగ్ లో రైతులను పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపిన టీడీపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గువ్వల బాలరాజు మండి పడ్డారు. ఆ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో వారిద్దరూ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును దేశమంతా ప్రశంసిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై కన్నా చంద్రబాబు యావే రేవంత్ రెడ్డిలో ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు. రేవంత్ తెలంగాణ అసెంబ్లీలో బాబు భజన చేస్తామంటే ఎలా ఒçప్పుకుంటామని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణకు రేవంత్ ద్రోహం చేస్తున్నాడని వారు దుయ్యబట్టారు.