తిండి పంటలు పండించాలి: కేసీఆర్‌ | CM KCR Says Telangana State To focus On Achieving Nutritious Food Security | Sakshi
Sakshi News home page

తిండి పంటలు

Published Thu, Jun 4 2020 1:24 AM | Last Updated on Thu, Jun 4 2020 8:47 AM

CM KCR Says Telangana State To focus On Achieving Nutritious Food Security - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో, రాష్ట్రంలో ఆహార భద్రత సాధించగలిగినా.. పోషకాహార భద్రత సాధించలేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏది పడితే అది తింటున్నారు తప్ప, బలవర్థకమైన ఆహారం తినడం లేదని, అలాంటి ఆహారాన్ని తినేలా ప్రోత్సహించాలని, అలాంటి పంటలే పండించాలని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలతో పాటు, రోగ నిరోధకశక్తి పెరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈసారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తున్నదని, ఇది ఏటా ప్రతి సీజన్‌లో కొనసాగాలని కోరారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, పంటకు ధర రాని దుస్థితి ఉండదన్నారు. అంతిమంగా రైతు లాభం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం రైతుల సహకారంతో విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో పంటల సాగు పద్ధతిగా జరగడం కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి సీఎం కేసీఆర్‌ వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులతో మూడు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు.


కేసీఆర్‌ సూచనల్లోని ముఖ్యాంశాలు
రాష్ట్రంలో, దేశంలో ప్రజల ఆహార అలవాట్లపై అధికారులు కచ్చితమైన అంచనాలు రూపొందించాలి. రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రాంతానికి ఏ ఆహార పదార్థాల అవసరం ఉందో గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్‌ ఉందో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పంటల సాగు జరగాలి. ఇది ఏ ఒక్క ఏడాదికో పరిమితం కాక నిరంతరం సాగాలి. దీనికోసం ప్రభుత్వం అగ్రికల్చర్‌ ప్రొడక్టŠస్‌ మార్కెటింగ్‌ కమిటీని నియమిస్తుంది. నిపుణులు, నిష్ణాతులు ఈ కమిటీలో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్‌ – మార్కెటింగ్‌ – ధరలు తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఏ పంటలు వేయడం వల్ల లాభమో సూచిస్తుంది.

వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెరగడం చాలా ముఖ్యం. సాగు పద్ధతుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులొస్తున్నాయి. ఆధునిక సాగు పద్ధతులు అవలంభించాలి. ఎరువులు, పురుగుమందుల వాడకంలో శాస్త్రీయత ఉండాలి. మేలురకమైన విత్తనాలు వేయాలి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగి అందుకనుణంగా సేద్యం జరగాలి. వీటిపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, తగు సూచనలివ్వడానికి ప్రభుత్వం అగ్రికల్చర్‌ రీసెర్చి కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ సూచించినట్టుగా సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలి.

తెలంగాణలో పత్తి ఎక్కువ పండిస్తున్నారు. పత్తిలో ఉత్పాదకత పెంచడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి? ఏ రకమైన పత్తికి మార్కెట్‌ ఉంది? అలాంటి పత్తి సాగు చేయాలంటే ఏం చేయాలి? వంటివి అధ్యయనం చేసి, తగు సూచనలివ్వడానికి, పత్తి రైతులకు చేదోడు వాదోడుగా ఉండడానికి ప్రభుత్వం కాటన్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తుంది.

తెలంగాణలో పండే పత్తికి మంచి డిమాండ్‌ ఉంది. నూలు పొడవు ఎక్కువ ఉండడం వల్ల మంచి ధర వస్తుంది. పత్తిలో మట్టి, పుల్లలు, ఇతర చెత్త కలవడం వల్ల సరుకులో నాణ్యత (ఫేర్‌ యావరేజ్‌ క్వాలిటీ – ఎఫ్‌.ఎ.క్యూ.) శాతం పడిపోయి, ధర తగ్గుతున్నది. కష్టపడి పంట పండించే రైతులు పత్తి ఏరిన తర్వాత అందులో చెత్తా చెదారం కలవకుండా జాగ్రత్తపడాలి.

రాష్ట్రంలో జిన్నింగ్, స్పిన్నింగ్‌ మిల్లుల సామర్థ్యంపై కచ్చితమైన అంచనాలు వేయాలి. సరిపోను ఉన్నాయా? ఇంకా నెలకొల్పాలా? అనే విషయంపై శాస్త్రీయమైన అంచనా ఉండాలి. పత్తి పండే ప్రాంతాల్లోనే వీటిని నెలకొల్పితే రవాణా వ్యయప్రయాసలు తప్పుతాయి.

తెలంగాణలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలున్నాయి. ఏ నేల ఏ పంట సాగుకు అనువైనదో తేల్చాలి. దానికి అనుగుణంగా పంటలు వేయాలి. పంటల కాలనీల ఏర్పాటుకు నేలల విభజన చేయాలి. ఈ వివరాలను రైతులకు తెలపాలి.

ప్రజలు నిత్యం తినే పండ్లు, కూరగాయలను రాష్ట్రంలో దిగుమతి చేసుకుంటున్నాం. ఏయే రకాల పండ్లు, కూరగాయలు దిగుమతి చేసుకంటున్నామో లెక్కలు తీయాలి. వాటిని మన రాష్ట్రంలోనే పండించాలి. పండ్లు, కూరగాయల విషయంలో స్వయం సమృద్ధి సాధించే ప్రణాళిక రూపొందించి, అమలుచేయాలి. పట్టణ ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల అవసరం ఎక్కువ. అందుకే పట్టణ పరిసరాల్లోని భూముల్లో పండ్లు, కూరగాయల సాగుకు అనువైన నేలలను గుర్తించి, రైతులను ప్రోత్సహించాలి.

– ఆలుగడ్డలు, అల్లం, ఎల్లిపాయలను ప్రజలు ఎక్కువగా వాడతారు. వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. రాష్ట్రంలోనే వాటిని పండించాలి. ఎక్కడ పండించాలి? మేలైన సాగు పద్ధతులేంటి? తదితర విషయాలపై రైతులకు మార్గదర్శనం చేయాలి.

ఉల్లిగడ్డల లభ్యత, ధరల విషయంలో ఏటా అనిశ్చితి, అస్పష్టత.. ఇలా ఎందుకుండాలి? తెలంగాణ ప్రజల అవసరాలకు తగ్గట్టు ఉల్లి సాగు జరగాలి. ఎప్పుడూ కొరత లేకుండా వ్యూహం అవలంభించాలి.

చిక్కుడు, మునగలో మంచి పోషకాలున్నాయి. వాటిని ఎక్కువగా తినేలా ప్రజలను చైతన్యపరచాలి. వాటి సాగు పెంచాలి.

► రాష్ట్రంలో కొత్తగా అనేక ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. మిషన్‌ కాకతీయతో చెరువుల నీటి సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. 24 గంటల ఉచిత విద్యుత్‌తో బోర్ల కింద సాగు పెరిగింది. ఏటా కొత్తగా ఆయకట్టు పెరుగుతోంది. పెరిగిన/పెరిగే విస్తీర్ణాన్ని సరిగ్గా అంచనావేస్తూ, పంటల సాగు ప్రణాళికలు తయారుచేయాలి.

ఉద్యానవనశాఖను మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి.

సరైన పంటల లెక్కల నమోదుకు ప్రత్యేకంగా స్టాటిస్టికల్‌ విభాగం ఏర్పాటు చేయాలి.

‘పంటల వివరాలను నమోదు చేయండి’
సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు రాష్ట్రంలో రైతులు వేసిన పంటల వివరాలను, రైతు పేరు, సర్వే నంబర్‌ వారీగా, ప్రతి గుంటలో వేసిన పంట వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ విస్తీర్ణాధికారులు ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేసే ఈ వివరాలను పర్యవేక్షించడానికి ముఖ్య గణాంక అధికారిగా వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుడు కె.విజయకుమార్‌ను నియమించామన్నారు. ఈ కార్యక్రమం కోసం క్రాప్‌ ఏరియా సోన్‌ మాడ్యూల్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement