కీలక నిర్ణయం: కేసీఆర్‌ 1500 ఇక పడవు! | TS Government Decides To Pay Cut 50 Percent For The May Month | Sakshi
Sakshi News home page

తెలంగాణ: మే నెలలోనూ జీతాల్లో కోతలే!

Published Wed, May 27 2020 8:45 PM | Last Updated on Wed, May 27 2020 10:21 PM

TS Government Decides To Pay Cut 50 Percent For The May Month - Sakshi

సీఎం కేసీఆర్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

‘తెలంగాణ రాష్ట్రానికి ప్రతీ నెలా 12వేల కోట్ల వరకు ఆదాయం రావాలి. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయింది. మే నెలలో కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన 982 కోట్ల రూపాయలతో కలిపి కేవలం 3,100 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదు. ఫలితంగా కొద్ది మొత్తంలోనే ఆదాయం వచ్చింది. ఈ డబ్బులతోనే అన్ని అవసరాలు తీరాలి. రాష్ట్రం ఏడాదికి 37,400 కోట్ల రూపాయలను అప్పులకు కిస్తీలుగా చెల్లించాలి. ఇవి ప్రతీ నెలా ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. 
(చదవండి: బోరు బావిలో పడిపోయిన మూడేళ్ల చిన్నారి!)

అప్పులను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం ఆ పని చేయలేదు. దీంతో కిస్తీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పూర్తిగా చెల్లించాలంటే మూడు వేల కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఖజానా ఖాళీ అవుతుంది. ఇక ఏ చెల్లింపు, ఏ పనీ చేసే వీలుండదు. కాబట్టి తగిన వ్యూహం అనుసరించాలి’ అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులతో చర్చించిన అనంతరం సీఎం ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు

  • అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి.
  • ఆసరా పెన్షన్లను యధావిధిగా అందించాలి.
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని మే నెలలో కూడా అందించాలి.
  • లాక్‌డౌన్‌ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు  మళ్లీ పని దొరకుతుంది. కాబట్టి ప్రతీ కుటుంబానికి నెలకు 1500 రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం మే నెల నుంచి కొనసాగదు.
  • ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి.
  • హైదరాబాద్‌లో రేపటి నుంచి మాల్స్ మినహా అన్ని రకాల షాపులకు అనుమతి
  • ఇప్పటివరకు ఒకషాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు
  • దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం
  • ఎక్కువ షాపులు తెరిచి తక్కువ మంది ఉండేలా చూడాలని నిర్ణయం

(చదవండి: మంథని జైలు మరణంపై హైకోర్టు విచారణ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement