ముంబై: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు గత ఐదేళ్లో 164 శాతం పెరిగినట్లు వారు సమర్పించిన అఫిడవిట్ల ద్వారా వెల్లడైంది. మరోసారి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 216 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను రెండు స్వచ్ఛంద సంస్థలు అధ్యయనం చేసి ఈ వివరాలు వెల్లడించాయి. ఈ ఎమ్మెల్యేల ఆస్తులు 2009లో సగటు రూ.4.97 కోట్లు ఉండగా, అవి ఈ ఏడాదికి రూ.13.15 కోట్లకు పెరిగినట్లు వారి అఫిడవిట్లను విశ్లేషించిన ఆ సంస్థలు తెలిపాయి. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), మహారాష్ట్ర ఎలక్షన్ వాచ్ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ అధ్యయనం జరిపాయి.
ఒక్కో అభ్యర్థి ఆస్తులు సగటున రూ.8.17 కోట్లు లేదా 164 శాతం మేరకు పెరిగినట్లు ఆ అధ్యయనం వెల్లడించింది. ఆస్తుల పెరుగుదలలో మలబార్ హిల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ అభ్యర్థి మంగళ్ ప్రభాత్ లోధా మొదటి స్థానంలో ఉన్నారు. ఈ ఐదేళ్లలో ఆయన ఆస్తి 129.97 కోట్లకు పెరిగింది. 2009లో లోధా ఆస్తుల విలువ రూ.68.64 కోట్లు కాగా అవి ఈ ఏడాదికి రూ.198.61 కోట్లకు పెరిగాయి. జల్గావ్ సిటీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శివసేన అభ్యర్థి సురేష్ కుమార్ భికమ్‌చంద్ జైన్ ఆస్తులు ఐదేళ్లలో వందకోట్లు పెరిగాయి. ఐదేళ్ల క్రితం ఆయన ఆస్తుల రూ.82.82 కోట్లు కాగా, ఇప్పుడు అవి రూ.182.84 కోట్లు.
కాండీవలి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ సింగ్ రామ్‌నారాయణ్ ఠాకూర్ ఆస్తులు రూ.22.22 నుంచి రూ.81.63 కోట్లు అనగా రూ.59.40 కోట్లు పెరిగాయి. కాంగ్రెస్ నుంచి తిరిగి పోటీ చేస్తున్న 62 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 184 శాతం పెరిగినట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఎన్సీపీకి చెందిన 51 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 176 శాతం పెరిగాయి. బీజేపీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలు తమ ఆస్తులు సగటున 198 శాతం పెరిగినట్లు తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఎమ్మెన్నెస్‌కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల ఆస్తులు 294 శాతం పెరగగా, ఎనిమిది మంది ఇండిపెండెంట్ సభ్యుల ఆస్తులు 74 శాతం మేరకు పెరిగాయి. శివసేనకు చెందిన 36 మంది శాసనసభ్యుల ఆస్తులు 172 శాతం పెరిగినట్లు వెల్లడైంది.
ఎమ్మెల్యే సీటు చాలా ‘హాటు’
Published Tue, Oct 14 2014 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM
Advertisement
Advertisement