నీకు నేను.. నాకు నువ్వు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రిజర్వేషన్ల కారణంగా సొంత నియోజవర్గాలకు దూరమైన మాజీ మంత్రులు కళా వెంకటరావు, కోండ్రు మురళీమోహన్‌లు కాకతాళీయంగానే ఒకరి నియోజకవర్గంలో మరొకరు పోటీ చేయాల్సి వస్తోంది. ఇదే అంశం వీరి మధ్య అనైతిక ఒప్పందానికి బాట వేసింది. మూడు దశాబ్దాల క్రితం రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన కళా వెంకట్రావు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
సొంత నియోజకవర్గం రాజాం ఎస్సీలకు రిజర్వు కావడంతో ఆయన ఎచ్చెర్ల నుంచి పోటీ చేయాల్సి వస్తోంది. ఈసారి గెలవడం ద్వారా పూర్వవైభవం సాధించాలన్న ఆయన లక్ష్యం ఆచరణ సాధ్యంగా కనిపించడం లేదు. స్థానికేతరుడైన కళా ఎచ్చెర్లలో పట్టు సాధించలేకపోతున్నారు. ప్రధానంగా నియోజకవర్గ ప్రజలు ఆయన్ను తమ నాయకుడిగా గుర్తించడమే లేదు.
ఎన్నికలు సమీపిస్తున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఆయనలో గుబులు మొదలైంది. మరోవైపు రాజాం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోండ్రు మురళీ పరిస్థితీ అలాగే ఉంది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన ఆయన రాజాం నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు.
2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి చరిష్మాతో గెలిచిన ఆయన పరస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. క్యాడర్ దాదాపుగా జారిపోయింది. వేళ్ల మీద లెక్కించదగ్గ అనుచరులే మిగిలారు. నియోజకవర్గంలోని ఒక్క మండలంలో కూడా ప్రభావం చూపలేని దుస్థితిలో పడిపోయారు. దాంతో జోగీ.. జోగీ రాసుకున్న చందంగా కళా, కోండ్రు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయానికి తెరతీశారు. విశ్వసనీయులైన కొందరు సన్నిహితుల మధ్యవర్తిత్వంతో ఈ మేరకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
పరస్పర సహకారం
ఆ ఒప్పందం ప్రకారం తన సొంత నియోజకవర్గం ఎచ్చెర్లలో కళా వెంకట్రావుకు సహకరించేందుకు కోండ్రు మురళీ సమ్మతిం చారు. ప్రధానంగా లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో మిగిలి ఉన్న కొద్దిమంది కోండ్రు అనుచరులు కళాకు అనుకూలంగా పనిచేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రవికిరణ్ ఉన్నప్పటికీ టీడీపీకే పని చేయాలని తన అనుచరులకు కోండ్రు సంకేతాలు ఇచ్చారు.
నేనున్నానని భరోసా ఇచ్చి మరీ తెచ్చిన రవికిరణ్‌కే వెన్నుపోటు పొడవడానికి సిద్ధమయ్యారని దీనితో అర్థమవుతోంది. దీనికి ప్రతిగా.. రాజాం నియోజకవర్గంలో ఉన్న కళా వెంకట్రావు బంధువర్గం మొత్తం కోండ్రుకు సహకరిస్తుంది. రేగిడి, రాజాం మండలాల్లోని కళా అనుచరగణం పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి మరీ కోం డ్రుకు అనుకూలంగా పని చేస్తుంది.
అంటే రాజాం నియోజకవర్గలో టీడీపీ అభ్యర్థి ప్రతిభా భారతికి వ్యతిరేకంగా పనిచేస్తారన్న మాట. ఈ మేరకు కళా నుంచి స్పష్టమైన సూచనలు పంపారు. ఇప్పటికే కళా వర్గీయులు ప్రతిభా భారతితో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
తాజా మ్యాచ్ పిక్సిం గ్‌తో వారంతా పూర్తిగా ప్రతిభా భారతికి చెయ్యివ్వడం ఖాయమని తేలిపోయింది. జెడ్పీటీసీ ఎన్నికల వరకు ఆమె వెంటే ఉన్న వారంతా ప్రస్తుతం వ్యూహాత్మకంగా తప్పుకుంటున్నారు. ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ప్రభావం కనిపిస్తోంది.
దాంతో ఎచ్చెర్ల కాంగ్రెస్ అభ్యర్థి రవికిరణ్, రాజాం టీడీపీ అభ్యర్థి ప్రతిభా భారతిలకు గుబులు పట్టుకుంది. కళా, కోండ్రు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తమకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు కొత్త కావడంతో రవి కిరణ్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు.
కానీ ప్రతిభా భారతి మాత్రం కళాపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కుమ్మక్కు రాజకీయాలు ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీల్లో వర్గపోరును సరికొత్త మలుపు తిప్పుతున్నాయి.