కొలిక్కి వచ్చిన ఎంపీ అభ్యర్థిత్వం
బీసీ కోటాలో దక్కనున్న అవకాశం
ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్న బీఆర్‌ఎస్ అధిష్టానం
సాక్షి, యాదాద్రి : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న భువనగిరి, నల్లగొండ స్థానాలను బీసీ, ఓసీలకు కేటాయించాలని బీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో గౌడ సామాజిక వర్గం ఓట్లు ఉన్నందున భువనగిరి సీటును అదే సామాజిక వర్గానికి చెందిన భిక్షమయ్యగౌడ్‌కు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
భిక్షమయ్య వైపు మొగ్గు
భువనగిరికి అభ్యర్థి ఎంపికలో బీఆర్‌ఎస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది. సామాజికవర్గాల వారీగా పలువురు నేతల పేర్లను పరిశీలించింది. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌న్‌రెడ్డి, ఆయన తనయుడు ప్రశాంత్‌రెడ్డి, జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నకిరేకల్‌కు చెందిన డాక్టర్ చెరుకు సుధాకర్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ పేర్లు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. అయితే పైళ్ల శేఖర్‌రెడ్డి పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదని తెలిసింది. అలాగే డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అధిష్టానం ఆదేశిస్తే పోటీలో ఉంటానని ప్రకటించారు. వీరితో పాటు తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పేరు కూడా పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment