షిండే ప్రకటనపై తెలంగాణ వాదుల హర్షాతిరేకాలు | Telangana supporters celebrate creation of Telangana state | Sakshi
Sakshi News home page

షిండే ప్రకటనపై తెలంగాణ వాదుల హర్షాతిరేకాలు

Published Fri, Dec 6 2013 4:29 AM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM

Telangana supporters celebrate creation of Telangana state

  ఖమ్మం, న్యూస్‌లైన్  : రాయల తెలంగాణ, భద్రాచలం డివిజన్ లేని తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే ఆందోళనకు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం చేసిన ప్రకటనతో తెరపడింది. పది జిల్లాతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, దీనిపై జీవోఎం నిర్ణయం తీసుకుందని ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా తెలంగాణావాదులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు, జేఏసీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. అయితే పది సంవత్సరాలు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచడం సరికాదని, పోలవరం నిర్మాణంతో ముంపు ప్రాంతాల ప్రజల పరిస్థితిపై పునరాలోచించాలని పలు రాజకీయ పక్షాల నాయకులు అన్నారు.
 
 షిండే ప్రకటన సంతోషకరం
 షిండే చేసిన ప్రకటన సంతోషకరం. అయితే పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచడం సరికాదు. పోలవరం ప్రాజెక్టు మాదిరిగానే తెలంగాణాలోని అన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలి. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌తో తలెత్తే సమస్యను పరిష్కరించాలి.     ఎన్.వెంకటపతిరాజు, ఉద్యోగ జేఎసీ జిల్లా కార్యదర్శి
 
 మాట తప్పని నేత సోనియా
 మొదటి నుంచి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని ప్రకటించిన యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ మరోసారి మాట నిలుపుకున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించడం సంతోషకరం. రాయల తెలంగాణా కాకుండా పది జిల్లాలు, భద్రాచలం డివిజన్‌తో కూడిన, హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రం ఏర్పడుతుంది.  
 - రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ఉద్యానవన శాఖా మంత్రి
 
 షిండే ప్రకటనను ఆహ్వానిస్తున్నాం
 కేంద్ర హోంశాఖ మంత్రి షిండే ప్రకటనను ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఉద్యమాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఉమ్మడి రాజ దానిగా హైదరాబాద్‌ను పదేళ్లు  ఉంచ డం సరికాదు. మూడు సంవత్సరాలుంటే  సరిపోతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పాటుపడుతున్న ప్రభుత్వం ముంపు ప్రాంతాల గిరిజనుల గురించి ఆలోచించాలి.  
 - పోటు రంగారావు, ఎన్డీ జిల్లా కార్యదర్శి
 
 ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలి..
 రాయల తెలంగాణా కాదు, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే చేసిన ప్రకటన హర్షనీయం. త్వరగా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రకవేశపెట్టి ఆంక్షలు లేని తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలి. ఈ విజయం తెలంగాణ ఉద్యమకారులదే.
 - భాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి
 
 కాంగ్రెస్ మాట నిలుపుకుంది
 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చివరి అంకంలోకి వచ్చింది. షిండే ప్రకటన తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. భద్రాచలంపై ఉన్న సందిగ్ధతకు తెరపడింది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసిన ఇతర రాజకీయ పార్టీలకు చెంపపెట్టుగా షిండే ప్రకటన చేశారు.
 - పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ
 
 రాయల్ కాదు...
 రియల్ తెలంగాణానే
 సీడబ్ల్యూసీలో తీర్మానం చేసిన విధంగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ  ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉందని మరోసారి రుజువయింది. రాయల్ తెలంగాణా కాదు.. రియల్ తెలంగాణానే వస్తుంది, భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడని జీవోఎం గుర్తించింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు.
 - వనమా వెంకటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
 
 ఉద్యమాల ఫలితమే ప్రకటన
 ఆరు దశాబ్ధాల తెలంగాణ ప్రజల ఉద్యమ ఫలితమే షిండే ప్రకటన. అయితే ఈ ప్రకటనతో సంతోష పడరాదు. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలి. శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించడం సరికాదు. ఉమ్మడి రాజదాని పది సంవత్సరాలు కాకుండా సడలించాలి.
 - కొందపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు
 
 పార్లమెంట్‌లో బిల్లు పెట్టేవరకు
 అప్రమత్తంగా ఉండాలి
 ఇల్లు అలుకగానే పడుగ కాదు. పార్లమెంట్‌లో తెలంగాణా బిల్లు ప్రవేశపట్టి ఆ మోదించినప్పుడే నిజనమై పండుగ. అప్ప టి వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తం గా ఉండాలి. ఆంక్షలు లేని తెలంగాణ కావాలి. సిరి సంపదలతో విరజిల్లే తెలంగాణా ఏర్పాటు చేసుకోవాలి. అంతేకానీ  ప్రకటనలతో సంతోషపడితే ప్రమాదాలు జరుగవచ్చు.
 - దిండిగాల రాజేందర్, టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్
 
 పదేళ్ల ఉమ్మడి రాజధాని సరికాదు..
 తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుపై షిండే చేసిన ప్రకటన సంతోషకం. అయితే పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచడం సరికాదు. పోల వరం ప్రాజెక్టు మాదిరిగానే తెలంగాణాలోని అన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలి. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌తో తలెత్తే సమస్యను పరిష్కరించాలి. ఇరు ప్రాంతాలకు నీటి పంపిణీపై స్పష్టత కల్పించాలి.
 -తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే
 
 యువకుల బలిదాన ఫలితమే
 వెయ్యిమంది యువకుల బలిదాన ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించడం సంతోషకరం. పదిజిల్లాలు, భద్రాచలం డివిజన్ కూడిన, హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రం ఏర్పడినందుకు సంతోషం.
 - షేక్ ఖాజామియా,
 టీజీవో జిల్లా అధ్యక్షుడు
 
 ఐదేళ్ల పాటు మాత్రమే ఉమ్మడి రాజధాని ఉంచాలి
 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చివరి అంకంలోకి వచ్చింది. షిండే ప్రకటన తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయం. భద్రాచలంపై ఉన్న సందిగ్ధతకు తెరపడింది. వీలైనంత త్వరగా బిల్లులు పార్లమెంటులో పెట్టాలి.
 - ఏలూరి శ్రీనివాసరావు, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 
 కేంద్రం దిగిరాక తప్పలేదు..
 కేంద్ర హోంశాఖ మంత్రి షిండే ప్రకటనను ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగానే కేంద్రం దిగివచ్చి ఈ ప్రకటన చేసింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను పది సంవత్సరాలు ఉంచడం, శాంతి భద్రతలు గవర్నకు అప్పగించడంపై మరోసారి ఆలోచిస్తే బాగుంటుంది. మూడేళ్లపాటు ఉమ్మడి రాజధాని సరిపోతుంది.
 గంగవరపు నరేందర్,టీఎన్‌జీవో జిల్లా ప్రధానకార్యదర్శి
 
 ఆరు దశాబ్దాల ఉద్యమ ఫలితమే
 ఆరు దశాబ్దాల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాయల తెలంగాణా కాదు, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే చేసిన ప్రకటన హర్షనీయం. త్వరగా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలి. ఈ విజయం తెలంగాణ ఉద్యమకారులదే.
 - కూరపాటి రంగరాజు, ఉద్యోగ సంఘం జిల్లా చైర్మన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement