సాక్షి, ముంబై/బోరివలి/భివండీ, న్యూస్‌లైన్: లోక్‌సభలో మంగళవారం తెలంగాణ బిల్లుకు అమోదం లభించడంతో ముంబైలో నివాసముంటున్న తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదానికి రానుందని ముందే తెలుసుకున్న ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ఒకవైపు ఇరు ప్రాంత ప్రజల మధ్య ఉత్కంఠ, మరోవైపు ఫలితం ఎలా ఉంటుందనే దానిపై ఆందోళన...వీటి మధ్యన ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే బిల్లు ప్రవేశపెట్టగానే ఒక్కసారిగా తెలంగాణ ప్రజలు సంతోషం తట్టుకోలేక కేకలు వేశారు.
అనేక మంది తెలంగాణవాదులు సెల్ ఫోన్ల ద్వారా ఎస్‌ఎంఎస్‌లతోపాటు సోషల్ మీడియా ద్వారా సందేశాలను పంపుతూ తమ అభిమానాన్ని, ఆనందాన్ని పంచుకున్నారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ ప్రజలు కొంతసేపు తమ పనులు పక్కనబెట్టి సంబరాలు చేసుకున్నారు. నగరంలో తెలుగు ప్రజలు నివాసముండే లోయర్ పరేల్, కామాటిపుర, ప్రభాదేవి, వర్లీ, సైన్ ప్రతీక్షనగర్, వడాల, శివారు ప్రాంతాలైన బాంద్రా, శాంతక్రజ్, విలేపార్లే, మలాడ్, బోరివలి, ఠాణే, భివండీ, డోంబి వలి, నవీముంబై, చెంబూర్ తదితర ప్రాంతాల్లో తెలంగాణ సంబరాలు మిన్నంటాయి. గత ఐదు దశాబ్ధాల సుదీర్ఘ పోరాటానికి ఫలితం లభించడంతో వివిధ తెలంగాణ సంఘాలు, కార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ, స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని బయట ప్రపంచానికి చాటిచెప్పారు.
వివిధ సంఘాల ఆధ్వర్యంలో...
ముంబైకి చెందిన తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి. ఈ సంస్ధకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలతోపాటు వివిధ కుల సంఘాలు, తెలుగు సంఘాలు, విద్యావంతులు, రచయితల సంఘాల నేతలు, కార్యకర్తలు, వందలాది అభిమానులు పెద్ద ఎత్తున జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అభిమానులు రోడ్లపైకి వచ్చి బాణసంచా పేల్చారు. ధారావి, తిలక్‌నగర్, విలేపార్లే, బాంద్రా, డోంబివలి, ములుండ్, ఘాట్కోపర్, అంటాప్ హిల్, ప్రతీక్షనగర్, మాటుంగా, కింగ్ సర్కిల్, పవయి, కాందీవలి తదితర ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణ ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకున్నారు.
వడాలలోని తెలుగు సంఘం నాయకులు జి.దశరథ్, వి.రాములు, లతీఫ్, మారన్న, వడాల మహిళ సంఘాలు సభ్యులు, ధారావి కార్మిక సంఘం, యాదవ్ సంఘం, రిలయన్స్ కార్మిక సంఘం సంయుక్తంగా సంబరాలు చేసుకున్నారు. ఇందులో జి.వెంకటేశ్, అవుల రాములు, లింగన్న, వెంకటేశ్ యాదవ్ పాల్గొన్నారు. దిండోషి, కాందివలి తదితర ప్రాంతాల్లో అభిమానులు జై తెలంగాణ, తెలంగాణ జిందాబాద్ అంటూ భారీగా నినాదాలు చేశారు. శాంతక్రజ్, విలేపార్లేలో శ్రమజీవి సంఘం, కార్మిక సంఘాల నేతలు పుష్కర్ జాల, రామలింగం, బిట్టు శ్రీను,సైదులు, శేఖర్ గ్యార బాణసంచా పేల్చారు.
డోంబివలి శ్రమజీవి సంఘం, తెలంగాణ రచయితల వేదిక నాయకులు అక్కనపెల్లి దుర్గేశ్ నేతృత్వంలో లక్ష్మణ్ , గొండ్యాల రమేశ్ మార్గదర్శనంలో సంబరాలు చేసుకున్నారు. అంటాప్ హిల్‌లో కుమార్, అంజయ్య, తెలంగాణ ప్రజాసంఘం నాయకులు మల్లేశ్ తదితరులు ఉత్సవాలు జరుపుకున్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుపై ఆమోదం పొందడంపై ముంబై తెలంగాణ ఫోరం కన్వీనర్ గన్నారపు శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారికే అంకితమని అన్నారు.
ఎంటీజేఏసీ ఆధ్వర్యంలో...
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదానికి తెలంగాణ ప్రజల నిరంతర పోరాటానికి ఫలితమని, వందలాది అమరుల త్యాగాాలకు ప్రతిఫలంగా తెలంగాణ ఏర్పడిందని భారత కమ్యూనిస్టు పార్టీ ముంబై కార్యదర్శి కామ్రేడ్ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేంత వరకు దీక్ష విరమించమని పేర్కొంటూ గత వారం రోజుల నుంచి ఎంటీజేఏసీ ఆధ్వర్యంలో ఆజాద్ మైదాన్‌లో రిలే నిరహార దీక్ష కొనసాగుతున్న విషయం తెలిసిందే. అనుకున్న విధంగా తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడంతో విజయోత్సవ సభతోపాటు ముగింపు సభ నిర్వహించారు.
ఈ విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా 1969 టీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిల్లు పాస్ కావడం కాంగ్రెస్, బీజేపీల గొప్పతనం కాదన్నారు. ఎప్పుడో తెలంగాణ ఇవ్వాల్సి ఉంది. వీరి నిర్వాకంవల్లే ఇన్ని సంవత్సరాలు వాయిదా పడుతూ వచ్చిందని దుయ్యబట్టారు. అనంతరం ముంబై టీ జేఏసీ నాయకులు మిఠాయిలు పంచుకున్నారు. ముంబై టీ ఐకాస గౌరవ అధ్యక్షుడు జి.రాందాస్ పద్మశాలి మాట్లాడుతూ ఇక నుంచి భవిష్యత్ కార్యచరణపై దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో బహుజన శ్రామికులకు అన్ని ఫలాలు అందేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ఐకాస నాయకులు మూల్‌నివాసి మాల, కె .నర్సింహా గౌడ్, అక్కనపెల్లి శ్రీనివాస్, సిరిపంగ రవి, టిఆర్‌ఎస్ నాయకులు శివరాజ్ బొల్లే, గాజుల మహేశ్, ఉప్పుల భూమన్న తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ బోరివలిలో...
పశ్చిమ బోరివలిలోని చార్ కోప్ ప్రాంతంలో ఉన్న బాలాజీ మందిరం వద్ద తె లంగాణ మోర్చా నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఉదయం నుంచి వీరు టీవీలకే అతుక్కుపోయారు. బిల్లు పాసైందని ప్రకటించగానే ఒకరికొకరు మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గులాల్ చల్లుకుంటూ నృత్యాలు చేశారు. జై తెలంగాణ నినాదాలు మారుమ్రోగాయి. టీ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్‌కు ఆ సంస్థ అధ్యక్షుడు మండల గురునాథ్, స్థానిక తెలంగాణ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలిజాల శ్రీనివాస్, నర్సారెడ్డి, భూమన్న, అంజయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
బోరివలి అసెంబ్లీ నియోజక వర్గం బీజేపీ కార్యదర్శి మేకల హనుమంతు నేతృత్వంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ శెట్టి కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. నృత్యాలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి సాయిబాబా నగర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతం మిన్నంటింది. ఇది ఐదు దశాబ్దాల సుదీర్ఘ పోరాటమని, వేలాది మంది త్యాగాలకు ఫలితమని హనుమంతు అన్నారు. ఈ ర్యాలీలో బాలనర్సు, ముత్యాల రాజు కొంకటి, మల్లేశ్, అంజయ్య, శ్రీను తదితర పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.
డోంబివలిలో...
తూర్పు డోంబివలిలో అహిరేగావ్ ప్రాంతంలో శ్రమజీవి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చారు. స్వీట్లు పంచుకున్నారు. రాబోయే తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని సతీష్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అందరూ ఐకమత్యంతో తెలంగాణను ముందు తీసుకెళ్లాలని దండెంపల్లి నర్సింహా అకాంక్షించారు. ఈ వేడుకల్లో యాటేల్లి మల్లేశ్, గాలిపెల్లి నరేశ్ తదితరులు ఉన్నారు.
భివండీలో...
పద్మనగర్‌లోని మార్కండేయ మహాముని చౌక్ వద్ద మహారాష్ట్ర తెలుగు మహాసంఘ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ గుమిగూడిన తెలంగాణ ప్రజలు గులాల్ చల్లుకుని సంబురాలు చేసుకున్నారు. ఆలింగనం చేసుకుని ధన్యావాదాలు తెలుపుకున్నారు. జై తెలంగాణ అంటూ భారీగా బాణసంచాలు పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
టీ జోష్
Published Tue, Feb 18 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement
Advertisement