తప్పిన లెక్కతో బిక్కమొహం!
సాక్షి, విశాఖపట్నం: ఏం చేసైనా గెలవాలి... ఏ అభ్యర్థి అయినా ఇలాగే ఆలోచిస్తాడు. కానీ అదే అపరిమిత వ్యయానికి కారణమైంది. ఎన్నికలకు చివరి నాలుగు రోజుల్లో ధన ప్రవాహానికి అంతే లేదు. చాలామంది అభ్యర్థులు భారీగా డబ్బు వెదజల్లారు. నియోజకవర్గంలో ఎక్కడ వెనకబడ్డామో గుర్తించి అక్కడ రెట్టింపు స్థాయిలో ఖర్చు చేశారు. ఫలానా వర్గం ఓటర్లు దూరంగా ఉన్నారని అనుచరులు చెబితే చాలు... వారిని సంతృప్తి పరిచేందుకు నోట్ల కట్టలను మంచినీళ్లప్రాయంగా వెదజల్లారు.
అంచనా తప్పిన వ్యయం
ఒక్కొక్కరు కోట్లలో వ్యయం చేసి ముందుగా అనుకున్న లెక్కలను దాటేశారు. మరికొందరు అభ్యర్థులు విజయం సాధిస్తామనే ధీమాతో మరింత ఎక్కువ ఖర్చు పెట్టారు. ఖర్చుల అంచనాలు తప్పడంతో బయటి మార్గాల ద్వారా సర్దుబాటు నిధులను రప్పించారు. ఇప్పుడు ఫలితాలు రావడంతో గెలిచిన, ఓడిన అభ్యర్థులు వ్యయంపై లెక్కలేసుకుంటున్నారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పోలింగ్ రోజు వరకు మొత్తం ఎంత ఖర్చయిందో తెలుసుకుంటున్నారు. చాలామంది అభ్యర్థులు శనివారం తమ అనుచరులు, బంధువులతో సమావేశాలు నిర్వహించారు. చాలాచోట్ల డబ్బు దారిమళ్లి ఓటర్లకు చేరలేదని తెలిసి పంచాయతీలు ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతంలో మండలాల వారీగా జరిగిన వ్యయంపై స్పష్టత కోసం కొందరు అభ్యర్థులు ఇళ్లల్లోనే అంతర్గత సమావేశాలు నిర్వహించారు. నగర పరిధిలోని అభ్యర్థులు డివిజన్ల వారీగా జరిగిన వ్యయం, మిగిలిన సొమ్ముపై వివరాలు రాబడుతున్నారు.
ఆనందం కన్నా ఆవేదనే ఎక్కువ
2009 ఎన్నికల్లో రూ.3 కోట్ల వరకు ఖర్చుచేస్తే... ఇప్పుడు రూ.8 కోట్లు దాటిపోయిందని గెలిచిన ఓ అభ్యర్థి అనుచరుడు వ్యాఖ్యానించాడు. వాస్తవానికి విజేతల్లో చాలామంది విజయం సాధించామన్న ఆనందం కంటే రెట్టింపైన వ్యయాన్ని తల్చుకుని నీరుగారిపోతున్నారు.
విశాఖ నగరాన్ని ఆనుకుని ఓ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తనకున్న రెండెకరాల పొలాన్ని విక్రయించి ఎన్నికల ఖర్చుకు పెట్టారు. ఇప్పుడు విజయం సాధించినా ఖర్చయిన మొత్తాన్ని చూసుకుని నెత్తీనోరూ బాదుకుంటున్నారు. ఎమ్మెల్యేగా అయిదేళ్లు ఎంత కష్టపడ్డా తిరిగి అంత రాబట్టుకోవడం సాధ్యమేనా? అని బావురుమంటున్నారు.