అవకాశమిస్తే అభివృద్ధిచేసి చూపిస్తా
- ప్రజల కష్టాలు పూర్తిగా తెలిసినవాణ్ని
- పుట్టినగడ్డకు మేలుచేయడమే లక్ష్యం
- ఉద్యోగాలు, ఇళ్లపేరుతో మోసం చేయడం తెలియదు
- తిరుపతి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌రావు
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: ప్రజల కష్టాలు పూర్తిగా తెలిసినవాణ్ని, ఎన్నికల్లో గెలిపించి ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు. తిరుపతిలోని ఓ ప్రరుువేటు హోటల్లో మంగళవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 33సంవత్సరాలుగా అనేక ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేశానని, 1983 నుంచి 2009వరకు కలెక్టర్‌గా పనిచేసి ప్రజల కష్టాలను పూర్తిస్థాయిలో తెలుసుకున్నానని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి వద్ద ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రజల కష్టాలను ఎలా పరిష్కరించాలో కూడా తెలుసుకున్నానన్నారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలోని దాదాపు ఎనిమిది వందల గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు. వెంకటగిరి ప్రాంతంలో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అభివృద్ధికి నోచుకోకుండా అనేక కాలనీలు దుర్భరస్థితిలో ఉన్నాయని చెప్పారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే వాటి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తిరుపతి ఎమ్మెల్యేగా కరుణాకరరెడ్డి, ఎంపీగా తనను గెలిపిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.
తిరుపతిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి శుభ్రం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇళ్లున్నా పట్టాలు లేని వారికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పారు. పుట్టినగడ్డకు మేలు చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని సైతం వదులుకున్నానని, ప్రజాసేవ చేయాలనే తపనతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. చింతామోహన్‌లాగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలందరికీ ఇళ్లు ఇప్పిస్తానంటూ ఓట్లు కోసం మోసం చేయడం తనకు తెలియదని వరప్రసాద్ అన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు 30ఏళ్లుగా నమ్మి ఓట్లు వేసినందుకు చింతామోహన్ వారికి ఆవగింజంత అభివృద్ధి కూడా చేయలేదన్నారు. ఎంతసేపూ అంతర్జాతీయ విమానాశ్రయం, వరల్డ్‌క్లాస్ రైల్వే స్టేషన్, మూడు వందల పడకల ఆస్పత్రి, నేషనల్ క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేస్తానని ప్రజలను మోసంచేస్తూనే ఉన్నారని ఆరోపించారు.
ఎంపీ అరుుతే ఎంత అభివృద్ధి చేయగలమనే విషయాన్ని ప్రజలకు తాను చేసి చూపిస్తానని చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి టీడీపీతో పాటు పూర్తి సహకారం అందించిన బీజేపీకి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితే లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌మోహన్‌రె డ్డి అధికారంలోకి రాగానే పేద విద్యార్థులకు ఉన్నత విద్య, ఇల్లు లేనివారికి సొంత ఇల్లు, నిరుద్యోగ యువతకు వడ్డీలేని రుణాలు, పొదుపు సంఘాల్లో మహిళా రుణాల మాఫీ, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఐదు సంతకాలు చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మన్నెం చంద్రశేఖర్ నాయుడు, టీ జనార్ధన్ పాల్గొన్నారు.