సాక్షి, యాదాద్రి : డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీని వీడి సొంత గూటికి చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని కుంభం ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే టికెట్‌ను కుంభం ఆశిస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్‌లో చేరిన కుంభం తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, పీసీసీ పెద్దలు పలువురి నుంచి పార్టీలో చేరాలని ఆహ్వానం వచ్చింది.
జూలై 24న బీఆర్‌ఎస్‌లోకి..
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో విభేదాల కారణంగా గత జూలై 24న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కుంభం బీఆర్‌ఎస్‌లో చేరికతో కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో ఒక కుదుపునకు లోనయ్యింది. ఏఐసీసీ నేత ప్రియాంకగాంధీ, పీసీసీ చేపట్టిన సర్వేల్లో పలువురు ఆశావహుల కంటే కుంభంకు విశేష స్పందన రావడంతో ఆయనను తిరిగి రప్పించేందుక కాంగ్రెస్ ప్రయత్నాలు చేపట్టి సఫలమైంది.
బీఆర్‌ఎస్‌కు తప్పని గట్టి పోటీ
కాంగ్రెస్ నుంచి పోటీదారుగా భావిస్తున్న కుంభం ఆ పార్టీని వీడి తమ పార్టీలో చేరడంతో బీఆర్‌ఎస్ రిలాక్స్ అయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సైతం తనకు పోటీగా బలమైన అభ్యర్థి లేకుండా పోయారని భావించారు. తిరిగి కుంభం సొంత గూటికి చేరడంతో పైళ్లకు గట్టిపోటీ తప్పని పరిస్థితి నెలకొంది.
టికెట్ల ప్రకటన రోజునుంచే..
సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకే సీట్లు ప్రకటించిన రోజునుంచే కుంభం మౌనం దాల్చారు. అయితే సూర్యాపేట సభకు సీఎం కేసీఆర్ కుంభంను తన చాపర్‌లో వెంట బెట్టుకుని పోయారు. ఆ రోజునే భువనగిరి టికెట్ తనకు ఇవ్వాలని సీఎంను కోరినట్లు సమాచారం. అయితే కేసీఆర్ ప్రకటించిన సిట్టింగ్ సీట్లలో భువనగిరి కూడా ఉండడంతో కుంభం తీవ్ర నిరాశకు గురయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తారని కేసీఆర్ హామీ ఇచ్చారని కుంభం అప్పట్లో విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
బీసీలకు టికెట్ హుళక్కేనా!
బీసీలకే టికెట్ అని సాగుతున్న నినాదం హుళక్కేనా అని ఒకవర్గం చర్చిస్తోంది. కర్ణాటక ఫార్ములా ప్రకారం లోక్‌సభ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయంగా ఉంది. అయితే భువనగిరి అసెంబ్లీ సీటు బీసీలకు అని ప్రచారం జరగడంతోపాటు కొందరు బీసీ నాయకులు టికెట్ల కోసం పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పుడు కుంభం చేరికతో భువనగిరి టికెట్ ఆయనకే ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి పీసీసీ ప్రతిపాదించే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకుడొకరు ‘సాక్షి’తో చెప్పారు.
కుంభం ఇంటికి భారీగా అనుచరులు
కుంభం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడన్న సమాచారంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి అనుచరులు భారీగా చేరుకున్నారు. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజు, పచ్చాల జగన్, ఎల్లంల శాలిని జంగయ్యయాదవ్, ఏర్పుల శ్రీను, గడ్డమీది వీరస్వామిగౌడ్‌తో పాటుగా సుమారు 500 కార్యకర్తలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇంటికే పరిమితం కాలేక
డీసీసీ అధ్యక్షుడి హోదాలో బీఆర్‌ఎస్‌లో చేరిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీలో ఇమడలేకపోయారు. పదేళ్లుగా ప్రజల మధ్యన ఉన్న ఆయన బీఆర్‌ఎస్‌లో చేరి ఇంటికే పరిమితం అయ్యారు. దీనికితోడు ప్రొటోకాల్ ప్రకారం తనకు పదవి కావాలని పార్టీ అధినేతను కోరారు. ప్రస్తుత ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి జోడెడ్లలా పనిచేయాలని, భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయని కేసీఆర్ ప్రటించిన విషయం తెలిసిందే. రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన కుంభం కాంగ్రెస్‌లోని తన వర్గీయులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment