హైదరాబాద్ : అధికార టీఆర్‌ఎస్ సంస్థాగత రాజకీయం ఆసక్తికరంగా మారింది. పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యవర్గాలు, అనుబంధ సంఘాల ఎంపిక వ్యవహారం దాదాపు పూర్తయినా, మరికొన్ని జిల్లాల్లో పెండింగ్‌లోనే ఉన్నట్లు చెబుతున్నారు. కొత్త, పాత జిల్లాల్లో సామాజిక సమీకరణలతో ఎంపిక ప్రక్రియ జఠిలంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో కొన్ని జిల్లాల జాబితాల్లో పేర్ల మార్పులు, చేర్పులు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం.
ఆయా జిల్లాల నుంచి అధ్యక్షుల పేర్లతో జాబితాలు ఇప్పటికే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు అందినా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల మధ్య సయోధ్య కుదరని చోట్ల పెండింగ్‌లో పడినట్లు తెలుస్తోంది. శుక్ర, శనివారాల్లో అధికారికంగా అధ్యక్షుల వివరాలను ప్రకటించే అవకాశం ఉన్నా, గురువారం రాత్రి దాకా కూడా కొన్ని జిల్లాల్లో ఇంకా మూడు నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.