సాక్షి, హైదరాబాద్: దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన జూన్ 2వ తేదీ నుంచి జారీ అవుతున్న.. ఈ ప్రాంతానికి చెందిన వారి పాస్‌పోర్టుల్లో తెలంగాణ స్టేట్ అని ముద్రితమయ్యాయి. తెలంగాణలోని 10 జిల్లాల్లో ఎక్కడి నుంచి దరఖాస్తు వచ్చినా ఆ పాస్‌పోర్ట్‌లో తెలంగాణ స్టేట్ అని ఉంటుంది. ఇది గతంలో ఆంధ్రప్రదేశ్ అని ఉండేది. అదే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 13 జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని పొందుపరిచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 8 జిల్లాలకు సంబంధించిన పాస్‌పోర్ట్‌లు జారీ అవుతున్నాయి.
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు మాత్రం విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పనిచేస్తోంది. దరఖాస్తులు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల నుంచి వచ్చినా జారీ మాత్రం హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాల నుంచే జరుగుతున్నాయి. కాగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్‌పోర్ట్‌లు పొంది ఇప్పుడు తెలంగాణ జిల్లాల నుంచి పాస్‌పోర్ట్‌కు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నా ఆయా పాస్‌పోర్ట్‌లు తెలంగాణ పేరు మీదే ఉంటాయి. జూన్ రెండో తేదీ నుంచి జారీ చేసిన పాస్‌పోర్ట్‌లలో ఎప్పటిలాగే హైదరాబాద్ నుంచే ఎక్కువగా ఉన్నాయి.
పాస్‌పోర్టుల్లో తెలంగాణ స్టేట్
Published Sat, Jun 7 2014 12:46 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement
Advertisement