ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రభావంతో పోలవరం ప్రాజెక్ట్‌కు కూడా కేంద్ర ప్రభుత్వం జాతీయహోదా ప్రకటించింది.
వేలేరుపాడు, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రభావంతో పోలవరం ప్రాజెక్ట్‌కు కూడా కేంద్ర ప్రభుత్వం జాతీయహోదా ప్రకటించింది. దీనికి కేంద్ర కేబినేట్ గురువారం ఆమోదం తెలిపినట్లు హాంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. ఇప్పటికే అన్ని అనుమతులు పొందిన పోలవరానికి జాతీయ హోదా లభించడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి. ఈ హోదాతో ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రూ. 5, 500 కోట్లు కేంద్రం నుంచే రానున్నాయి. ఇక దీని ఆర్థిక వ్యవహారాలన్నీ కేంద్రం ఆధీనంలోనే ఉంటాయి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దీనికి జాతీయ హోదా కోసం తీవ్ర కృషి చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 300 టీఎంసీల గోదావరి జలాలను వినియోగంలోకి తేవాలని, 80 టీఎంసీలను కృష్ణాకు మళ్లించాలని, మరో 24 టీఎంసీలను విశాఖపట్టణానికి తరలించాలని, 960 మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో మూడు జిల్లాల్లోని (ఖమ్మం,తూర్పు,పశ్చిమ గోదావరి) 9 మండలాలకు చెందిన 276 జనావాసాలు నీటమునగనున్నాయి. 1,31,496 మంది నిర్వాసితులు కానున్నారు. ఇందులో 65,309 (50 శాతం) మంది అడవిని నమ్ముకున్న ఆదివాసీలే.
ఎక్కువ భాగం ముంపు ప్రభావం ఖమ్మం జిల్లా పైనే ఉంది. మన జిల్లాలోని ఏడు మండలాల్లో 205 గ్రామాల్లో 38 వేల కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. వేలాది ఎకరాల వ్యవసాయ భూమితోపాటు అటవీభూములు కూడా నీటమునగనున్నాయి. ముంపునకు గురయ్యే అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా అడవులు పెంచేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 430 కోట్లు విడుదల చేసింది. అంతేకాకుండా దీని నిర్మాణానికి సుమారు 1.18 లక్షల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ భూమి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఖమ్మం, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఉంది. ఇప్పటి వరకు సుమారు 50 వేల ఎకరాలు సేకరించారు. ఖమ్మం జిల్లాలో నీటిపారుదల శాఖ అందించిన లెక్కల ప్రకారం 72 వేల ఎకరాలకు నష్టపరిహారం అందించాల్సి ఉంది.
ఇందులో ఇప్పటివరకు ప్రభుత్వం 22,500 ఎకరాలకు రూ.165 కోట్ల మేర పరిహారం అందించింది. ఇంకా 49,500 ఎకరాలకు సుమారు రూ. 400 కోట్లకు పైగా పరిహారం చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా గిరిజనులకు భూమికి బదులు భూమి 32,220 ఎకరాలు అధికారిక లెక్కల ప్రకారమే చూపించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 1695 ఎకరాలు మాత్రమే గుర్తించారు. అలాగే నిలిచిపోయిన పునరావాస పనులు, గ్రామాలు ఖాళీచేసే ప్రక్రియ కూడా పుంజుకోనుంది.