అదుపు తప్పుతున్న ఆప్ సర్కారు
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారం చేపట్టి నెల్లాళ్లయినా కాకుండానే ‘ఆప్’ సర్కారు అదుపు తప్పుతోంది. పార్టీ నేతలు రేకెత్తిస్తున్న వరుస వివాదాలు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)సర్కారు తలకు చుట్టుకుంటున్నాయి. వ్యభిచారం, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలపై ఆఫ్రికన్ మహిళలపై మద్దతుదారులతో కలసి గత బుధవారం అర్ధరాత్రి దాడి చేయించిన మంత్రి సోమనాథ్ భారతికి ఉద్వాసన పలకాలంటూ పలు వర్గాల నుంచి సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు, కేరళ నర్సులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ‘ఆప్’ నేత కుమార్ విశా్‌వ స చివరకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఆఫ్రికన్ మహిళలపై దాడికి సంబంధించి రికార్డయిన సీడీ దృశ్యాల్లో మంత్రి సోమనాథ్ భారతిని బాధితుల్లో ఒకరైన ఉగాండా మహిళ గుర్తిం చింది. ఆమెతో పాటు మరో ఉగాండా మహిళ, ముగ్గురు నైజీరి యన్ మహిళలు మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చారు. ఈ పరి ణామంతో సర్కారుపై విమర్శలు ఉధృతమయ్యాయి. వాంగ్మూలంలో ఆఫ్రికన్ మహిళల ఆరోపణలు, వాటిపై స్పందనలు...
- సోమనాథ్ భారతి ఆధ్వర్యంలో కొందరు పెద్దపెద్ద కర్రలతో తమ ఇళ్లపై దాడిచేసి, తమను కొట్టారని, అసభ్యంతగా తమ శరీరాలను తడిమారని సీడీ దృశ్యాల్లో ఆయనను గుర్తించిన ఉగాండా మహిళ ఆరోపించింది.
- దేశం విడిచి వెళ్లాలని, లేకుంటే ఒకరి తర్వాత ఒకరుగా అందరినీ చంపేస్తామని బెదిరించారని, ఢిల్లీ పోలీసులు సకాలంలో చేరుకుని తమను రక్షించారని ఆఫ్రికన్ మహిళలు తెలిపారు.
- సోమనాథ్ భారతిని మంగళవారం హాజరు కావాల్సిందిగా ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశించినా, ఆయన హాజరు కాలేదు. ఆయనకు పోలీసుల ద్వారా గురువారం మళ్లీ సమన్లు పంపనున్నట్లు ఢిల్లీ మహిళా కమిషన్ ప్రకటించింది.
- ఆఫ్రికన్ మహిళలను వెంటాడి, పట్టుకోవాల్సిందిగా సోమనాథ్ మనుషులను ఉసిగొల్పడం ఏమాత్రం సమంజసం కాదని మహిళా నాయకురాలు కవితా కృష్ణన్ దుయ్యబట్టారు. ఆయన తనంతట తానే రాజీనామా చేయాలని, లేకుంటే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
- మాదకద్రవ్యాలు తీసుకున్నారో లేదో నిర్ధారించేందుకు ఏ ఆధారంతో ఆఫ్రికన్ మహిళలపై పరీక్షలు జరిపించారని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మమతా శర్మ మండిపడ్డారు.
- మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ కూడా ‘ఆప్’ సర్కారు తీరును తప్పుపట్టారు. సోమనాథ్‌కు ఉద్వాసన పలకాలంటూ ‘ఆప్’ రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ సచివాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
- మంత్రి భారతిని పదవి నుంచి తొలగించి, ఆయనను అరెస్టు చేయాలని గవర్నర్‌ను కోరనున్నట్లు ‘ఆప్’ సర్కారుకు మద్దతిస్తున్న కాంగ్రెస్ ప్రకటించింది.
కేరళ నర్సులకు కుమార్ విశ్వాస్ క్షమాపణలు
రాంచీలో 2008లో జరిగిన ఒక కార్యక్రమంలో కేరళ నేతలపై ‘ఆప్’ నేత కుమార్ విశ్వాస్ అనుచిత వ్యాఖ్యలు చేసిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో కనిపించడంతో కలకలం మొదలైంది. దీంతో తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని విశ్వాస్ ప్రకటించారు.
- కేజ్రీవాల్‌కు అస్వస్థత: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యూరు. బుధవారం విధులకు గైర్హాజరయ్యూరు. విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. రెండురోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
కేజ్రీవాల్ పిచ్చి సీఎం: షిండే
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ‘పిచ్చి సీఎం’గా అభివర్ణించారు. కేజ్రీవాల్ పేరును ఆయన నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయనను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్రలోని హింగోలీలో బుధవారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను పోలీసుగా పనిచేసిన సమయంలో శివసేన అల్లర్లకు దిగిన కారణంగా అప్పట్లో తనకు సెలవు దక్కలేదని చెప్పారు. ‘నిన్న కూడా ఢిల్లీలో ఆ పిచ్చి సీఎం ధర్నాకు దిగడంతో నేను పోలీసులకు సెలవులు రద్దు చేయాల్సి వచ్చింది’ అన్నారు.