susil kumar shinde
-
ప్రణబ్‌తో నరసింహన్ భేటీ
-
ప్రణబ్‌తో నరసింహన్ భేటీ
కేంద్ర హోంమంత్రి షిండేతో కూడా.. రాష్ట్రపతి పాలన పొడిగింపు, రాష్ట్ర విభజనపై చర్చ న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేలతో గవర్నర్ నరసింహన్ గురువారం వేర్వేరుగా భేటీ అయ్యారు. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా రాష్ట్రపతి పాలన కొనసాగింపు, రాష్ట్ర విభజనలో భాగమైన ఆస్తులు, ఉద్యోగుల పంపిణీ, ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితి తదితర అంశాలపై వారితో చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న విభజన కసరత్తును వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పొడిగింపునకు సంబంధించిన అంశంపై కూడా నరసింహన్ చర్చించినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన మొదలై ఈనెల 30కి రెండు నెలలు పూర్తి కానుంది. రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలల్లోగా పార్లమెంట్ ఆమోదం తప్పకుండా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ను సమావేశపరచి రాష్ట్రపతి పాలనకు ఆమోదముద్ర వేయించాలని ప్రణబ్‌ముఖర్జీ సూచించినట్లు సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంట్‌ను సమావేశపరచడం సాధ్యం కాదని కేంద్రం భావిస్తోంది. లోక్‌సభను రద్దు చేసి, రాజ్యసభను సమావేశపరిచి ఆమోదముద్ర వేయించే ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలిసింది. రాజ్యసభ సభ్యులంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఎగువసభను సమావేశపరచడం కూడా ఇప్పటికిప్పుడు వీలుకాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా, రాష్ట్రపతి పాలనను రద్దు చేసి, మళ్లీ విధించాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ వారంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఏపీ భవన్లో బ్లాకులను పరిశీలించిన గవర్నర్ గవర్నర్ నరసింహన్ ఏపీ భవన్లో బ్లాకులను సందర్శించారు. అన్ని బ్లాక్‌లూ తిరుగుతూ.. భవనాలు, గదులు, శాఖ వారీగా ఉన్న ఉద్యోగుల వివరాలతోపాటు ఇరు రాష్ట్రాలకు భవనా ల కేటాయింపుపై ఇటీవల జరిగిన కసరత్తును అధికారులను అడిగి తెలుసుకున్నారు. తన పర్యటనకు ప్రత్యేకంగా ప్రాధాన్యత లేదని, సాధారణ సందర్శనలో భాగంగానే ఢిల్లీ వచ్చానని విలేకరులు అడిగిన ప్రశ్నలకు గవర్నర్ ఈ సంద ర్భంగా సమాధానం ఇచ్చారు. -
టీ జోష్
సాక్షి, ముంబై/బోరివలి/భివండీ, న్యూస్‌లైన్: లోక్‌సభలో మంగళవారం తెలంగాణ బిల్లుకు అమోదం లభించడంతో ముంబైలో నివాసముంటున్న తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదానికి రానుందని ముందే తెలుసుకున్న ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ఒకవైపు ఇరు ప్రాంత ప్రజల మధ్య ఉత్కంఠ, మరోవైపు ఫలితం ఎలా ఉంటుందనే దానిపై ఆందోళన...వీటి మధ్యన ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే బిల్లు ప్రవేశపెట్టగానే ఒక్కసారిగా తెలంగాణ ప్రజలు సంతోషం తట్టుకోలేక కేకలు వేశారు. అనేక మంది తెలంగాణవాదులు సెల్ ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్లతోపాటు సోషల్ మీడియా ద్వారా సందేశాలను పంపుతూ తమ అభిమానాన్ని, ఆనందాన్ని పంచుకున్నారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ ప్రజలు కొంతసేపు తమ పనులు పక్కనబెట్టి సంబరాలు చేసుకున్నారు. నగరంలో తెలుగు ప్రజలు నివాసముండే లోయర్ పరేల్, కామాటిపుర, ప్రభాదేవి, వర్లీ, సైన్ ప్రతీక్షనగర్, వడాల, శివారు ప్రాంతాలైన బాంద్రా, శాంతక్రజ్, విలేపార్లే, మలాడ్, బోరివలి, ఠాణే, భివండీ, డోంబి వలి, నవీముంబై, చెంబూర్ తదితర ప్రాంతాల్లో తెలంగాణ సంబరాలు మిన్నంటాయి. గత ఐదు దశాబ్ధాల సుదీర్ఘ పోరాటానికి ఫలితం లభించడంతో వివిధ తెలంగాణ సంఘాలు, కార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ, స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని బయట ప్రపంచానికి చాటిచెప్పారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో... ముంబైకి చెందిన తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి. ఈ సంస్ధకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలతోపాటు వివిధ కుల సంఘాలు, తెలుగు సంఘాలు, విద్యావంతులు, రచయితల సంఘాల నేతలు, కార్యకర్తలు, వందలాది అభిమానులు పెద్ద ఎత్తున జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అభిమానులు రోడ్లపైకి వచ్చి బాణసంచా పేల్చారు. ధారావి, తిలక్‌నగర్, విలేపార్లే, బాంద్రా, డోంబివలి, ములుండ్, ఘాట్కోపర్, అంటాప్ హిల్, ప్రతీక్షనగర్, మాటుంగా, కింగ్ సర్కిల్, పవయి, కాందీవలి తదితర ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణ ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. వడాలలోని తెలుగు సంఘం నాయకులు జి.దశరథ్, వి.రాములు, లతీఫ్, మారన్న, వడాల మహిళ సంఘాలు సభ్యులు, ధారావి కార్మిక సంఘం, యాదవ్ సంఘం, రిలయన్స్ కార్మిక సంఘం సంయుక్తంగా సంబరాలు చేసుకున్నారు. ఇందులో జి.వెంకటేశ్, అవుల రాములు, లింగన్న, వెంకటేశ్ యాదవ్ పాల్గొన్నారు. దిండోషి, కాందివలి తదితర ప్రాంతాల్లో అభిమానులు జై తెలంగాణ, తెలంగాణ జిందాబాద్ అంటూ భారీగా నినాదాలు చేశారు. శాంతక్రజ్, విలేపార్లేలో శ్రమజీవి సంఘం, కార్మిక సంఘాల నేతలు పుష్కర్ జాల, రామలింగం, బిట్టు శ్రీను,సైదులు, శేఖర్ గ్యార బాణసంచా పేల్చారు. డోంబివలి శ్రమజీవి సంఘం, తెలంగాణ రచయితల వేదిక నాయకులు అక్కనపెల్లి దుర్గేశ్ నేతృత్వంలో లక్ష్మణ్ , గొండ్యాల రమేశ్ మార్గదర్శనంలో సంబరాలు చేసుకున్నారు. అంటాప్ హిల్‌లో కుమార్, అంజయ్య, తెలంగాణ ప్రజాసంఘం నాయకులు మల్లేశ్ తదితరులు ఉత్సవాలు జరుపుకున్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుపై ఆమోదం పొందడంపై ముంబై తెలంగాణ ఫోరం కన్వీనర్ గన్నారపు శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారికే అంకితమని అన్నారు. ఎంటీజేఏసీ ఆధ్వర్యంలో... పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదానికి తెలంగాణ ప్రజల నిరంతర పోరాటానికి ఫలితమని, వందలాది అమరుల త్యాగాాలకు ప్రతిఫలంగా తెలంగాణ ఏర్పడిందని భారత కమ్యూనిస్టు పార్టీ ముంబై కార్యదర్శి కామ్రేడ్ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేంత వరకు దీక్ష విరమించమని పేర్కొంటూ గత వారం రోజుల నుంచి ఎంటీజేఏసీ ఆధ్వర్యంలో ఆజాద్ మైదాన్‌లో రిలే నిరహార దీక్ష కొనసాగుతున్న విషయం తెలిసిందే. అనుకున్న విధంగా తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడంతో విజయోత్సవ సభతోపాటు ముగింపు సభ నిర్వహించారు. ఈ విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా 1969 టీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిల్లు పాస్ కావడం కాంగ్రెస్, బీజేపీల గొప్పతనం కాదన్నారు. ఎప్పుడో తెలంగాణ ఇవ్వాల్సి ఉంది. వీరి నిర్వాకంవల్లే ఇన్ని సంవత్సరాలు వాయిదా పడుతూ వచ్చిందని దుయ్యబట్టారు. అనంతరం ముంబై టీ జేఏసీ నాయకులు మిఠాయిలు పంచుకున్నారు. ముంబై టీ ఐకాస గౌరవ అధ్యక్షుడు జి.రాందాస్ పద్మశాలి మాట్లాడుతూ ఇక నుంచి భవిష్యత్ కార్యచరణపై దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో బహుజన శ్రామికులకు అన్ని ఫలాలు అందేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ఐకాస నాయకులు మూల్నివాసి మాల, కె .నర్సింహా గౌడ్, అక్కనపెల్లి శ్రీనివాస్, సిరిపంగ రవి, టిఆర్ఎస్ నాయకులు శివరాజ్ బొల్లే, గాజుల మహేశ్, ఉప్పుల భూమన్న తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బోరివలిలో... పశ్చిమ బోరివలిలోని చార్ కోప్ ప్రాంతంలో ఉన్న బాలాజీ మందిరం వద్ద తె లంగాణ మోర్చా నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఉదయం నుంచి వీరు టీవీలకే అతుక్కుపోయారు. బిల్లు పాసైందని ప్రకటించగానే ఒకరికొకరు మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గులాల్ చల్లుకుంటూ నృత్యాలు చేశారు. జై తెలంగాణ నినాదాలు మారుమ్రోగాయి. టీ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్‌కు ఆ సంస్థ అధ్యక్షుడు మండల గురునాథ్, స్థానిక తెలంగాణ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలిజాల శ్రీనివాస్, నర్సారెడ్డి, భూమన్న, అంజయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. బోరివలి అసెంబ్లీ నియోజక వర్గం బీజేపీ కార్యదర్శి మేకల హనుమంతు నేతృత్వంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ శెట్టి కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. నృత్యాలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి సాయిబాబా నగర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతం మిన్నంటింది. ఇది ఐదు దశాబ్దాల సుదీర్ఘ పోరాటమని, వేలాది మంది త్యాగాలకు ఫలితమని హనుమంతు అన్నారు. ఈ ర్యాలీలో బాలనర్సు, ముత్యాల రాజు కొంకటి, మల్లేశ్, అంజయ్య, శ్రీను తదితర పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. డోంబివలిలో... తూర్పు డోంబివలిలో అహిరేగావ్ ప్రాంతంలో శ్రమజీవి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చారు. స్వీట్లు పంచుకున్నారు. రాబోయే తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని సతీష్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అందరూ ఐకమత్యంతో తెలంగాణను ముందు తీసుకెళ్లాలని దండెంపల్లి నర్సింహా అకాంక్షించారు. ఈ వేడుకల్లో యాటేల్లి మల్లేశ్, గాలిపెల్లి నరేశ్ తదితరులు ఉన్నారు. భివండీలో... పద్మనగర్‌లోని మార్కండేయ మహాముని చౌక్ వద్ద మహారాష్ట్ర తెలుగు మహాసంఘ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ గుమిగూడిన తెలంగాణ ప్రజలు గులాల్ చల్లుకుని సంబురాలు చేసుకున్నారు. ఆలింగనం చేసుకుని ధన్యావాదాలు తెలుపుకున్నారు. జై తెలంగాణ అంటూ భారీగా బాణసంచాలు పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
అదుపు తప్పుతున్న ఆప్ సర్కారు
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారం చేపట్టి నెల్లాళ్లయినా కాకుండానే ‘ఆప్’ సర్కారు అదుపు తప్పుతోంది. పార్టీ నేతలు రేకెత్తిస్తున్న వరుస వివాదాలు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)సర్కారు తలకు చుట్టుకుంటున్నాయి. వ్యభిచారం, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలపై ఆఫ్రికన్ మహిళలపై మద్దతుదారులతో కలసి గత బుధవారం అర్ధరాత్రి దాడి చేయించిన మంత్రి సోమనాథ్ భారతికి ఉద్వాసన పలకాలంటూ పలు వర్గాల నుంచి సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు, కేరళ నర్సులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ‘ఆప్’ నేత కుమార్ విశా్వ స చివరకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఆఫ్రికన్ మహిళలపై దాడికి సంబంధించి రికార్డయిన సీడీ దృశ్యాల్లో మంత్రి సోమనాథ్ భారతిని బాధితుల్లో ఒకరైన ఉగాండా మహిళ గుర్తిం చింది. ఆమెతో పాటు మరో ఉగాండా మహిళ, ముగ్గురు నైజీరి యన్ మహిళలు మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చారు. ఈ పరి ణామంతో సర్కారుపై విమర్శలు ఉధృతమయ్యాయి. వాంగ్మూలంలో ఆఫ్రికన్ మహిళల ఆరోపణలు, వాటిపై స్పందనలు... సోమనాథ్ భారతి ఆధ్వర్యంలో కొందరు పెద్దపెద్ద కర్రలతో తమ ఇళ్లపై దాడిచేసి, తమను కొట్టారని, అసభ్యంతగా తమ శరీరాలను తడిమారని సీడీ దృశ్యాల్లో ఆయనను గుర్తించిన ఉగాండా మహిళ ఆరోపించింది. దేశం విడిచి వెళ్లాలని, లేకుంటే ఒకరి తర్వాత ఒకరుగా అందరినీ చంపేస్తామని బెదిరించారని, ఢిల్లీ పోలీసులు సకాలంలో చేరుకుని తమను రక్షించారని ఆఫ్రికన్ మహిళలు తెలిపారు. సోమనాథ్ భారతిని మంగళవారం హాజరు కావాల్సిందిగా ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశించినా, ఆయన హాజరు కాలేదు. ఆయనకు పోలీసుల ద్వారా గురువారం మళ్లీ సమన్లు పంపనున్నట్లు ఢిల్లీ మహిళా కమిషన్ ప్రకటించింది. ఆఫ్రికన్ మహిళలను వెంటాడి, పట్టుకోవాల్సిందిగా సోమనాథ్ మనుషులను ఉసిగొల్పడం ఏమాత్రం సమంజసం కాదని మహిళా నాయకురాలు కవితా కృష్ణన్ దుయ్యబట్టారు. ఆయన తనంతట తానే రాజీనామా చేయాలని, లేకుంటే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మాదకద్రవ్యాలు తీసుకున్నారో లేదో నిర్ధారించేందుకు ఏ ఆధారంతో ఆఫ్రికన్ మహిళలపై పరీక్షలు జరిపించారని మహిళా కమిషన్ చైర్పర్సన్ మమతా శర్మ మండిపడ్డారు. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ కూడా ‘ఆప్’ సర్కారు తీరును తప్పుపట్టారు. సోమనాథ్‌కు ఉద్వాసన పలకాలంటూ ‘ఆప్’ రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ సచివాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. మంత్రి భారతిని పదవి నుంచి తొలగించి, ఆయనను అరెస్టు చేయాలని గవర్నర్‌ను కోరనున్నట్లు ‘ఆప్’ సర్కారుకు మద్దతిస్తున్న కాంగ్రెస్ ప్రకటించింది. కేరళ నర్సులకు కుమార్ విశ్వాస్ క్షమాపణలు రాంచీలో 2008లో జరిగిన ఒక కార్యక్రమంలో కేరళ నేతలపై ‘ఆప్’ నేత కుమార్ విశ్వాస్ అనుచిత వ్యాఖ్యలు చేసిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో కనిపించడంతో కలకలం మొదలైంది. దీంతో తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని విశ్వాస్ ప్రకటించారు. కేజ్రీవాల్‌కు అస్వస్థత: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యూరు. బుధవారం విధులకు గైర్హాజరయ్యూరు. విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. రెండురోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కేజ్రీవాల్ పిచ్చి సీఎం: షిండే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ‘పిచ్చి సీఎం’గా అభివర్ణించారు. కేజ్రీవాల్ పేరును ఆయన నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయనను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్రలోని హింగోలీలో బుధవారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను పోలీసుగా పనిచేసిన సమయంలో శివసేన అల్లర్లకు దిగిన కారణంగా అప్పట్లో తనకు సెలవు దక్కలేదని చెప్పారు. ‘నిన్న కూడా ఢిల్లీలో ఆ పిచ్చి సీఎం ధర్నాకు దిగడంతో నేను పోలీసులకు సెలవులు రద్దు చేయాల్సి వచ్చింది’ అన్నారు. -
షిండే ప్రకటనపై తెలంగాణ వాదుల హర్షాతిరేకాలు
ఖమ్మం, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ, భద్రాచలం డివిజన్ లేని తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే ఆందోళనకు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం చేసిన ప్రకటనతో తెరపడింది. పది జిల్లాతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, దీనిపై జీవోఎం నిర్ణయం తీసుకుందని ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా తెలంగాణావాదులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు, జేఏసీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. అయితే పది సంవత్సరాలు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచడం సరికాదని, పోలవరం నిర్మాణంతో ముంపు ప్రాంతాల ప్రజల పరిస్థితిపై పునరాలోచించాలని పలు రాజకీయ పక్షాల నాయకులు అన్నారు. షిండే ప్రకటన సంతోషకరం షిండే చేసిన ప్రకటన సంతోషకరం. అయితే పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచడం సరికాదు. పోలవరం ప్రాజెక్టు మాదిరిగానే తెలంగాణాలోని అన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలి. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌తో తలెత్తే సమస్యను పరిష్కరించాలి. ఎన్.వెంకటపతిరాజు, ఉద్యోగ జేఎసీ జిల్లా కార్యదర్శి మాట తప్పని నేత సోనియా మొదటి నుంచి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని ప్రకటించిన యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ మరోసారి మాట నిలుపుకున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించడం సంతోషకరం. రాయల తెలంగాణా కాకుండా పది జిల్లాలు, భద్రాచలం డివిజన్‌తో కూడిన, హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రం ఏర్పడుతుంది. - రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ఉద్యానవన శాఖా మంత్రి షిండే ప్రకటనను ఆహ్వానిస్తున్నాం కేంద్ర హోంశాఖ మంత్రి షిండే ప్రకటనను ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఉద్యమాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఉమ్మడి రాజ దానిగా హైదరాబాద్‌ను పదేళ్లు ఉంచ డం సరికాదు. మూడు సంవత్సరాలుంటే సరిపోతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పాటుపడుతున్న ప్రభుత్వం ముంపు ప్రాంతాల గిరిజనుల గురించి ఆలోచించాలి. - పోటు రంగారావు, ఎన్డీ జిల్లా కార్యదర్శి ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలి.. రాయల తెలంగాణా కాదు, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే చేసిన ప్రకటన హర్షనీయం. త్వరగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రకవేశపెట్టి ఆంక్షలు లేని తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలి. ఈ విజయం తెలంగాణ ఉద్యమకారులదే. - భాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కాంగ్రెస్ మాట నిలుపుకుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చివరి అంకంలోకి వచ్చింది. షిండే ప్రకటన తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. భద్రాచలంపై ఉన్న సందిగ్ధతకు తెరపడింది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసిన ఇతర రాజకీయ పార్టీలకు చెంపపెట్టుగా షిండే ప్రకటన చేశారు. - పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాయల్ కాదు... రియల్ తెలంగాణానే సీడబ్ల్యూసీలో తీర్మానం చేసిన విధంగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉందని మరోసారి రుజువయింది. రాయల్ తెలంగాణా కాదు.. రియల్ తెలంగాణానే వస్తుంది, భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడని జీవోఎం గుర్తించింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. - వనమా వెంకటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉద్యమాల ఫలితమే ప్రకటన ఆరు దశాబ్ధాల తెలంగాణ ప్రజల ఉద్యమ ఫలితమే షిండే ప్రకటన. అయితే ఈ ప్రకటనతో సంతోష పడరాదు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలి. శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించడం సరికాదు. ఉమ్మడి రాజదాని పది సంవత్సరాలు కాకుండా సడలించాలి. - కొందపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పార్లమెంట్లో బిల్లు పెట్టేవరకు అప్రమత్తంగా ఉండాలి ఇల్లు అలుకగానే పడుగ కాదు. పార్లమెంట్లో తెలంగాణా బిల్లు ప్రవేశపట్టి ఆ మోదించినప్పుడే నిజనమై పండుగ. అప్ప టి వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తం గా ఉండాలి. ఆంక్షలు లేని తెలంగాణ కావాలి. సిరి సంపదలతో విరజిల్లే తెలంగాణా ఏర్పాటు చేసుకోవాలి. అంతేకానీ ప్రకటనలతో సంతోషపడితే ప్రమాదాలు జరుగవచ్చు. - దిండిగాల రాజేందర్, టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ పదేళ్ల ఉమ్మడి రాజధాని సరికాదు.. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుపై షిండే చేసిన ప్రకటన సంతోషకం. అయితే పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచడం సరికాదు. పోల వరం ప్రాజెక్టు మాదిరిగానే తెలంగాణాలోని అన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలి. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌తో తలెత్తే సమస్యను పరిష్కరించాలి. ఇరు ప్రాంతాలకు నీటి పంపిణీపై స్పష్టత కల్పించాలి. -తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే యువకుల బలిదాన ఫలితమే వెయ్యిమంది యువకుల బలిదాన ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించడం సంతోషకరం. పదిజిల్లాలు, భద్రాచలం డివిజన్ కూడిన, హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రం ఏర్పడినందుకు సంతోషం. - షేక్ ఖాజామియా, టీజీవో జిల్లా అధ్యక్షుడు ఐదేళ్ల పాటు మాత్రమే ఉమ్మడి రాజధాని ఉంచాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చివరి అంకంలోకి వచ్చింది. షిండే ప్రకటన తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయం. భద్రాచలంపై ఉన్న సందిగ్ధతకు తెరపడింది. వీలైనంత త్వరగా బిల్లులు పార్లమెంటులో పెట్టాలి. - ఏలూరి శ్రీనివాసరావు, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేంద్రం దిగిరాక తప్పలేదు.. కేంద్ర హోంశాఖ మంత్రి షిండే ప్రకటనను ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగానే కేంద్రం దిగివచ్చి ఈ ప్రకటన చేసింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను పది సంవత్సరాలు ఉంచడం, శాంతి భద్రతలు గవర్నకు అప్పగించడంపై మరోసారి ఆలోచిస్తే బాగుంటుంది. మూడేళ్లపాటు ఉమ్మడి రాజధాని సరిపోతుంది. గంగవరపు నరేందర్,టీఎన్జీవో జిల్లా ప్రధానకార్యదర్శి ఆరు దశాబ్దాల ఉద్యమ ఫలితమే ఆరు దశాబ్దాల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాయల తెలంగాణా కాదు, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే చేసిన ప్రకటన హర్షనీయం. త్వరగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. ఈ విజయం తెలంగాణ ఉద్యమకారులదే. - కూరపాటి రంగరాజు, ఉద్యోగ సంఘం జిల్లా చైర్మన్ -
జాతీయ హోదాతో పోల‘వరం’
వేలేరుపాడు, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రభావంతో పోలవరం ప్రాజెక్ట్‌కు కూడా కేంద్ర ప్రభుత్వం జాతీయహోదా ప్రకటించింది. దీనికి కేంద్ర కేబినేట్ గురువారం ఆమోదం తెలిపినట్లు హాంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. ఇప్పటికే అన్ని అనుమతులు పొందిన పోలవరానికి జాతీయ హోదా లభించడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి. ఈ హోదాతో ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రూ. 5, 500 కోట్లు కేంద్రం నుంచే రానున్నాయి. ఇక దీని ఆర్థిక వ్యవహారాలన్నీ కేంద్రం ఆధీనంలోనే ఉంటాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దీనికి జాతీయ హోదా కోసం తీవ్ర కృషి చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 300 టీఎంసీల గోదావరి జలాలను వినియోగంలోకి తేవాలని, 80 టీఎంసీలను కృష్ణాకు మళ్లించాలని, మరో 24 టీఎంసీలను విశాఖపట్టణానికి తరలించాలని, 960 మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో మూడు జిల్లాల్లోని (ఖమ్మం,తూర్పు,పశ్చిమ గోదావరి) 9 మండలాలకు చెందిన 276 జనావాసాలు నీటమునగనున్నాయి. 1,31,496 మంది నిర్వాసితులు కానున్నారు. ఇందులో 65,309 (50 శాతం) మంది అడవిని నమ్ముకున్న ఆదివాసీలే. ఎక్కువ భాగం ముంపు ప్రభావం ఖమ్మం జిల్లా పైనే ఉంది. మన జిల్లాలోని ఏడు మండలాల్లో 205 గ్రామాల్లో 38 వేల కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. వేలాది ఎకరాల వ్యవసాయ భూమితోపాటు అటవీభూములు కూడా నీటమునగనున్నాయి. ముంపునకు గురయ్యే అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా అడవులు పెంచేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 430 కోట్లు విడుదల చేసింది. అంతేకాకుండా దీని నిర్మాణానికి సుమారు 1.18 లక్షల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ భూమి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఖమ్మం, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఉంది. ఇప్పటి వరకు సుమారు 50 వేల ఎకరాలు సేకరించారు. ఖమ్మం జిల్లాలో నీటిపారుదల శాఖ అందించిన లెక్కల ప్రకారం 72 వేల ఎకరాలకు నష్టపరిహారం అందించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు ప్రభుత్వం 22,500 ఎకరాలకు రూ.165 కోట్ల మేర పరిహారం అందించింది. ఇంకా 49,500 ఎకరాలకు సుమారు రూ. 400 కోట్లకు పైగా పరిహారం చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా గిరిజనులకు భూమికి బదులు భూమి 32,220 ఎకరాలు అధికారిక లెక్కల ప్రకారమే చూపించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 1695 ఎకరాలు మాత్రమే గుర్తించారు. అలాగే నిలిచిపోయిన పునరావాస పనులు, గ్రామాలు ఖాళీచేసే ప్రక్రియ కూడా పుంజుకోనుంది. -
అభిప్రాయాలు తెలిపిన తరువాతే అఖిలపక్షం: షిండే
ఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై అభిప్రాయాలు పంపాలని ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పక్షాలకు హొం శాఖ లేఖలు పంపింది. తెలంగాణపై కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం(జిఎంఓ) విధివిధానాలపై అభిప్రాయాలు పంపాలని ఆ లేఖలలో పేర్కొన్నారు. నవంబర్ 5కల్లా అభిప్రాయాలు పంపాలని హొం శాఖ విజ్ఞప్తి చేసింది. 7వ తేదీన జిఎంఓ సమావేశం కానున్నందున, ఆ లోపలే అభిప్రాయాలు పంపాలని హొం శాఖ కోరింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలు పంపిన తరువాత అఖిలపక్ష సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేయాలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు వచ్చే వారంలో రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు షిండే నిన్న చెప్పారు. జిఎంఓ సమావేరశానికి ముందే సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. మళ్లీ ఈరోజు వారి అభిప్రాయాలు తెలిపిన తరువాతే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. -
'సీమాంధ్రుల ఆందోళనలను కాంగ్రెస్సే నివృత్తి చేయాలి'
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ స్పష్టం చేశారు. బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను నారాయణ కలిశారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న ఆటలో భాగంగానే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నడుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కానీ సీఎం కిరణ్ మాత్రం సమైక్యాంధ్ర అంటున్నారని తాను షిండేను అడిగాను. ఆ ప్రశ్నకు షిండే ఏమి మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నారని తెలిపారు. దీన్ని బట్టి కిరణ్ కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న ఆటలో భాగంగానే ఆడుతున్నారని అర్థమవుతుందన్నారు. తెలంగాణకు అనుకూలంగా సీపీఐ పార్టీ నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని ఈ సందర్భంగా నారాయణ గుర్తు చేశారు.