గంగామాత పిలుపుతోనే.. | gangamata ..call me i am coming for you : modi | Sakshi
Sakshi News home page

గంగామాత పిలుపుతోనే..

Published Fri, Apr 25 2014 2:00 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

గంగామాత పిలుపుతోనే.. - Sakshi

గంగామాత పిలుపుతోనే..

కాశీలో పోటీచేస్తున్నా: మోడీ
అట్టహాసంగా నామినేషన్ దాఖలు
కాషాయమయమైన వారణాసి వీధులు
 

వారణాసి/న్యూఢిల్లీ: వేలాది మంది మోడీ, మోడీ అని నినదిస్తూ అనుసరించిరాగా.. వారణాసి లోక్‌సభ స్థానానికి బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన మూడు కిలోమీటర్లు రోడ్‌షో నిర్వహించారు. వేలాది మంది అభిమానులు ఆయనకు మద్దతు తెలపడానికి రావడంతో ఆ మూడు కిలోమీటర్ల రోడ్‌షోకు మూడు గంటల సమయం పట్టింది. కాషాయ వస్త్రధారులైన కార్యకర్తలు, అభిమానులతో కాశీ వీధులు కిక్కిరిసిపోయాయి. ఓపెన్ టాప్ ట్రక్‌లో అభిమానులకు అభివాదం చేస్తూ మోడీ ముందుకుసాగారు. కొన్ని ప్రాంతాల్లో ఆయనకు మైనార్టీలు కూడా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నన్నెవరో పంపితేనో, నా అంతట నేనో ఇక్కడికి రాలేదని అనుకుంటున్నాను. గంగామాత పిలవడం వల్లే ఇక్కడికి వచ్చాను. తల్లి ఒడిలో చిన్న పిల్లాడి అనుభవం కలుగుతోంది. ఈ పట్టణానికి సేవ చేయడానికి శక్తినివ్వమని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని చెప్పారు.
 
గంగానదిని ప్రక్షాళన చేస్తా..: రోడ్‌షోకు ముందు బనారస్ హిందూ యూనివర్సిటీని సందర్శించి అక్కడ మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి మోడీ నివాళులు అర్పించారు. తర్వాత విలేకరులతో మాట్లాడిన ఆయన.. గంగానదిని ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. అనంతరం వారణాసిలో ప్రజలు చూపిన అభిమానాన్ని మాటల్లో వర్ణించలేనిదని ట్వీట్ చేశారు. పురాతన ఆధ్యాత్మిక నగరమైన కాశీని ప్రపంచ ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని తన వెబ్‌సైట్లో పేర్కొన్నారు. దేవుడే పంపాడు..: ‘‘కొన్ని క్లిష్టమైన పనులు నెరవేర్చడానికి కొంతమందిని దేవుడు ఎన్నుకుంటాడు. క్లిష్టమైన పనులు పూర్తి చేసేవాడిని దేవుడు మెచ్చుకుంటాడు. నన్ను దేవుడు అందుకే ఎన్నుకున్నాడని అనుకుంటున్నాను. నాకు మీ ఆశీర్వచనాలు ఇస్తే క్లిష్టమైన పనుల్ని సున్నితంగా పూర్తి చేస్తాను’’ అని త్రీడీ టెలికాస్ట్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడుతూ చెప్పారు.
 
తందూరీ పొయ్యి సంగతి ఏంటి..: మహిళా సాధికారతపై తనను ఉద్దేశించి కాంగ్రెస్ విమర్శలు చేయడంపై ఆ టెలికాస్ట్‌లో మండిపడ్డారు. 1990లో తందూరీ పొయ్యలో మహిళను కాల్చివేసిన కేసులో కాంగ్రెస్ నేత హస్తాన్ని ప్రస్తావించారు. ప్రత్యర్థి పార్టీ నేతలు లాతూర్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్ చేయడంపై ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై నేరాలు అధికంగా ఉన్నాయని చెప్పారు.
 
దేవుడే అయితే ఓటింగ్ ఎందుకు..: దేవుడే తనని ఎన్నుకున్నాడని మోడీ చెప్పడంపై కాంగ్రెస్ మండిపడింది. అదే నిజమయితే ఫలితాల కోసం ఎదురుచూడడం ఎందుకని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద శర్మ ప్రశ్నించారు. మోడీ తనకు తానే దేవుడిగా అభివర్ణించుకుంటున్నారని విమర్శించారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఈసీని డిమాండ్ చేశారు. కాగా, వడోదరలో వెల్లడించిన ఆస్తుల కన్నా మోడీ ఆస్తులు రూ. 14. 34 లక్షలు పెరిగాయి. ఎన్నికల ఖర్చు కోసం ఆయనకు పార్టీ నిధులు మళ్లించడం వల్లే ఆస్తుల్లో పెరుగుదల కనిపించిందని బీజేపీ శ్రేణులు చెప్పాయి. ఆయన ఇక్కడ సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులను రూ. 1.65 కోట్లుగా పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement