
ప్రణబ్‌తో నరసింహన్ భేటీ
కేంద్ర హోంమంత్రి షిండేతో కూడా..
రాష్ట్రపతి పాలన పొడిగింపు, రాష్ట్ర విభజనపై చర్చ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేలతో గవర్నర్ నరసింహన్ గురువారం వేర్వేరుగా భేటీ అయ్యారు. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా రాష్ట్రపతి పాలన కొనసాగింపు, రాష్ట్ర విభజనలో భాగమైన ఆస్తులు, ఉద్యోగుల పంపిణీ, ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితి తదితర అంశాలపై వారితో చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న విభజన కసరత్తును వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పొడిగింపునకు సంబంధించిన అంశంపై కూడా నరసింహన్ చర్చించినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన మొదలై ఈనెల 30కి రెండు నెలలు పూర్తి కానుంది. రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలల్లోగా పార్లమెంట్ ఆమోదం తప్పకుండా తీసుకోవాలి.
ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ను సమావేశపరచి రాష్ట్రపతి పాలనకు ఆమోదముద్ర వేయించాలని ప్రణబ్‌ముఖర్జీ సూచించినట్లు సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంట్‌ను సమావేశపరచడం సాధ్యం కాదని కేంద్రం భావిస్తోంది. లోక్‌సభను రద్దు చేసి, రాజ్యసభను సమావేశపరిచి ఆమోదముద్ర వేయించే ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలిసింది. రాజ్యసభ సభ్యులంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఎగువసభను సమావేశపరచడం కూడా ఇప్పటికిప్పుడు వీలుకాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా, రాష్ట్రపతి పాలనను రద్దు చేసి, మళ్లీ విధించాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ వారంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
ఏపీ భవన్‌లో బ్లాకులను పరిశీలించిన గవర్నర్
గవర్నర్ నరసింహన్ ఏపీ భవన్‌లో బ్లాకులను సందర్శించారు. అన్ని బ్లాక్‌లూ తిరుగుతూ.. భవనాలు, గదులు, శాఖ వారీగా ఉన్న ఉద్యోగుల వివరాలతోపాటు ఇరు రాష్ట్రాలకు భవనా ల కేటాయింపుపై ఇటీవల జరిగిన కసరత్తును అధికారులను అడిగి తెలుసుకున్నారు. తన పర్యటనకు ప్రత్యేకంగా ప్రాధాన్యత లేదని, సాధారణ సందర్శనలో భాగంగానే ఢిల్లీ వచ్చానని విలేకరులు అడిగిన ప్రశ్నలకు గవర్నర్ ఈ సంద ర్భంగా సమాధానం ఇచ్చారు.